ఓటుని అమ్ముకోము...ఇది కదా కావాల్సింది !

ఎక్కడైనా రాజకీయం మారితేనే ప్రజల జీవితాలు మారుతాయి అని అంటారు. దానితో పాటుగా ప్రజలు కూడా మారాలి కదా అన్నది కూడా లాజిక్ పాయింట్.

Update: 2026-10-26 17:39 GMT

ఓటు అన్నది ఒక బలమైన అభిప్రాయం. అదే తీర్పుగా మారుతుంది. అంటే ఒక వ్యక్తి నిర్ణయానికి ఎంత పవర్ ఉందో ఆ ఓటు తెలియచేస్తుంది. అలాంటి ఓటుని నోటుకు అమ్ముకోవడం ఎప్పటి నంచి వచ్చిందో తెలియదు కానీ ఒక విధంగా అది ఆత్మను అమ్ముకోవడమే. ఇక ఆత్మకు అమ్ముకున్న తరువాత వ్యక్తి ఉండడు, వ్యక్తిత్వం అంతకంటే ఉండదు. అంతే కాదు ఓటు అన్నది పవిత్రమైనది. ఎవరికి ఓటు వేయని, ఏ అభిప్రాయం తీసుకోనీ. ప్రజాస్వామ్యంలో దానికి ఒక విలువ గౌరవం ఉంటాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఇది. ప్రతీ పౌరుడికీ ఓటు అన్నది ఒక బాధ్యత కూడా.

ఆకర్షిస్తున్న ఫ్లెక్సీ :

ఇదిల ఉంటే తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట 14వ వార్డు రథం సెంటర్ వీధిలో ఓ ఇంటి గోడకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లెక్సీ గురించి ఇపుడు అంతా చర్చిస్తున్నారు. స్థానికంగా అందరినీ ఆ ఫ్లెక్సీ ఆకర్షిస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఆ ఫ్లెక్సీ గురించే చర్చగా మారింది. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది అన్నదే కదా మ్యాటర్. తమ ఓటు హక్కును అత్యంత స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా వినియోగించుకుంటామని, ఓటును అమ్ముకోబోమని ఆ ఇంటి యజమాని చాలా స్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఓటు కొనుగోలు కోసం ఎవరైనా తమ ఇంటికి వస్తే నేరుగా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఫ్లెక్సీలో హెచ్చరించడం విశేషం. దాంతో ఇది ఆ వైపుగా వెళ్ళే జనాలను అందరికీ కూడా ఆలోచింప చేస్తోంది.

రాజకీయంలో మార్పు :

ఎక్కడైనా రాజకీయం మారితేనే ప్రజల జీవితాలు మారుతాయి అని అంటారు. దానితో పాటుగా ప్రజలు కూడా మారాలి కదా అన్నది కూడా లాజిక్ పాయింట్. ఓటుకి నోటు అన్నది సాగినంత కాలం ఎవరూ ఎవరినీ నిలదీయలేరు. అలాగే తమ సమస్యల గురించి అసలు అడగలేరు. అదే తమ ఓటుని కచ్చితంగా వినియోగించుకుంటే ఆ శక్తితో వారు ప్రజా ప్రతినిధులను ధైర్యంగా ప్రశ్నించగలరు. ప్రజాస్వామ్యంలో ఎంతటి బలహీనుడికి అయినా అపారమైన బలాన్ని ఇచ్చేది ఇదే ఓటు. అందుకే ఓటుని అమ్ముకోరాదు అని చెబుతారు. ఇపుడు మండపేటలో 14వ వార్డు రథం సెంటర్ వీధిలో ఒక ఇంటి వారు తీసుకున్న ఈ నిర్ణయం కానీ గట్టి సంకల్పం కానీ అందరిలో వస్తే కచ్చితంగా ఈ రాజకీయం బాగుపడుతుంది. అలాగే ఈ దేశం కూడా బాగుపడుతుంది అని అంటున్నారు. నిజానికి ఇదే కదా అందరూ కోరుకునేది అని కూడా అంటున్నారు.

చైతన్యం రావాలి :

ఎంతటి ఘనమైన వారు అయినా మరెంతటి నాయకులు అయినా ఎన్నికల ముందు తమ వద్దకు ఎందుకు వస్తున్నారు. తమ ఇంటి గడప ఎందుకు తొక్కుతున్నారు అన్నది కనుక సగటు జనం అర్ధం చేసుకుంటే చాలు, తమ చేతిలో ఉన్నది ఓటు కాదు బ్రహ్మాస్త్రం అని అర్ధం అవుతుంది. దానితోనే తమ తల రాతను మార్చుకోవచ్చు అని కూడా బోధపడుతుంది. అలా కాకుండా తాత్కాలిక తాయిలాలకు ఆశపడో ప్రలోభాలకు లొంగిపోయో ఓటు హక్కుని అమ్ముకుంటే కనుక వారితో పాటు పక్కన ఉన్న వారు కూడా మునిగిపోతారు. ఓటుకు నోటు అని విమర్శించే ముందు మార్పు జనంలో నుంచే రావాలన్నది మేధావుల మాట. అది ఇపుడు 14వ వార్డు రథం సెంటర్ వీధి ఇంటి స్పూర్తిగా అందరిలోనూ రావాలన్నదే అందరి కోరిక.

Tags:    

Similar News