పులివెందులలో తొలిసారి సైకిల్ జోరు.. ఒక్కటి తప్ప అన్నీ ఎంపీటీసీలు ఏకగ్రీవం..కుప్పం రివేంజ్?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఘోర పరాజయం ఎదురైంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఘోర పరాజయం ఎదురైంది. పులివెందుల మున్సిపాలిటీతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కూటమి జోరు చూపించింది. నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయం నమోదు చేసింది. జగన్ సొంత ఇలాకా అయిన పులివెందులలో విజయంపై కూటమి నేతలు సంబరాలు చేసుకుంటుండగా, విపక్షం వైసీపీ మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తమకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వకుండా, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపిస్తోంది. ఏదిఏమైనా చరిత్రను తిరగరాస్తూ టీడీపీ కూటమి నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలను ఏకగ్రీవంగా దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కంచుకోట. 1978 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 1978లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తర్వాత రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి, భార్య విజయమ్మ, కుమారుడు జగన్మోహనరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం సృష్టించినా పులివెందులను మాత్రం తాకలేకపోయింది. అప్పుడే కాదు ఆ తర్వాత జరిగిన చాలా ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీ ఎప్పుడూ విజయం సాధించిన చరిత్ర లేదని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ టీడీపీ కూటమి పులివెందుల నియోజకవర్గంలో ఏడు మండలాలను క్లీన్ స్వీప్ చేసింది. నియోజకవర్గం పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 64 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పులివెందులలో 5, వేముల 8, చెక్రాయపేట 9, తొండూరు 8, సింహాద్రిపురం 8 చొప్పున కూటమి గెలుచుకుంది. ఈ ఆరు మండలాల్లో వైసీపీ కనీసం పోటీలో కూడా దిగలేకపోయిందని అంటున్నారు. ఇక వేంలపల్లి మండలంలో 18 స్థానాలకు 17 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఏడు జడ్పీటీసీ స్థానాలకు 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
ఇక పులివెందుల మున్సిపాలిటీలో కూడా టీడీపీ 20 స్థానాలను దక్కించుకుంది. ఇక్కడ మరో 20 కౌన్సిల్ స్థానాలతోపాటు చైర్మన్ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఫలితాలతో విపక్షం వైసీపీ కోలుకోలేని దెబ్బతిన్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి అధికారం ముందు వైసీపీ చేతులెత్తేయాల్సిన పరిస్థితి రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి పులివెందులలో టీడీపీకి ఈ స్థాయి విజయాలు ఎప్పుడూ లేవని అంటున్నారు. ఒకటి రెండు మండలాల్లో మాత్రమే ఆ పార్టీ ఉనికి ఉండేదని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ 25 నుంచి 27 శాతం వరకు ఓట్లు సాధించే టీడీపీ గత ఏడాది జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయి విజయం సాధించింది. ఆ నాటి నుంచి పులివెందులను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పావులు కదిపిన టీడీపీ సునాయాశంగా చేరుకుందని విశ్లేషిస్తున్నారు.
కుప్పం రివేంజ్?
మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కూటమి జోరు ప్రదర్శించడాన్ని కుప్పం రివేంజ్ ప్లాన్ అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపాలిటీతోపాటు మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీకి అవకాశం దక్కనీయకుండా వైసీపీ విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు ఆ ఓటమికి సమాధానంగా పులివెందులలో తాము ఏకగ్రీవంగా విజయం సాధించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక పులివెందులలో 90 శాతం స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు కావడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏకగ్రీవం అయితే సంబంధిత నియోజకవర్గ ఇంచార్జికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని జగన్ రెడ్డి ఇదివరకు హెచ్చరించారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏకగ్రీవాలు అయ్యాయని, జగన్ రెడ్డి పోటీ చేయకుండా తప్పుకుంటారా? అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.