ట్రంప్‌పై మళ్లీ ఎప్‌స్టీన్‌ సెగ.. 50 పేజీల రిపోర్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు..

మరి ఆ 50 పేజీల్లో ఉన్న అసలు 'విషయం' ఏమిటయ్యా అంటే... "మాకు అనుమానాలు ఉన్నాయి కానీ ప్రత్యక్ష ఆధారాలు మాత్రం లేవు" అని వాళ్లే ఒప్పుకోవడం ఈ డ్రామాకే పెద్ద హైలైట్.

Update: 2026-10-27 15:30 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ లైంగిక నేరాల కేసు... అమెరికా రాజకీయాల్లో ఎప్పుడు పాతబడిపోతుందా అని చూస్తుంటే.. డెమోక్రాట్లు దానికి మళ్లీ సరికొత్త రంగులు అద్ది మార్కెట్లోకి తీసుకొచ్చేశారు.. ఈసారి ఏకంగా 50 పేజీల భారీ నివేదికతో వచ్చి డోనాల్డ్ ట్రంప్ , అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్‌లపై బాంబులు పేల్చామని సంబరపడిపోతున్నారు.

మరి ఆ 50 పేజీల్లో ఉన్న అసలు 'విషయం' ఏమిటయ్యా అంటే... "మాకు అనుమానాలు ఉన్నాయి కానీ ప్రత్యక్ష ఆధారాలు మాత్రం లేవు" అని వాళ్లే ఒప్పుకోవడం ఈ డ్రామాకే పెద్ద హైలైట్. 1990ల కాలం నాటి విషయాలను తోడి "ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి.. ఆయన కూడా ఇందులో చురుగ్గా పాల్గొని ఉంటారు" అని డెమోక్రాట్లు ఆరోపణల విందు భోజనం వడ్డించారు. ఓ మహిళ చెప్పిన మాటల ఆధారంగా ఈ ఆరోపణలు చేశారట. అయితే ఆ మాటలకు ఆధారమైన పేపర్లు, రుజువులు ఎక్కడరా నాయనా అంటే... "అవి తర్వాత చూద్దాం.. ప్రస్తుతానికి అనుమానించడమే మా పని" అన్నట్టుంది వారి వైఖరి.

ఇక మన అమెరికా న్యాయశాఖ కూడా తక్కువ తినలేదు. "బాబోయ్ ఇప్పటికే 30 లక్షల పత్రాలను బయటపెట్టాం.. కావాలంటే మార్పులు లేని కాపీలు కూడా చూసుకోండి" అని చేతులెత్తేసింది. ఎఫ్‌బీఐ ఏళ్ల తరబడి దర్యాప్తు చేసి పక్కన పడేసిన విషయాలను మళ్లీ తవ్వి తీసి.. 'రాజకీయ రచ్చ' చేయడం డెమోక్రాట్లకు అలవాటైపోయిందని న్యాయశాఖ ఉల్టా కౌంటర్ ఇచ్చింది.

మరోవైపు అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ మీద కూడా డెమోక్రాట్లు ఒక కన్నేశారు. ఎప్‌స్టీన్ ముఖ్య సహచరి గిస్లేన్ మాక్స్‌వెల్‌ను కలవడమే కాకుండా ఒక బాధితురాలి పేరు బయటకు రాకుండా రహస్యంగా చక్రం తిప్పారని విమర్శలు గుప్పించారు.

ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా నివేదికల పేరుతో బురద చల్లే రాజకీయాలు.. "మాకేమీ తెలియదు" అని ఎదురు దాడి చేసే నాయకులు... అమెరికా ప్రజాస్వామ్యం ఎంత కామెడీగా మారిందో ఈ ఎప్‌స్టీన్ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. ఆధారాలు లేని ఆరోపణలు దోషులను తేల్చవు సరే.. కానీ టీవీ ఛానెళ్లకి, సోషల్ మీడియాకి మాత్రం కావాల్సినంత రాజకీయ వినోదాన్ని పంచిపెడుతున్నాయి.

Tags:    

Similar News