సౌదీలో సౌదీ రూల్స్ పాటించండి.. భారతీయులకు ఇది కీలక హెచ్చరిక

రెక్కల ముక్కలు చేసుకుంటూ.. ఎడారి దేశంలో చెమటోడ్చి కనే కోటి కలల జీవితం.. ఒక్క క్షణం అలసత్వంతో కల్లలవుతోంది.

Update: 2026-10-25 16:30 GMT

రెక్కల ముక్కలు చేసుకుంటూ.. ఎడారి దేశంలో చెమటోడ్చి కనే కోటి కలల జీవితం.. ఒక్క క్షణం అలసత్వంతో కల్లలవుతోంది. కుటుంబ భవిష్యత్తు కోసం కన్నతల్లికి.. కట్టుకున్నదానికి దూరంగా సౌదీలో బతుకులీడుస్తున్న ప్రవాస భారతీయులకు ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ జీవితాంతం కోలుకోలేని కోలుదెబ్బ తీస్తోంది...

సౌదీ అరేబియాలో ఉద్యోగాలు.. వ్యాపారాల నిమిత్తం నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు భారత రాయబార కార్యాలయం అత్యంత కీలకమైన, ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, క్షిపణులు, డ్రోన్ దాడులకు సంబంధించిన దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక చట్టాలు, భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే తీవ్ర చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది.

సోషల్ మీడియా ఉత్సాహం.. ఊచకోత కోసే చట్టాలు

సాధారణంగా ఏదైనా అత్యవసర లేదా సంచలన సంఘటన జరిగినప్పుడు వెంటనే ఫోన్ తీసి వీడియోలు రికార్డ్ చేయడం, వాటిని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే సైనిక, భద్రతాపరమైన సున్నితత్వాలు ఉండే సౌదీ అరేబియాలో ఈ చిన్న అలవాటు జీవితాన్నే నాశనం చేసే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

క్షిపణులు ఎక్కడ పడ్డాయి? డ్రోన్ల దాడులను భద్రతా వ్యవస్థలు ఎలా అడ్డుకున్నాయి? రక్షణ దళాలు ఎక్కడ మోహరించాయి? వంటి దృశ్యాలు బయటకు రావడం వల్ల దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని సౌదీ ప్రభుత్వ వర్గాలు భావిస్తాయి. సౌదీ సివిల్ డిఫెన్స్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను రీపోస్ట్ చేస్తూ స్థానిక సైబర్ నేరాల నిరోధక చట్టాల ప్రకారం ఇటువంటి దృశ్యాలను ప్రచారం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఎంబసీ గుర్తుచేసింది.

జైలుశిక్ష నుంచి దేశ బహిష్కరణ వరకు..

ఈ నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. స్థానిక చట్టాల ప్రకారం రక్షణ సంబంధిత సమాచారాన్ని లీక్ చేసినందుకు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తారు. నేరం తీవ్రతను బట్టి దీర్ఘకాలిక జైలుశిక్ష అనుభవించాల్సి రావచ్చు. శిక్ష పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని సౌదీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశాలు ఉంటాయి.

ప్రవాస భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సౌదీలోని భారతీయులు తమ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతుంటారు. కేవలం ఒక నిమిషం ఆసక్తితో లేదా ఉత్సాహంతో తీసే చిన్న వీడియో వల్ల జీవితం, ఉద్యోగం, నివాస హక్కులు ప్రమాదంలో పడతాయి. అందుకే క్రింది జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. క్షిపణి దాడులు లేదా రక్షణ చర్యల దృశ్యాలను స్వయంగా చిత్రీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ధృవీకరించని పుకార్లను నమ్మవద్దు.. వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక భద్రతా దళాలు, సివిల్ డిఫెన్స్ ఇచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి.

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడానికి లేదా షేర్ చేయడానికి కొన్ని సెకన్లే పట్టవచ్చు.. కానీ దానివల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు మీ జీవితాన్ని, కుటుంబ భవిష్యత్తును తలకిందులు చేయగలవు. కాబట్టి సౌదీలోని భారతీయులందరూ అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News