ధనుష్ దీపాల్లో ‘కమలం’ ప్రకాశం.. సినిమా గిఫ్ట్‌కు రాజకీయాల కిటుకు..
ఇటీవల ధనుష్ తన మహిళా అభిమానులకు ప్రేమతో కొన్ని వెండి దీపాలను కానుకగా ఇచ్చారట.
తమిళ చిత్రసీమలో నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కొందరు కొత్త పార్టీలు పెట్టి ‘తమిళగ’ సరిహద్దులు దాటాలని చూస్తుంటే.. మరికొందరు ఎప్పుడు ఏ అడుగు వేస్తారా అని సోషల్ మీడియా విశ్లేషకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తుంటారు. ఈ క్రమంలో మన వర్సటైల్ హీరో ధనుష్‌పై కూడా రాజకీయ వర్గాల కన్ను పడింది. అయితే ఈసారి ఆయన మాట్లాడిన మాటల వల్ల కాదు.. ఆయన ఇచ్చిన బహుమతుల వల్ల..
ఇటీవల ధనుష్ తన మహిళా అభిమానులకు ప్రేమతో కొన్ని వెండి దీపాలను కానుకగా ఇచ్చారట. కథ ఇక్కడివరకు బానే ఉంది కానీ ఆ దీపాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే అందులో భారతీయ జనతా పార్టీ గుర్తు అయిన 'కమలం' రూపం ప్రత్యక్షమైంది. అంతే ఇంకేముంది? వార్తా ఛానెళ్లకు.. సోషల్ మీడియా పండితులకు పండగే పండగ.. "ధనుష్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా?", "వెండి దీపంతో కాషాయ జెండా పడనుందా?" అంటూ కథనాలు అల్లేశారు. కాంగ్రెస్ నాయకులైతే ఈ దీపాల వెనుక బీజేపీ వ్యూహాలు ఉన్నాయంటూ విమర్శల దాడులు కూడా మొదలుపెట్టేశారు.
పాపం వ్యవహారం హద్దులు దాటుతుండటంతో ధనుష్ అభిమాన సంఘం ప్రతినిధి రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. "అయ్యా సామీ.. అది ఏ రాజకీయ పార్టీ గుర్తు కాదు.. ఆ దీపాలు తయారు చేసిన వెండి వ్యాపారి వేసుకున్న లోగో మాత్రమే.. దానికి, ధనుష్ రాజకీయ ప్రవేశానికి ఏమాత్రం సంబంధం లేదు" అని దండం పెట్టి వివరణ ఇచ్చారు. అంటే తయారీదారు వేసిన ముద్రను పట్టుకుని హీరో పొలిటికల్ ఎంట్రీ రేంజ్లో ఊహించేసుకున్నారన్నమాట..
దక్షిణాదిలో సినీ హీరో ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం రివాజుగా మారింది. దీపం తయారీదారుడి మార్కెటింగ్ ముద్రను చూసి ధనుష్ పొలిటికల్ మ్యానిఫెస్టో అనుకోవడం మన విశ్లేషకుల సృజనాత్మకతకు నిదర్శనం. ధనుష్ నిజంగా రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది ఆయన అధికారికంగా చెప్పే వరకు వేచి చూడాల్సిందే కానీ.. ప్రస్తుతానికి మాత్రం ఈ 'కమలం దీపం' సోషల్ మీడియాలో భలే వెలుగులు విరజిమ్ముతోంది.