ఇక ఫోన్‌ అసెంబ్లింగ్‌ కాదు.. టెక్నాలజీ మనదే.. 2028లో భారత్‌ సరికొత్త సంచలనం?

చైనా, అమెరికా కంపెనీల ఫోన్లతో నిండిపోయిన భారత మార్కెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోందా? ఇప్పటివరకు విదేశీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను దేశంలో తయారు చేస్తూ వచ్చిన భారత్‌..

Update: 2026-10-24 15:30 GMT

చైనా, అమెరికా కంపెనీల ఫోన్లతో నిండిపోయిన భారత మార్కెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోందా? ఇప్పటివరకు విదేశీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను దేశంలో తయారు చేస్తూ వచ్చిన భారత్‌.. ఇక సొంత టెక్నాలజీతో మొబైల్‌ ఫోన్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబర్‌ 2028 నాటికి భారతీయ రూపకల్పనతో.. భారతదేశంలోనే తయారైన, దేశీయ బ్రాండ్‌ పేరుతో ఓ మొబైల్‌ ఫోన్‌ అందుబాటులోకి రావచ్చని ఎన్డీటీవీ వరల్డ్ సెమినార్ లో కేంద్ర టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటన ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఆసక్తిని పెంచుతోంది.

ఇన్నాళ్లూ అసెంబ్లింగ్‌.. ఇక అసలు టెక్నాలజీపై గురి..

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో ఒకటి. అంతర్జాతీయ కంపెనీలకు మన దేశం కీలక తయారీ కేంద్రంగా మారింది. యాపిల్‌ సహా అనేక ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ కీలకమైన ప్రశ్న ఉంది. ఫోన్లు మన దేశంలో తయారవుతున్నప్పటికీ.. వాటి రూపకల్పన, కీలక సాంకేతిక పరిజ్ఞానం, మేధో సంపత్తి విషయంలో భారత్‌ పాత్ర ఎంత? అన్నది ఇప్పటికీ ప్రశ్నగా నిలుస్తోంది.

ఇప్పటివరకు విదేశీ కంపెనీల డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఫోన్లను అసెంబ్లింగ్‌ చేయడం భారత ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా దేశీయంగా మొబైల్‌ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితమే మొదలైన ప్రయత్నం

సుమారు మూడేళ్ల క్రితం భారతీయ డిజైనర్లు సొంతంగా మొబైల్‌ ఫోన్‌ పీసీబీ (పీసీబీ) లేదా ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సవాల్‌ విసిరింది. ఫోన్‌లోని వివిధ ఎలక్ట్రానిక్‌ భాగాలను అనుసంధానించే ఈ బోర్డు.. పరికరం పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సవాల్‌ను రెండు కంపెనీలు స్వీకరించినట్లు సమాచారం. వాటిలో ఒక సంస్థ అభివృద్ధి చేసిన డిజైన్‌ను ప్రముఖ అమెరికా టెలికాం సేవల సంస్థ ఎంపిక చేసుకున్నట్లు వెల్లడైంది. ఇది భారతీయ ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి ప్రాధాన్యం పెరుగుతున్నదనే సంకేతంగా భావించవచ్చు.

అసలు పోటీ ధరలో కాదు.. టెక్నాలజీలో!

భారత్‌ సొంత మొబైల్‌ ఫోన్‌ను తీసుకొస్తే అది చైనా లేదా అమెరికా బ్రాండ్లకు వెంటనే పోటీగా నిలుస్తుందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విజయం సాధించాలంటే తక్కువ ధర ఒక్కటే సరిపోదు. మెరుగైన పనితీరు, భద్రత, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, కెమెరా నాణ్యత, సర్వీస్‌ నెట్‌వర్క్‌ కూడా కీలకమే.

అదే సమయంలో దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వల్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. భారతీయ స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. హార్డ్‌వేర్‌ డిజైన్‌, చిప్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశోధన రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు పెరగవచ్చు.

2028.. భారత్‌కు టెక్నాలజీ టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందా?

భారత్‌ ఇప్పటికే మొబైల్‌ ఫోన్ల తయారీలో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ తయారీ కేంద్రంగా ఎదగడం ఒక దశ అయితే ప్రపంచానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడం మరో దశ. ఇప్పుడు దేశం ముందున్న అసలైన సవాల్‌ రెండో దశలో విజయం సాధించడమే.అక్టోబర్‌ 2028 నాటికి సొంత డిజైన్‌, దేశీయ తయారీ, భారతీయ బ్రాండ్‌తో ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తుందన్న కేంద్రమంత్రి వైష్ణవ్ ప్రకటన ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది.

భారత్‌ ఇక ఇతరుల ఫోన్లను తయారు చేసే దేశంగానే కాకుండా సొంత టెక్నాలజీతో ప్రపంచానికి ఫోన్లను అందించే దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2028 నాటికి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అసలు స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌ విజయం దాని మీద ముద్రించే ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అక్షరాల్లో కాదు.. దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఎంతవరకు భారతీయమన్న దానిలోనే ఉంటుంది.

Tags:    

Similar News