తెరవెనుక లోకేశ్.. ఏకగ్రీవాల స్కెచ్ యువనేతదే..!

మున్సిపల్ ఎన్నికలతోపాటు జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి దూకుడు చూపించేలా మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారని చెబుతున్నారు.

Update: 2026-10-27 13:30 GMT

స్థానిక ఎన్నికల్లో మంత్రి లోకేశ్ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్నికల విషయంలో మంత్రి లోకేశ్ ఎక్కడా తలదూర్చినట్లు పైకి కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా అన్నీ తానే అన్నట్లు లోకేశ్ నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విపక్షం వైసీపీని చావు దెబ్బ తీసే వ్యూహాన్ని లోకేశ్ సిద్ధం చేశారని అంటున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఈ సారి పోటీ చేసిన ప్రతి చోటా విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెబుతున్నారు. పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితమవుతున్న లోకేశ్ పార్టీ విజయం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికలతోపాటు జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి దూకుడు చూపించేలా మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారని చెబుతున్నారు. నిజానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మంత్రి లోకేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియపై ఎక్కడా మాట్లాడలేదు. కనీసం పార్టీ అభ్యర్థుల ఎంపికపైనా ఆయన తలదూర్చినట్లు వార్తలు రాలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై తీవ్రమైన గందరగోళం నెలకున్నప్పుడు సైతం తనకు ఏమీ పట్టనట్లే వ్యవహరించారని అంటున్నారు. అయితే ఇదంతా పైకి కనిపించే కోణమేనని, వాస్తవానికి ఎన్నికల వ్యూహం అంతా మంత్రి లోకేశ్ సిద్ధం చేశారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

దీనికి నిదర్శనంగా పార్టీ గతంలో ఎన్నడూలేనట్లు స్థానిక ఎన్నికల్లో పనిచేస్తోందని చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీడీపీ.. ఇప్పుడు అదే జోరు చూపించడం వెనుక మంత్రి లోకేశ్ వ్యూహం ఉందని అంటున్నారు. ప్రత్యర్థిని చావు దెబ్బ తీయడమే లక్ష్యంగా కేడర్ ను నడపాలని లోకేశ్ డిసైడ్ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లా నాయకత్వాలకు సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చారని చెబుతున్నారు. లోకేశ్ సహాయ సహకారాలు ఉండటంతోనే జిల్లాల్లో టీడీపీ కేడర్ దూకుడు చూపిందని అంటున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో ఏకగ్రీవమైన 17 మున్సిపాలిటీల్లో పదిహేనింటిని టీడీపీ దక్కించుకుందని వివరిస్తున్నారు. ఇందులో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నవి, అందునా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి పట్టున్న ప్రాంతాలేనని అంటున్నారు.

స్థానిక ఎన్నికలు మొదలైన నుంచి లోకేశ్ తెరచాటు వ్యూహాలతోనే పార్టీని నడుపుతున్నారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాబు వంటి విషయాలను పార్టీ నేతలకు అప్పగించిన మంత్రి లోకేశ్ అధిష్టానం తరపున చేయాల్సిన పనులు అన్నీ సైలెంటుగా నడిపేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో తీవ్ర అణచివేత ఎదుర్కొన్న కార్యకర్తలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ఎంపిక జరిగేలా లోకేశ్ పర్యవేక్షించారని అంటున్నారు. కొందరు అభ్యర్థుల పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సూచించడంతో జిల్లాల్లో నేతలు సైతం ఆశ్చర్యపోయారని అంటున్నారు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో దిగువ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని హైకమాండ్ ఆమోదించేదని, కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఇచ్చినా పరిమితం చేయడంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రధానంగా లోకేశ్ పాదయాత్రతోపాటు అంతకుముందు కేసులు ఎదుర్కొన్న నేతలు, కార్యకర్తలకు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కేలా మంత్రి లోకేశ్ చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News