అన్నీ ఏకగ్రీవంగానే...సుప్రీంకోర్టుకు ఈసీ!

ఇక అత్యధికంగా విపక్షాల విమర్శలకు తావిస్తున్న ఫారం 6 ని అయితే ఏ విధంగానూ సవరించలేదని ఈసీ స్పష్టం చేసింది.

Update: 2026-10-27 03:51 GMT

కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కీలక విషయాలు అన్నీ ప్రస్తావించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే అంటూ స్పష్టం చేసింది. ప్రధానంగా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగానే తీసుకున్నారని ఈసీ సుప్రీంకోర్టుకు తెలపడం విశేషం. ఇప్పటిదాకా దీని మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాత్రమే కాదు మొత్తం ముగ్గురు కమిషనర్లూ కలసి తీసుకునే నిర్ణయాలే అమలు అవుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌కు సీఈసీతో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు.

విభేదాలు కావు అవి :

ఇక చూస్తే ఇటీవల ఒక జాతీయ పత్రికలో ప్రచురించిన వార్తా కధనంలో సర్ ప్రక్రియకు సంబంధించిన 14 కీలక నిర్ణయాలలో సీఈసీకి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల మధ్య విభేదాలు వచ్చాయని వారు సర్ ప్రక్రియ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఉంది. అయితే అఫిడవిట్ లో మాత్రం సర్ ప్రక్రియకు సంబంధించి 2025 జూన్ 24, 2025 అక్టోబర్ 27, 2026 మే 14 తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం వరసగా జారీ చేసిన మూడు ఉత్తర్వులు కూడా ఈసీ ఏకగ్రీవ నిర్ణయాలేనని స్పష్టం చేస్తూ పూర్తి వివరణ ఇచ్చింది.

ఆలోచనలు వేరు :

కీలకమైన అంశాలలో ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అంత మాత్రం చేత అవే తుది నిర్ణయాలుగా ఎలా భావిస్తారు అన్నది ఈసీ అఫిడవిట్ లో పేర్కొంది ఉదాహరణకు ఒక ఫైలుని పరిశీలించే సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఇతర కమిషనర్లు వ్యక్తపరిచే అభిప్రాయాలు కానీ వారికి కలిగే సందేహాలు కానీ సూచనలు కానీ వారు చేసే వ్యాఖ్యలు కానీ కమిషన్ తుది నిర్ణయాలు ఎంత మాత్రం కానే కావని ఈసీ వివరించింది. ఇక ఎన్నికల సంఘం పనితీరుని వివరిస్తూ ముందుగా ఒక ఫైల్ ఒక ఎన్నికల కమిషనర్ వద్దకు వెళ్తుందని, ఆ మీదట రెండవ కమిషనర్ వద్దకు వెళ్తుందని చివరికి సీఈసీ వద్దకు వెళ్తుందని తెలిపింది.

చట్ట సవరణ పదవీ కాలానికే :

అంతే కాదు 2023లో జరిగిన చట్ట సవరణ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీస్ నిబంధనలు పదవీ కాలానికి సంబంధించినది అని పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 18 ను కూడా ఈసీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీని ప్రకారం చూస్తే సాధ్యమైనంత వరకూ ఈసీ నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకోవాలని ఉందని తెలిపింది. అలా కనుక జరగకపోతే అప్పుడు మాత్రమే మెజారిటీ అన్న ప్రశ్న వస్తుందని ఈసీ అఫిడవిట్ లో వెల్లడించింది. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తా కధనాల ఆధారంగా మాత్రమే పిటిషనర్ కోర్టులో పిటిషన్ వేశారు అని అసలైన వాస్తవాలు నిర్ధారించలేదని ఈసీ కోర్టుకు తెలిపింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరిన పిటిషన్ చట్టబద్ధంగా నిలబడదని ఈసీ గట్టిగానే వాదించింది.

ఫారం- 6 సవరించలేదని :

ఇక అత్యధికంగా విపక్షాల విమర్శలకు తావిస్తున్న ఫారం 6 ని అయితే ఏ విధంగానూ సవరించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడానికి ఉపయోగించే ఫారం- 6 ను సర్ ఉత్తర్వుల ద్వారా సవరించారన్న ఆరోపణలను ఖండించింది. ఓటరు నమోదు నిబంధనలు 1960 కింద నిర్దేశించిన ఫారంలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని ఈసీ పేర్కొంది. ఇక సర్ ఉత్తర్వుల సమయంలో తాము కోరిన డిక్లరేషన్ అన్నది ఒక ప్రత్యేక డాక్యుమెంట్ మాత్రమేనని దానినే ఫారం- 6 ను సవరించినట్లుగా ఏ విధంగానూ పరిగణించవద్దని ఈసీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈసీ నిర్వహించిన సర్ ప్రక్రియలో తమకు లేదా తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతలకు ఉన్న సంబంధాన్ని వివరించాలని దరఖాస్తుదారులను కోరడం వివాదానికి కారణమైంది. ఈ మార్పులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు తెలిపారన్నదే జాతీయ పత్రిక వార్తా కధనం గా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అక్టోబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఫారం- 6, సర్ డిక్లరేషన్‌ను రెండు వేర్వేరు భాగాలుగా చూపిస్తామని కోర్టుకు ఈసీ వెల్లడించింది. మొత్తం మీద ఈసీ అంటేనే ఏకగ్రీవం అని స్పష్టం చేస్తూ దాఖలు చేసిన ఈ అఫిడవిట్ మీద కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News