2028 రాజకీయంలో కేసీఆర్ బిగ్ మాస్టర్ ప్లాన్
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఒక కొత్త మలుపు కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి.
ఎగిసిపడే ప్రతి అలకూ తిరిగి పైకి లేచే నైజం ఉంటుంది... అనుభవించిన ఓటమి కంటే.. గుండెల్లో రగిలే ఆత్మగౌరవమే నాయకుడిని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి నడిపిస్తుంది.. అలాంటి ఒక ఉద్వేగభరితమైన పోరాటానికి.. తన రాజకీయ జీవితంలో ఎన్నో తుఫాన్లను తట్టుకుని నిలబడిన గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ సిద్ధమవుతున్నారు. 2004లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నాటి చారిత్రాత్మక వ్యూహాన్ని తిరిగి 2029లో పునరావృతం చేస్తూ... ఒకవైపు గజ్వేల్ గడ్డపై ఎమ్మెల్యేగా.. మరోవైపు ఉత్తర తెలంగాణ ఉద్యమ నేలపై ఎంపీగా సమరశంఖం పూరించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే వార్త ఇప్పుడు ప్రతి గులాబీ కార్యకర్త గుండెల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఒక కొత్త మలుపు కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. విజయాలు.. అపజయాలు రాజకీయాల్లో సహజమే అయినా... మళ్లీ పుంజుకోవడం.. మళ్లీ ప్రజాక్షేత్రంలో తిరుగులేని శక్తులుగా నిలబడటమే అసలైన నాయకత్వానికి గురుతు. గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ తన మార్క్ రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
2029 రాబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక సరికొత్త, అసాధారణమైన వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవైపు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే మరోవైపు ఉత్తర తెలంగాణలోని ఒక కీలక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు గులాబీ అధినేత సిద్ధమవుతున్నారట..
2004 నాటి సెంటిమెంట్... పూర్వ వైభవం దిశగా గులాబీ జెండా
ఇది కేవలం ఒక ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు... తెలంగాణ గుండెచప్పుడును మళ్లీ మీటే ఒక ఉద్వేగభరితమైన ప్రయత్నం.. 2004 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా.. సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి సాధించిన అద్భుత విజయం.. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన తీరు ఎవరూ మరచిపోలేరు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత అదే 2004 నాటి సెంటిమెంట్‌ను.. అదే వ్యూహాన్ని 2029లో పునరావృతం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర తెలంగాణ ఎప్పుడూ గులాబీ దళానికి బలమైన కోట. ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా నిలిచిన ఆ గడ్డపై కేసీఆర్ స్వయంగా ఎంపీగా పోటీ చేస్తే... ఆ ప్రాంతమంతటా ఒక కొత్త చైతన్యం వెల్లువిరుస్తుందని.. కేడర్‌లో నూరిపోసినట్లు నవనాడుల్లో ఉత్సాహం నిండుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేయడం ద్వారా ఉత్తర తెలంగాణలోని మెజారిటీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయవచ్చని పార్టీ అంచనా వేస్తోంది.
జాతీయ రాజకీయం... రాష్ట్రంలో తిరుగులేని అధికారం
ఈ మాస్టర్ ప్లాన్ వెనుక కేవలం రాష్ట్రంలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలనే భారీ లక్ష్యం ఉంది. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఎంత ముఖ్యమో... ఎంపీగా గెలిచి ఢిల్లీ పీఠం వద్ద తెలంగాణ గళాన్ని బలంగా వినిపించడం కూడా అంతే ముఖ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. గరిష్ట సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పే శక్తిగా బిఆర్ఎస్ ను నిలబెట్టాలనేది ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
సంచలనమా... సవాలా?
ఒక దశాబ్ద కాలం చేసిన అనుభవం, తెలంగాణను తీర్చిదిద్దిన శ్రమ, పడిలేచిన కెరటంలా మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న కేసీఆర్ మార్క్ రాజకీయం ఉమ్మడి తెలంగాణను మరోసారి ఊపేస్తుందనడంలో సందేహం లేదు. అయితే మారిన రాజకీయ సమీకరణలు.. ప్రత్యర్థుల వ్యూహాల నడుమ 2004 నాటి మ్యాజిక్‌ను కేసీఆర్ 2029లో మళ్లీ రీక్రియేట్ చేయగలుగుతారా? ఈ సరికొత్త వ్యూహంతో గులాబీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి రాజకీయ సంచలనానికి తెరతీస్తారా లేక ఈ వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? అనేది కాలమే నిర్ణయించాలి.
తన రాజకీయ జీవితంలో ఎన్నో తుఫాన్లను తట్టుకుని నిలబడిన ఈ వ్యూహకర్త వేసే తదుపరి అడుగుపైనే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.