జనసేనతో వద్దు...బీజేపీ భయం వెనక ?

జనసేన బీజేపీ కలసి బహిరంగ పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని తెలంగాణా నాయకులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

Update: 2026-10-26 17:30 GMT

జనసేన బీజేపీ మంచి మిత్రులు అన్నది అందరికీ తెలిసిందే. నిజానికి ఏపీలో కూటమి ఏర్పాటు వెనక జనసేన ఉందని కూడా అంటారు. అలా టీడీపీని బీజేపీకి కలిపి బలమైన ఆల్టర్నేషన్ ని తయారు చేయడం వల్లనే వైసీపీ ప్రభుత్వం ఏపీలో కుప్ప కూలింది. అలా ఏపీ నుంచి అతి పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు అండగా ఉండడం వల్లనే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి వీలు కలిగింది. అలాంటిది జనసేన పొత్తు వద్దు అని కమలం పార్టీ ఎలా అనగలదు, అంటే అది ఏపీలో కానే కాదు, తెలంగాణాలో అని అంటున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ బలమైన రాజకీయ పక్షంగా ఉంది. అక్కడ జనసేన కూడా తన పార్టీని విస్తరించాలని చూస్తోంది. మరి ఏపీలోనూ కేంద్రంలోనూ ఎన్డీయే గొడుగు కింద ఉన్న ఈ రెండు పార్టీలూ తెలంగాణాలో వేరుగా ఎలా ఉండగలవని అంటున్నారు. అది సాధ్యమా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు.

జనసేనతో నో :

తెలంగాణాలో ప్రస్తుతం మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. తొందరలో అక్కడ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి కంటే ముందే జనసేన తన అభ్యర్ధిని ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గడల శ్రీనివాసరావు ఆ పార్టీ నుంచి పోటీ పడబోతున్నారు. అయితే రెండు ఎమ్మెల్సీ సీట్లు కాబట్టి జనసేన బీజేపీల మధ్య పొత్తు ఉంటే కనుక ఇరు పక్షాలకు బాగా ఉంటుందని అంటున్నారు. దీని మీద తెలంగాణా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సాల్ సమక్షంలో ఆ పార్టీ నాయకుల మధ్య చర్చ సాగింది అని అంటున్నారు. అయితే ప్రత్యక్షంగా బీజేపీ జనసేన మద్దతు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరిగితే అది మేలు కాదని కమలం పార్టీ నేతలు కలవరం చెందుతున్నారని అంటున్నారు.

బీఆర్ఎస్ కి టార్గెట్ :

జనసేన బీజేపీ కలసి బహిరంగ పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని తెలంగాణా నాయకులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారుతుందని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీని కూడా తెలంగాణాలో వ్యతిరేకిగా ప్రచారం చేస్తారు అని కూడా వారు బీజేపీ పెద్దలకు చెప్పుకొచ్చారని అంటున్నారు. నిజానికి చూస్తే జనసేన నుంచి ఒక మంచి ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న గడల శ్రీనివాసరావుకి బీజేపీ మద్దతు ఇస్తే బీజేపీ పోటీ చేసే రెండవ ఎమ్మెల్సీ సీటు అయిన మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో జనసేన మద్దతు ఇస్తుంది అన్నది ఈ ప్రతిపాదన. ఇలా పొత్తు పెట్టుకుని చెరో సీటు తీసుకుని పోటీ చేస్తే రెండు పార్టీలకు ఉపయోగం అని అంటున్నారు. అయితే ఈ విషయంలో అయితే తెలంగాణా బీజేపీ నాయకులు అయితే అంత సుముఖంగా లేరని అంటున్నారు.

బీజేపీకే బలం :

అంతే కాదు తెలంగాణాకు వచ్చేసరికి బీజేపీకే బలం ఎక్కువ అని వారు పార్టీ పెద్దలకు వివరించినట్లుగా చెబుతున్నారు. జనసేనకు గత ఎన్నికల్లో పోటీ చేస్తే పెద్దగా ఓట్లు రాలేదని కూడా వారు వివరించారని చెబుతున్నారు. అయితే ఏపీలో పొత్తులో ఉంటూ కేంద్రంలో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉంటూ తెలంగాణాలో జనసేనతో పొత్తుకు బీజేపీ ఎందుకు భయపడుతోంది అన్నదే డిస్కషన్ పాయింట్. పవన్ చరిష్మా బీజేపీ క్యాడర్ బేస్ రెండూ కలిస్తే తెలంగాణాలో బలమైన కూటమిగా మారవచ్చు అన్నది కూడా వినిపిస్తున్న మాట. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News