యెలహంక... దుర్భేధ్యమైన రక్షణ వలయంలో జగన్

బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌ ఇపుడు తెలుగు నాట మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హోరెత్తిపోతోంది.

Update: 2026-10-25 03:46 GMT

బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌ ఇపుడు తెలుగు నాట మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హోరెత్తిపోతోంది. యూట్యూబ్ చానళ్ళలోనూ ఇదే పేరు గట్టిగా మారుమోగుతోంది. ఇంతకీ యలహంక ప్యాలెస్ చుట్టూ ఎందుకు ఇన్ని వివాదాలు, ఇంత రచ్చ అన్నది కూడా చర్చనీయాంశమే. యెలహంక ప్యాలెస్ ని ఉమ్మడి ఆస్తిగా ఒక వాదన ఉంటే అది జగన్ స్వార్జితం అని మరో వాదన ఉంది. ఇలా యెలహంక ప్యాలెస్ మీద జగన్ షర్మిల మధ్య ఆస్తి పరంగా వివాదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్న వారూ ఉన్నారు.

వైఎస్సార్ హయాంలోనే :

మరో వైపు చూస్తే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బ్రతికున్నప్పుడే నాలుగు వేర్వేరు ప్రాంతాలలో అంటే హైదరాబాద్ లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపులపాయ, బెంగళూరు యెలహంక ప్యాలెస్ లలో జగన్, షర్మిల కోసం పక్కపక్కనే ఇళ్లు నిర్మించారని కూడా చెబుతున్న వారు ఉన్నారు. అందువల్ల యెలహంక ఎస్టేట్‌లోని ఇరవై ఎకరాల స్థలంలో షర్మిలకు కూడా సమాన వాటా ఉందని అంటున్నారు. పైగా అక్కడ ఆమె నివాసం కూడా ఉంది అని ఆమె తరఫు వర్గాలు చెబుతున్నాయి.

జగన్ స్వార్జితం అంటూ :

మరో వైపు చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్జితం యలహంక ప్యాలెస్ అని ఆయన వైపు వాదన వినిపించేవారు చెప్పే మాట. అక్కడ చెల్లెలుకు నివాసం అన్నది జగన్ ఇష్టపూర్వకంగానే ఇచ్చారని కూడా అంటున్నారు. అలా చూస్తే యెలహంక ప్యాలెస్ ఉమ్మడి కుటుంబ ఆస్తి కాదని అది జగన్ భార్య వైఎస్ భారతి రెడ్డి తల్లి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని జగన్ తరఫు వర్గాల వాదనగా కూడా చెబుతున్నారు. అలా చూస్తే యెలహంక ప్యాలెస్ మీద సంపూర్ణ హక్కులు జగన్ కి ఉన్నాయని వాదిస్తున్న వారు ఉన్నారు. ఇలా ఆస్తి ఒప్పందాల ప్రకారం ఆ నివాసంపై జగన్ కి ఆయన న కుటుంబానికే సంపూర్ణ హక్కులు ఉన్నాయని, దీనిని ఉమ్మడి ఆస్తుల విభజన కిందికి తీసుకు రావడానికి వీల్లేదని అంటున్నారు.

అత్యంత కట్టుదిట్టంగా :

వైఎస్ జగన్ మాజీ సీఎం గా మారిన తరువాత 2024 నుంచి యెలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు. ఆ ప్యాలెస్ లోకి అనుమతి లేనిదే వైసీపీ నేతలకు సైతం ఎంట్రీ ఉండదు, అరుదైన సందర్భాలలో మాత్రమే ఒకరిద్దరిని అనుమతిస్తారు అని అంటున్నారు. జగన్ రాజకీయ వ్యవహారాలు అన్నీ కూడా ఏపీలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోనే చర్చిస్తారు అని అంటారు. మరీ అత్యవసరం అయితేనే తప్ప యెలహంక ప్యాలెస్ లో వైసీపీ రాజకీయ నేతలను కలవరని అంటున్నారు.

సువిశాలమైన ఎస్టేట్ :

ఇరవై ఎకరాలతో సువిశాలమైన యెలహంక ప్యాలెస్ లో జగన్ గతంలో అంటే 2009 వరకూ ఉండేవారు. ఆయన వివాహం 1996లో జరిగితే ఆనాటి నుంచి 13 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. తండ్రి ఏపీ సీఎం గా ఉన్నా జగన్ బెంగళూరులోనే ఉంటూ వచ్చారు. ఒక 2009 తరువాత ఆయన లోటస్ పాండ్ కి మారిపోయారు. 2019 నుంచి 2024 వరకూ తాడేపల్లి ప్యాలెస్ లో అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ అక్కడ ఉన్నారు. దాంతో యెలహంక ప్యాలెస్ కి జగన్ తిరిగి వెళ్ళింది 2009 తరువాత 2024 లో మాత్రమే అని చెబుతున్నారు. అంటే 15 ఏళ్ళ తరువాత అన్న మాట.

రక్షణ కోసమే అంటూ :

జగన్ కి రక్షణ అత్యవసరం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు పనిచేశారు. అలాగే ఆయనకు రాజకీయంగా విభేదించే వారూ ఉన్నారు. అలాగే పబ్లిక్ ఫిగర్ గా ఉన్నారు కాబట్టి ఇతరత్రా కూడా ప్రత్యర్ధులు ఉంటారు అని పటిష్టమైన బందోబస్తుతో జెడ్ ప్లస్ కేటగిరీలో జగన్ యెలహంక ప్యాలెస్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పటివరకూ యెలహంక ప్యాలెస్ ఫోటోలు కూడా ఎక్కడా బయటకు రాలేదు. గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా జగన్ సతీమణి భారతి తో కలసి బాణా సంచా కాల్చిన ఫోటోలు అక్కడ బయట మాత్రమే వచ్చాయి. ఇపుడు షర్మిల కుమార్తె వివాహం సందర్భంగా తాను నివాసం ఉంటున్న యెలహంక ప్యాలెస్ లో భద్రతకు ముప్పు అని జగన్ చెబుతున్నారు. అందుకే వద్దు అంటున్నాను అని ఆయన వాదిస్తున్నారు. అయితే అక్కడ తనకు కూడా నివాసం ఉంది కాబట్టి వేదికగా చేసుకుంటామని షర్మిల అంటున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News