ఢిల్లీ పార్లమెంట్ లో టెన్షన్ టెన్షన్.. నార్త్ బ్లాక్‌లో ఏం జరిగింది? పరిపాలనా గుండెకాయ వద్ద అలర్ట్

ఉదయం 11:00 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. నార్త్ బ్లాక్ పైకప్పు పై ఉన్న ఏసీ బాయిలర్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2026-10-26 12:29 GMT

దేశ పరిపాలనా గుండెకాయ లాంటి ఢిల్లీలోని రైసినా హిల్ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ భవన సముదాయానికి అతిసమీపంలో ఉన్న చారిత్రక 'నార్త్ బ్లాక్' పైభాగం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశంలోకి వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. కేంద్రంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉండే భవనంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో క్షణాల్లో భద్రతా యంత్రాంగం, అత్యవసర సేవలు అలర్ట్ అయ్యాయి.

ఉదయం 11:00 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. నార్త్ బ్లాక్ పైకప్పు పై ఉన్న ఏసీ బాయిలర్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ వెల్డింగ్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి, దాని నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న పరికరాలకు ప్లాస్టిక్ సామగ్రికి అంటుకోవడంతోనే ఈ రీతిలో దట్టమైన పొగలు వెలువడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఉదయం 11:10 గంటల సమయంలో అత్యవసర కాల్ అందగానే ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి చెందిన ఆరు ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. సిబ్బంది సకాలంలో స్పందించి వేగంగా చర్యలు చేపట్టడంతో మంటలు త్వరగానే అదుపులోకి వచ్చాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదాన్ని పార్లమెంట్‌కు వెళ్తున్న రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవరా స్వయంగా గమనించారు. నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి భారీగా పొగలు రావడం చూసిన ఆయన వెంటనే 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ అత్యవసర సేవలు వేగంగా స్పందిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే లోపల ఉన్నవారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ప్రమాదం జరిగిన ప్రారంభంలో పార్లమెంట్ భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ.. అధికారులు వెంటనే స్పందించి స్పష్టత ఇచ్చారు. ప్రమాదం పార్లమెంట్‌లో కాదని.. దానికి సమీపంలోని రైసినా హిల్‌లో ఉన్న చారిత్రక నార్త్ బ్లాక్ భవనంలో జరిగిందని వెల్లడించారు.

ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన ఈ చారిత్రక నార్త్ బ్లాక్ భవనం కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలకు నిలయం. అత్యంత భద్రత ఉండే ఇలాంటి సున్నితమైన ప్రదేశంలో మరమ్మతు పనులు జరిగే సమయంలో పాటించాల్సిన ఫైర్ సేఫ్టీ నియమాలపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ప్రమాదానికి విద్యుత్ వైరింగ్‌లో లోపమా, వెల్డింగ్ నిప్పురవ్వలా లేదా పాత వాటర్ ట్యాంక్ పరిసరాల్లో జరిగిన అలసత్వమా అనే అంశాలపై అధికారిక విచారణ కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

Tags:    

Similar News