బిగ్ డిబేట్‌: వైసీపీ... ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వృద్ధుల పార్టీనా.. ?

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వైసీపీకి యువ నాయ‌కులు క‌రువ‌య్యారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

Update: 2026-10-27 17:30 GMT

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వైసీపీకి యువ నాయ‌కులు క‌రువ‌య్యారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర లోని మూడు జిల్లాల్లో విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రంలో వైసీపీకి యువ నేత‌లు పెద్దగా క‌నిపించ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో టీడీపీ, జ‌న‌సేనల‌కు మాత్రం అటు యువ‌త‌, ఇటు సీనియ‌ర్ నాయ‌కులు కూడా భారీ సంఖ్య‌లోనే ఉన్నారు. కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. 60 + వ‌య‌సున్న నాయ‌కులే ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను ఢీ కొట్టే స్థాయిలో వైసీపీ యువ రాజ‌కీయాలు చేయ‌లేక పోతోంద‌న్న చ‌ర్చ ఉంది.

మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వార‌సుడు తెర‌మీదికి వ‌చ్చినా.. ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకునేందు కు రెడీ అయ్యారన్న ప్ర‌చారం జ‌రుగుతోంది.దీని  పై ఇరు వ‌ర్గాల మ‌ధ్య ర‌హ‌స్య చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇటీవ‌ల త‌న‌పై ఉన్న కేసుల విష‌యంలో వైసీపీ నాయ‌కులు స‌హ‌క‌రించ‌ లేద‌ని.. పార్టీ అధిష్టానం కూడా.. మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును ప‌రామ‌ర్శించినప్ప‌టికీ.. క‌నీసం త‌మ కుటుంబాన్ని ప‌రామ ర్శించేందుకు ముందుకు రాలేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో యువ నేత‌గా ఉన్న చిరంజీవి నాగ్ పార్టీ మార్పున‌కే మొగ్గు చూపుతున్నారు.

ఇక‌, తాజాగా శ్రీకాకుళంలో 70 + వ‌య‌సున్న గుండ ల‌క్ష్మీదేవిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి ఒక‌ప్పుడు గుండ కుటుంబానికి హ‌వా ఉండేది. కానీ, మారుతున్న కాలాన్ని.. యువ‌త ఆశ‌ల‌ను అంచ‌నా వేసిన టీడీపీ ఆమెను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌క్క‌న పెట్టింది. ఇక‌, తాజాగా మేయ‌ర్ పీఠాన్ని ఆశించినా.. వ‌య‌సు, ప్ర‌జ‌ల్లో ఉన్న హ‌వాను దృష్టిలో పెట్టుకుని అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌న్న చ‌ర్చ ఉంది. దీంతో గుండ ల‌క్ష్మీదేవి సైకిల్ దిగి.. ఫ్యాన్ పంచ‌న చేరిపోయారు. కానీ, ఆమె వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న వాద‌న అయితే బ‌లంగా వినిపిస్తోంది.

ఇక‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంలో ప్ర‌స్తుతం బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన వంటి వృద్ధ నేత‌లే వైసీపీకి ఆద‌రువుగా మారారు త‌ప్ప‌.. యువ నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. విశాఖ‌లోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌వైపు టీడీపీ త‌ర‌ఫున పెద్ద ఎత్తున యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌గా.. వైసీపీ మాత్రం ఈ వృద్ధ నేత‌ల‌తోనే ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో యువ‌త‌ను ఏవిధంగా ఆక‌ర్షిస్తుంద‌న్న‌ది చూడాలి. ఏదేమైనా.. ప్ర‌స్తుతం వైసీపీకి యువ‌త కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News