జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తల్లి ఒక నంబర్ అంటే.. భార్య మరో నంబర్ అనడంతో ఇంట్లో చిన్నపాటి వర్గపోరు స్టార్ట్ అయింది.

Update: 2026-10-26 14:39 GMT

క్రికెట్ పిచ్ మీద బౌలర్లకు చుక్కలు చూపించి.. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బంతి ఎవరి చేతిలో ఉన్నా.. ఎలా వస్తున్నా తన మార్కు దూకుడుతో స్టేడియాన్ని హోరెత్తించడం ఆయన స్టైల్. అయితే మైదానంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన 'ముల్తాన్ కా సుల్తాన్'.. తన ఇంట్లో మాత్రం ఓ రకమైన 'ధర్మసందేహం'లో పడిపోయారట. అదేనండీ.. జెర్సీ నంబర్ వివాదంలో..

2005-06 సమయంలో సెహ్వాగ్ కెరీర్‌లో కొద్దిగా బ్యాడ్ ప్యాచ్ నడిచింది. ఆ సమయంలో ఫామ్ అందుకోవడానికి ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా ఇక్కడే అసలు సినిమా మొదలైంది. కొడుకు ఆటతీరు మెరుగుపడాలని భావించిన సెహ్వాగ్ మాతృమూర్తి వెంటనే రంగంలోకి దిగి ఓ జ్యోతిష్యుడిని సంప్రదించారు. ఆ గురూజీ చెప్పిన సలహా మేరకు జెర్సీ నంబర్‌ను 44 నుంచి 46కు మార్చేశారు సెహ్వాగ్. కానీ దురదృష్టవశాత్తు ఆ నంబర్ కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు.

ఇక ఇక్కడితో ఆగిపోతే అది సెహ్వాగ్ కథ ఎందుకు అవుతుంది? కథలో అసలైన ట్విస్ట్ ఆయన భార్య ఎంట్రీతో వచ్చింది.. భార్య గారికి కూడా జ్యోతిష్యంపై మంచి పట్టు ఉండటంతో ఆమె వేరే జ్యోతిష్య పుస్తకాలు చదివి 'మీకు రెండవ నంబర్ కలిసొస్తుంది' అని సలహా ఇచ్చారట. దాంతో సెహ్వాగ్ మరో నంబర్‌తో కూడిన జెర్సీని వేసుకోవడం ప్రారంభించారు.

ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తల్లి ఒక నంబర్ అంటే.. భార్య మరో నంబర్ అనడంతో ఇంట్లో చిన్నపాటి వర్గపోరు స్టార్ట్ అయింది. ఇద్దరి మనసులు నొప్పించడం ఇష్టం లేక సెహ్వాగ్ ఏకంగా రెండు రకాల జెర్సీలను రెడీ చేయించుకున్నారట.. ఒక మ్యాచ్‌లో అమ్మ చెప్పిన నంబర్ జెర్సీ.. మరో మ్యాచ్‌లో భార్య చెప్పిన నంబర్ జెర్సీ వేసుకుంటూ రెండు పడవల ప్రయాణం చేశారు.

కానీ ఐసీసీ నిబంధనలు, మ్యాచ్‌రూల్స్ ప్రకారం టోర్నమెంట్‌లో ఒకే జెర్సీ నంబర్ తో ఆడాల్సి రావడంతో సెహ్వాగ్ బండారం బయటపడింది. రెండు జెర్సీలతో కాలక్షేపం చేయడం కుదరకపోవడంతో ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అమ్మా కాదు.. పెళ్లాం కాదు.. ఇద్దరిలో ఎవరి మాట విన్నా ఇంట్లో మరో యుద్ధం తప్పదని గ్రహించి ఏకంగా జెర్సీపై నంబరే లేకుండా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారట..

మైదానంలో బౌలర్ల వ్యూహాలను చిత్తు చేసిన సెహ్వాగ్.. ఇంట్లో మాత్రం ఇద్దరు వీరనారుల మధ్య నలిగిపోయి.. చివరకు 'నంబరే వద్దు నాగోల వద్దు' అంటూ తెలివిగా సైడ్ అయిపోయారు. అదృష్టం కంటే ప్రాక్టీస్, ఆటపై నమ్మకమే ముఖ్యమని ఈ ఘటన ద్వారా సరదాగా నిరూపించారు మన వీరూ భాయ్.. చివరకు నంబర్‌నే వదిలేసి సమస్యకు పరిష్కారం కనుగొన్న ఆయన కథ ఇప్పుడు క్రికెట్ అభిమానులను నవ్విస్తోంది.

Tags:    

Similar News