బిన్ లాడెన్‌ను ప్రాణాలతో పట్టుకోవాలనుకోలేదు.. రాబర్ట్ ఓ నీల్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను ఎలా పట్టుకున్నారు? ఎలా హతమార్చారనే విషయాలపై దశాబ్ద కాలం గడిచినా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది.
ఒసామా బిన్ లాడెన్.. కరుడుగట్టిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు.. అగ్రరాజ్యం అమెరికానే ఢీకొట్టి వందల మంది ప్రాణాలు తీసిన కిరాతకుడు.. అప్ఘనిస్తాన్ కేంద్రంగా సాగించిన అతడి రాక్షస ఉగ్ర నెట్ వర్క్ ను అమెరికా తుత్తునియలు చేసినా కొన్నేళ్ల పాటు దొరకకుండా పాకిస్తాన్ లో దాక్కున్న ఈ ఉగ్రవాది మూలాలను అమెరికా సైతం చాలా రోజులు కనిపెట్టలేదంటే అతిశయోక్తి కాదు. కానీ చివరకు దాచిన పాకిస్తాన్ నే అప్రూవర్ గా మారి ఉప్పందించడంతో ఈ ఉగ్రవాదిని కాటికి పంపింది అమెరికా.. కానీ ఇతడిని కాల్చి చంపిన మాజీ నేవీ సీల్ కమాండో రాబర్ట్ ఓ నీల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను ఎలా పట్టుకున్నారు? ఎలా హతమార్చారనే విషయాలపై దశాబ్ద కాలం గడిచినా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన 'ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్'లో బిన్ లాడెన్ హతమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పాడ్‌కాస్టర్ రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్ లాడెన్‌పై తుపాకీ రౌండ్లు కాల్చినట్లు చెప్పుకుంటున్న మాజీ అమెరికా నేవీ సీల్ కమాండో రాబర్ట్ ఓ నీల్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఒసామాను సజీవంగా పట్టుకునే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని.. అతడిని బంధించి సుదీర్ఘ న్యాయ విచారణలు ఎదుర్కొనేలా చేయడం కంటే అక్కడికక్కడే అంతమొందించడమే శ్రేయస్కరమని భావించినట్లు ఓ నీల్ స్పష్టం చేశారు. లాడెన్‌ను పట్టుకుంటే 30 ఏళ్ల పాటు సాగే న్యాయ విచారణల ప్రహసనం ఎదురవుతుందని.. అతడి తరఫున అమెరికాలోనే లాయర్లు వాదించే పరిస్థితులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. జైలులో మగ్గనివ్వడం కంటే అతడికి మరణమే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. అలాగే దాడి సమయంలో లాడెన్ లొంగిపోయే సంకేతాలు ఇవ్వలేదని.. కేవలం అర సెకను వ్యవధిలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఒకవేళ బిన్ లాడెన్ సజీవంగా దొరికి ఉంటే అతడిని ఎక్కడ బంధించాలి? ఏ అంతర్జాతీయ లేదా జాతీయ న్యాయస్థానంలో విచారించాలి? ఉగ్రవాద నెట్‌వర్క్‌ల రహస్యాలను ఏ విధంగా వెలికితీయాలి అనే ప్రశ్నలు అమెరికాకు పెద్ద సవాలుగా మారేవి. న్యాయపరంగా.. నైతికంగా విచారణ ప్రాముఖ్యమైనదే అయినప్పటికీ సైనిక దృక్కోణంలో ఉగ్రవాద ముప్పును తక్షణమే నివారించడానికే హతమార్చడమే మేలని నాటి సైనికులు ఈ పనిచేసినట్టుగా తెలుస్తోంది.
అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల విషయంలో 'న్యాయస్థానం ముందు నిలబెట్టాలా లేక తక్షణ భద్రతా ముప్పుగా భావించి అంతమొందించాలా?' అనే దౌత్య, నైతిక సంక్లిష్టత ఉంటుందనే హతమార్చినట్టు నేవీ సీల్ పేర్కొనడంతో ప్రభుత్వాలకు, సైనికులకు మధ్య ఆలోచనాధోరణి ఎంత డిఫెరెంట్ గా ఉంటుందో అర్థమవుతోంది.