నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని సమ్మోహితం చేశాడు.

Update: 2026-10-27 12:38 GMT

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని సమ్మోహితం చేశాడు. కివీస్ బౌలర్లను ఏమాత్రం కోలుకోనీయకుండా బౌండరీలు.. సిక్సర్ల వర్షం కురిపించాడు. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా చూపిన అగ్రసివ్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుత ప్రదర్శనపై మాజీ భారత క్రికెటర్, అభిషేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరించిన యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. తన శిష్యుడిని ఆటపట్టిస్తూనే.. అతని ఆటకు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం యువీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అభిషేక్ ధనాధన్ బ్యాటింగ్‌ను చూసిన యువరాజ్ సింగ్ తన పాత రికార్డును గుర్తు చేసుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ ప్రదర్శనపై స్పందిస్తూ యువీ "అభిషేక్.. నువ్వు ఇప్పటికీ 12 బంతుల్లో 50 పరుగులు కొట్టలేకపోయావ్.. అయితే నేను కూడా ఎప్పుడూ 30 లేదా 34 బంతుల్లో సెంచరీ చేయలేదు. చాలా అద్భుతంగా ఆడావు. ఇద్దరు లెఫ్ట్‌హ్యాండర్లు తమ సొంత పెరట్లో సరదాగా ఆడుకుంటున్నట్లు అనిపించింది" అని వ్యాఖ్యానించారు. తన శిష్యుడి ప్రదర్శనలో తన పాత దూకుడును చూసుకున్న యువీ ఈ విధంగా ప్రశంసించడం క్రికెట్ వర్గాల్లో విశేషంగా నిలిచింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని కివీస్ బౌలింగ్ ఎటాక్‌ను నిర్వీర్యం చేశాడు. గతంలోనే 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ మరొకసారి తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాడు. భారత్ కేవలం 2.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటడమే కాకుండా తొలి ఓవర్‌లోనే 26 పరుగులు రాబట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సరికొత్త రికార్డులు లిఖించారు. టీ20 చరిత్రలోనే అత్యంత వేగంగా కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన జట్టుగా భారత్ నిలిచింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఏకంగా 118 పరుగులు సాధించి ఆల్-టైమ్ రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా కేవలం 7.2 ఓవర్లలోనే 150 పరుగుల మైలురాయిని చేరుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్‌లోనే అత్యధికంగా 17 సార్లు సిక్స్ బాదిన ప్రత్యేక ఘనతను అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వ్యక్తిగత గణాంకాలు సైతం ఆకట్టుకున్నాయి. న్యూజిలాండ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ 4 శతకాలతో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 297.36 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ సాధించగా అంతకుముందు అఫ్గానిస్థాన్‌పై 317.64 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ బాదిన రికార్డు కూడా ఇతని పేరిటే ఉంది.

199 పరుగుల కొండంత లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. అంటే ఇంకా 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం టీమిండియా టీ20 చరిత్రలో అత్యుత్తమ ఛేజింగ్‌లలో ఒకటిగా నిలిచింది. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లలో భారత బ్యాటింగ్ ఆర్డర్ సాధించిన ఈ విజయం అగ్రెసివ్ క్రికెట్‌కు నిదర్శనంగా నిలిచింది. గురువు యువరాజ్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న అభిషేక్ శర్మ, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News