చైనా 9 ఏళ్లలో 2 ట్రిలియన్ల నుంచి 10 ట్రిలియన్లకు.. భారత్ వెనుకబడటానికి అసలు కారణం ఇదేనా?
ఒక దేశం ఆర్థికంగా ఎదిగితే సరిపోతుందా? ఆ పెరుగుదల వెనుక సామాన్యుడి కష్టం.. చెమట.. భవిష్యత్తు కలలు ఎంతవరకూ నెరవేరుతున్నాయి? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే ఒక చర్చ హోరెత్తిపోతోంది.
ఒక దేశం ఆర్థికంగా ఎదిగితే సరిపోతుందా? ఆ పెరుగుదల వెనుక సామాన్యుడి కష్టం.. చెమట.. భవిష్యత్తు కలలు ఎంతవరకూ నెరవేరుతున్నాయి? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే ఒక చర్చ హోరెత్తిపోతోంది. 2005 నాటికి కేవలం 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ 2014 నాటికి అంటే కేవలం తొమ్మిదేళ్ల వ్యవధిలోనే 10 ట్రిలియన్ డాలర్లకు ఎలా చేరింది? అదే సమయంలో మన భారత్ 2 ట్రిలియన్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది? ఈ పోలిక మనల్ని విఫలమయ్యామని వేలెత్తి చూపుతోందా? లేక మనం పయనిస్తున్న దారిలోని సవాళ్లను గుర్తుచేస్తోందా? అన్నది విశ్లేషఖులను తొలుస్తోంది.
చైనా విజయం వెనుక ఏదో మాయాజాలం లేదు. దాని వెనుక ఓ సుదీర్ఘమైన ప్లానింగ్.. శ్రమ ఉంది. ప్రతి గ్రామాన్ని.. ప్రతి పట్టణాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చింది. ప్రపంచమంతటికీ కావాల్సిన వస్తువులను తక్కువ ధరకే అందిస్తూ ‘గ్లోబల్ ఫ్యాక్టరీ’గా మారింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.. భారీ మౌలిక వసతులు కల్పించడం.. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి ప్రపంచ మార్కెట్లను తన గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా ఆ దేశం ఆర్థికంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళింది.
మరి భారత్ కథ ఏమిటి? మన మేధస్సుతో సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ, సాఫ్ట్వేర్ సేవల్లో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాం. ప్రపంచ స్థాయి ఇంజనీర్లను, సీఈఓలను అందించాం. కానీ ఆర్థిక వ్యవస్థలోని ఈ వెలుగు కేవలం కొంతమంది చదువుకున్న నగరవాసులకే పరిమితమైంది. కోట్ల మంది గ్రామీణ యువతకు, చేతివృత్తుల వారికి, సామాన్య కార్మికులకు రెక్కలకష్టం అందించే పారిశ్రామిక, తయారీ రంగాలు మన దగ్గర అనుకున్నంతగా విస్తరించలేకపోయాయి. ఫలితంగా ఉద్యోగాలు లేక చదువుకున్న కుర్రాళ్ళు, రెక్కలకష్టాన్ని నమ్ముకున్న పేదలు నిరాశలో కూరుకుపోతున్నారు.
మనదేశంలో సమస్య వేగంలో లేదు.. ఆ వృద్ధిని సామాన్యుడి కడుపు నింపే ఉద్యోగాలుగా మార్చడంలో ఉంది. నేటికీ మన శ్రామిక శక్తిలో మెజారిటీ భాగం వ్యవసాయం, అసంఘటిత రంగాలపైనే ఆధారపడి ఉంది. సరైన నైపుణ్య శిక్షణ, పెట్టుబడి, ఆధునిక పరిజ్ఞానం అందక చిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. విద్యార్హతకు తగ్గ ఉద్యోగం దొరక్క ఆవేదన చెందుతున్న నేటి యువత.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక అల్లాడుతున్న మహిళలు.. ఈ అసమానతలే మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రతిబంధకంగా మారాయి.
చైనా నమూనాను గుడ్డిగా అనుసరించడం వల్ల ఉపయోగం లేదు. భారత్కు తనదైన తిరుగులేని శక్తి ఉంది.. అదే మన యువ జనాభా.. డిజిటల్ విప్లవం, భారీ దేశీయ మార్కెట్.. అయితే ఇకపై మనం కేవలం సేవల రంగానికే పరిమితం కాకుండా.. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి లక్షలాది మందికి ఉపాధినిచ్చే తయారీ రంగాన్ని ప్రాణవాయువుగా మార్చుకోవాలి. చిన్న పరిశ్రమలకు చేయూతనందించి.. ఎగుమతులను పెంచినప్పుడే మన దేశీయ సామర్థ్యం బయటపడుతుంది.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్లా లేక 10 ట్రిలియన్లా అనే డాలర్ల లెక్కల కంటే ఆ ప్రగతి సామాన్యుడి పూరిగుడిసె తలుపు తట్టిందో లేదో చూడటమే నిజమైన విజయం. జీడీపీ సంఖ్యలు మైలురాళ్ళు మాత్రమే.. కానీ ప్రతీ చేతికి పని.. ప్రతీ కంటికి నిండైన నిద్ర.. ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రత లభించినప్పుడే మన భారత్ సాధించే వృద్ధికి అర్థం.. పరమార్థం దక్కుతాయి.