ఒక జపాన్...ఒక ఆంధ్ర...ప్రకృతి కన్నెర్ర !

కొన్ని ప్రాంతాలు భౌగోళికంగా అవి ఉన్న చోటుని బట్టి ప్రకృతి కన్నెర్రకు గురి అవుతూంటాయి.

Update: 2026-10-27 13:33 GMT

కొన్ని ప్రాంతాలు భౌగోళికంగా అవి ఉన్న చోటుని బట్టి ప్రకృతి కన్నెర్రకు గురి అవుతూంటాయి. ఆ విధంగా అవి శాపగ్రస్థ గా అవస్థలు పడుతూంటాయి. ఈ ప్రపంచంలో జపాన్ దేశానికి భూకంపాల కేంద్ర స్థానం అని పేరు. ఆ విధంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటూ నిరంతరం సతమతమవుతూ జపాన్ కొనసాగుతోంది. ఆంధ్రాను తీసుకుంటే భారీ తుఫానులకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఈ తుఫానుల మూలంగా ఆస్థి నష్టం ఎప్పుడూ వేల కోట్లలో ఉంటూ వస్తోంది. ఇపుడు అర్నాబ్ తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. దీంతో చిగురుటాకులా వణుకుతోంది. జపాన్ నిరంతరం భూకంపాలతో వణికిపోతుంటే ఆంధ్రప్రదేశ్ తరచూ భారీ తుఫానులు వరదలతో తీవ్రంగా నష్టపోతోంది. భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ రెండు ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.

భూకంపాల భూమి :

జపాన్ దేశాన్ని భూకంపాల భూమి గా అభివర్ణిస్తారు. ఇక జపాన్ దేశం చూస్తే పసిఫిక్ మహాసముద్రం లోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. దాంతో టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల ప్రతి ఏటా వేల సంఖ్యలో భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవించే ప్రాంతంగా ఇది ఉంది. జపాన్ లో ప్రతీ రోజూ మైక్రో భూకంపాలు అంటే చాలా చిన్నవి రోజుకు వందలాదిగా నమోదవుతాయి.

కేరాఫ్ తుఫాన్ గా :

ఇక ఆంధ్రా పరిస్థితి తీసుకుంటే తుఫాన్లకు కేరాఫ్ గా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 974 కిలోమీటర్ల మేర అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు తీవ్ర అల్పపీడనాల కారణంగా రాష్ట్రం ప్రతి ఏటా భారీ తుఫానులు, పిడుగుపాట్లు వరదల బారిన పడుతోంది. ఇలా వచ్చి పడుతున్న తుఫానులు తీర ప్రాంత జిల్లాల్లోని వ్యవసాయాన్ని మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

దశాబ్ద కాలంలో :

ఇదిలా ఉంటే గత దశాబ్దం పైగా కాలంలో భయంకరమైన తుఫాన్లు అనేకం ఏపీ కేంద్రంగా సంభవించి పెద ఎత్తున నష్టాన్ని కలిగించాయి. 2014 అక్టోబర్ లో హుదూద్ తుఫాన్ విశాఖలో తీరాన్ని దాటి మొత్తంగా నగరాన్నే కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. దీంతో 22 వేల కోట్ల దాకా ఆనాడు భారీ నష్టం సంభవించింది. ఇక 2018 డిసెంబర్ లో శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాన్ హడలెత్తించింది. ఆరు వందల కోట్ల రూపాయల దాకా అపారమైన నష్టం వాటిల్లింది. 2025 లో వచ్చిన మోంధా తుఫాన్ అయితే ఏడు వేల కోట్ల అత్యంత భారీ నష్టాన్ని కష్టాన్ని ఏపీకి మిగిల్చింది.

ఆర్నాబ్ తో ముప్పు :

ఈ నేపథ్యంలో ఇపుడు ఆర్నబ్ తుఫాన్ ఓ రోజంతా ఏపీ మీదనే ఉంది. ఏపీలో మూడు రోజుల పాటు ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఏపీ ఈసారి ఎంత మేరకు నష్టం చవి చూస్తుంది అన్నది అయితే సర్వత్రా ఆందోళన గానే ఉంది. మౌలిక సదుపాయాలు ప్రధానంగా తుఫాన్ల వల్ల దెబ్బ తింటాయి. వాటిని పునరుద్ధరించుకోవడం అంటే ఆర్థికంగా కష్టంతో కూడుకున్న వ్యవహారమే అవుతోంది. ఇక ప్రకృతి గతంలో మాదిరిగా లేదు, విలయంగా మారి విరుచుకుపడుతోంది. దానికి అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంశం అసలైన కారణంగా చెబుతారు. దాంతో ప్రకృతి పగ పట్టినట్లుగా కత్తులు దూస్తోంది. అలా ఏపీకి తుఫాన్ల గండం అధికమవుతోంది అని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎలా అధిగమించడం అంటే ప్రాణ నష్టాన్ని మాత్రం లేకుండా చూసుకోవడంలో ఇప్పటికైతే విజయం సాధించడం జరిగింది. ముందు ముందు ఆస్తి నష్టాన్ని అదుపు చేయడం ఎలా అన్నదే ఆలోచించాల్సి ఉంది.

Tags:    

Similar News