స్విట్జర్లాండ్ కాదు ఏపీ.. కొండదొర రాజుకు సీఎం చంద్రబాబు థాంక్స్!

ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను విస్తృతంగా వాడుకుంటున్నారు.

Update: 2026-10-26 08:56 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను విస్తృతంగా వాడుకుంటున్నారు. తన ఆలోచనలు, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్ ను రీపోస్టు చేస్తున్నారు. ఈ విధంగా నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గతంలో సుదీర్ఘ ఉపాన్యాసాలతో మీడియా సమావేశాలు నిర్వహించే చంద్రబాబు ప్రస్తుత ట్రెండ్ కు తగినట్లుగా మారడాన్ని గమనిస్తున్న పరిశీలకులు.. టెక్నాలజీని వాడుకోవడంలో బాబు గారి స్టైలే వేరు అంటూ కితాబునిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలని పార్టీ నేతలకు చాలాకాలం నుంచి ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేసే వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర సమాచార శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. సీఎం ఆదేశాలతో ఇటీవల ఏపీ సమాచార శాఖ కొత్తగా ఇన్ ఫ్లుయెన్సర్ పాలసీని తీసుకువచ్చింది. వీడియోలు, వ్యూస్, లైక్స్ అంటూ ప్రభుత్వ శాఖలను సోషల్ మీడియాకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.

ఇక తాను కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్న సీఎం తాజాగా ఎక్స్ లో ఒక పోస్టు ద్వారా ఆకట్టుకున్నారు. ఇన్ స్టాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోను సీఎం తన ఎక్స్ లో పోస్టు చేశారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో కొత్తగా వేసిన రోడ్డు వీడియోను కొండదొర రాజు అనే ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ పోస్టు చేశాడు. కొండకోనల మధ్య అందమైన ప్రదేశంలో నున్నటి రోడ్డును చిత్రీకరించిన కొండదొర రాజు ఇది స్విట్జర్లాండ్ కాదు ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ తగిలించాడు. చూడటానికి చాలా అందంగా ముచ్చటగా ఉండటమే కాకుండా, కూటమి ప్రభుత్వం చేపట్టిన రోడ్డు అభివృద్ధిని ఆ షార్ట్ వీడియో కళ్లకు కట్టింది.

ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షించడంతో ఇన్ స్టాలో వైరల్ అయింది. వేలాది మంది లైక్ చేయడమే కాకుండా వందలాది సానుకూల కామెంట్స్ వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా రోడ్లు నిర్మించారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో పల్లె పండుగ, అడవితల్లి బాట పేర్లతో మారుమూల పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వేశారు. దీంతో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ కొండదొర రాజు పోస్టు చేసిన వీడియో వైరల్ అయిందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ పోస్టును తన ఎక్స్ లో షేర్ చేశారు. తన పోస్టుకు సదరు ఇన్ ఫ్లుయెన్సర్ పెట్టిన టైటిల్ నే యథాతథంగా ఉంచి, అందమైన రోడ్డుపై వీడియో తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సాధారణ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన వీడియోను షేర్ చేయడం ఆయన సోషల్ మీడియా వ్యూహాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. ఒక సామాన్య వ్యక్తికి ముఖ్యమంత్రి నుంచి ప్రోత్సాహం రావడంతో ఆయన మరిన్ని వీడియోలు చిత్రీకరించి ప్రభుత్వ కృషిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడని వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి ప్రచారం దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. తమ అభివృద్ధిని నేరుగా ప్రచారం చేసుకోవడం కన్నా, ప్రజలతోనే చెప్పించడం ద్వారా ఎక్కువ పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతోనే సీఎం సోషల్ మీడియా వ్యూహం రూపొందుతోందని అంటున్నారు.

Tags:    

Similar News