తుఫాన్ల దెబ్బకు అతలాకుతలం.. ఏపీకి మరో ముప్పుగా అర్నబ్!

గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన తుఫాన్లలో 2014లో వచ్చిన 'హుద్‌హుద్' మొదటిది.

Update: 2026-10-27 07:38 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2014 నుంచి వచ్చిన తుఫాన్లు సృష్టించిన బీభత్సం వల్ల కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడమే కాకుండా తీర ప్రాంత ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు ‘అర్నబ్’ పేరుతో మరో తుఫాను ఏపీ వైపు వస్తోందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ తుఫాను వల్ల ఎంత ముప్పు పొంచి ఉంది?గతంలో వచ్చిన తుఫాన్లు ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విశాఖను వణికించిన హుద్‌హుద్:

గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన తుఫాన్లలో 2014లో వచ్చిన 'హుద్‌హుద్' మొదటిది. విశాఖపట్నం తీరాన్ని తాకిన ఈ తుఫాను తీవ్ర గాలులతో నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇళ్లు, చెట్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఒక్క తుఫాను వల్లే రాష్ట్రానికి ఏకంగా రూ.21,908.49 కోట్ల మేర కోలుకోలేని ఆస్తి నష్టం సంభవించింది.

శ్రీకాకుళాన్ని దెబ్బతీసిన తిత్లీ:

హుద్‌హుద్ తుఫాను నష్టం నుంచి కోలుకుంటున్న ఉత్తరాంధ్రను 2018లో తిత్లీ తుఫాను ఇంకోసారి దెబ్బతీసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తోటలు, మత్స్యకారుల పడవలు ధ్వంసం కావడంతో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఈ తుఫాను వల్ల సుమారు రూ.539.52 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

మొంథా తుఫాను సృష్టించిన అలజడి:

ఇక ఇటీవల 2025లో వచ్చిన 'మొంథా' తుఫాను కూడా ఏపీకి ఊహించని నష్టాన్ని మిగిల్చింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ గాలుల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు రూ.6,350 కోట్ల ఆస్తి, పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇప్పుడు 'అర్నబ్' భయం.. ఎంత నష్టం కలిగిస్తుందో?:

తాజాగా ఏపీ వైపు తీవ్ర తుఫాను ‘అర్నబ్’ దూసుకొస్తోంది. ఈ తుఫాను వళ్ల ప్రస్తుతం గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత తుఫాన్ల కంటే దీని వేగం ఎక్కువగా ఉండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎంత నష్టం జరుగుతుందోనని భయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే, వరుస తుఫాన్ల కారణంగా ఏపీ తీర ప్రాంతం ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ఇక ఇప్పుడు ‘అర్నబ్’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News