రోడ్లపైకి లక్షల మంది ఇజ్రాయెలీలు.. నెతన్యాహుకు ఓటమి తప్పదా?

సరిహద్దుల్లో శత్రువుల రక్తం చిందుతున్నా.. దేశం లోపల మాత్రం సొంత ప్రజల కన్నీళ్లు, ఆగ్రహం సుడిగాలిలా చుట్టుముట్టాయి.

Update: 2026-10-25 10:37 GMT

సరిహద్దుల్లో శత్రువుల రక్తం చిందుతున్నా.. దేశం లోపల మాత్రం సొంత ప్రజల కన్నీళ్లు, ఆగ్రహం సుడిగాలిలా చుట్టుముట్టాయి. ఇజ్రాయెల్ రాజధాని ల్ అవీవ్ నిరసనకారుల హోరుతో మార్మోగుతోంది. "మా భద్రత ఏది? మా బంధువుల ప్రాణాలకు బాధ్యులెవరు?" అంటూ వీధుల్లోకి వచ్చిన లక్షలాది మంది ప్రజల కన్నీళ్లు.. ఆగ్రహం ఇజ్రాయెల్ వీరుడిగా చెప్పుకునే నెతన్యాహు సింహాసనాన్ని కదిలించేలా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అత్యంత క్లిష్టమైన ఘట్టం. సరిహద్దుల్లో యుద్ధం సాగుతున్నా.. దేశంలో మాత్రం ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అగ్నిపర్వతంలా బద్దలవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టెల్ అవీవ్‌ వీధుల్లోకి ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజల ఆక్రోశం ఇజ్రాయెల్ రాజకీయాలను గందరగోళంలోకి నెట్టివేసింది.

గుండెకోత మిగిల్చిన అక్టోబర్ 7 దాడి

2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన సైనిక దాడి ఇజ్రాయెలీల గుండెల్లో చెరగని గాయాన్ని మిగిల్చింది. నిద్రపోతున్న వేలాది మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. వందలాది మంది బందీలుగా నరకం అనుభవించారు. "దేశ భద్రతే మా ప్రాధాన్యం" అని నిరంతరం చెప్పే నెతన్యాహు ప్రభుత్వం.. ఇంత పెద్ద దాడిని ముందే ఎందుకు ఊహించలేకపోయింది? రక్షణ వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? అన్న ప్రశ్న ప్రతి ఇజ్రాయెలీ పౌరుడి మనస్సును కలచివేస్తోంది.

కన్నీటి మధ్య స్వతంత్ర విచారణ డిమాండ్

ఇప్పుడు వీధుల్లోకి వచ్చిన లక్షల మంది నిరసనకారులు కేవలం రాజకీయం మాట్లాడటం లేదు. తమ వారిని కోల్పోయిన బాధను, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అక్టోబర్ 7 భద్రతా వైఫల్యాలపై తక్షణమే ఒక 'స్వతంత్ర విచారణ కమిషన్' వేసి అసలు నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే అధికారమే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు.

నెతన్యాహు ముందున్న కత్తిమీద సాము

ఒకవైపు సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం.. మరోవైపు బందీల కుటుంబాల రోదనలు, ఇంకోవైపు దేశంలో పెల్లుబుకుతున్న తీవ్ర అసంతృప్తి.. ఇవన్నీ నెతన్యాహు రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. నిరసనల్లో కనిపిస్తున్న ఈ ఆగ్రహం రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారితే ఆయనకు ఘోర పరాభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఎన్నికల ఫలితాలను కేవలం నిరసనల ఆధారంగానే చెప్పలేం. నెతన్యాహు మద్దతుదారులు జాతీయ భద్రత, బలమైన నాయకత్వం అనే అంశాలను ప్రచార ఆయుధాలుగా వాడుతుండగా... విపక్షాలు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని వేలెత్తి చూపుతున్నాయి.

అంతిమ తీర్పు ప్రజలదే

ప్రజా ఉద్యమాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ ఆగ్రహం ఓటింగ్ మిషన్ల వరకు చేరి అధికారాన్ని మారుస్తుందా? లేక రాజకీయ చతురతతో నెతన్యాహు మరోసారి గట్టెక్కుతారా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. సొంత దేశ ప్రజల్లో రగిలిన ఈ నమ్మకద్రోహపు గాయం నెతన్యాహుకు జీవితంలోనే అతిపెద్ద సవాలుగా మారింది.

Tags:    

Similar News