తాడోపేడో తేల్చుకునేలా జగన్.. పులివెందుల పరిణామాలతో తీవ్ర నిర్ణయం!

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ప్రతిపక్షం వైసీపీకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు లేకపోవడాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.

Update: 2026-10-27 09:35 GMT

స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారా? తన సొంత నియోజకవర్గం, దశాబ్దాలుగా వైఎస్ కంచుకోటగా ఉన్న పులివెందులలో పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే ఔను అన్న సమాధానమే లభిస్తోంది. పులివెందులలో పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు మంగళవారం వచ్చిన జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఎన్నికల రోజు తాను పులివెందుల వస్తానని, ఎవరు వస్తారో రమ్మంటూ సవాల్ చేశారని అంటున్నారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ప్రతిపక్షం వైసీపీకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు లేకపోవడాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ దిశగా సంకేతాలిచ్చారని అంటున్నారు. పులివెందులలో సౌండ్ చేస్తే, రాష్ట్రమంతా మోగాలి. ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని కేడర్ కు పిలుపునిచ్చిన మాజీ సీఎం.. తన వాళ్లు (వైసీపీ కార్యకర్తలు)పై చేయి వేస్తే తనపై వేసినట్లేనని గుర్తించుకోవాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి వ్యాఖ్యలు బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు. పులివెందులలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన జగన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లు అడ్డుకున్నారని, మహిళలపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని, వచ్చేది జగన్ ప్రభుత్వమే అంటూ భరోసా ఇచ్చారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమికి అనుకూలంగా పనిచేసిన అధికారులు అందరిపైనా చర్యలు తీసుకుంటాం, రిటైర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు.

మొత్తానికి పులివెందులలో సగానికి పైగా వార్డులు ఏకగ్రీవం అవడాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. నామినేషన్లు వేయడానికి పార్టీ అభ్యర్థులు ఉన్నప్పటికి బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని జగన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో తమ సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారని అంటున్నారు. పులివెందుల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిగా జగన్ రెడ్డి పిన్ని లలితమ్మ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆ కారణంగా తానే స్వయంగా రంగంలో దిగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పోలింగ్ రోజు పులివెందుల వస్తానని, ఓటు వేస్తానని చెబుతున్న మాజీ సీఎం జగన్ రెడ్డి ఆ రోజు పోలీసులు దుందుడుకు చర్యలకు పాల్పడకూడదని ముందే వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. దీంతో పులివెందుల రాజకీయాలు హైటెన్షన్ గా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News