బెంగళూరు ప్యాలెస్ లోనే అంజలి రెడ్డి పెళ్లి వేడుక..? జగన్ నో అన్నా వెనక్కి తగ్గేదే లేదంటున్న షర్మిల?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అక్షరాల రూపం కావాల్సిన పెళ్లి పత్రిక.. ఇప్పుడు రాజకీయ కక్షలకు, భద్రతా అభ్యంతరాలకు సాక్ష్యంగా మారింది..

Update: 2026-10-24 13:36 GMT

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అక్షరాల రూపం కావాల్సిన పెళ్లి పత్రిక.. ఇప్పుడు రాజకీయ కక్షలకు, భద్రతా అభ్యంతరాలకు సాక్ష్యంగా మారింది.. రక్త సంబంధాల మధ్య దూరం పెరిగినా, కూతురి వేడుకలో మాత్రం ‘వెనక్కి తగ్గేదే లేదంటూ’ షర్మిల వేస్తున్న అడుగులు ఇప్పుడు వైఎస్సార్‌ కుటుంబంలో కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేదిక ఎంపిక వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక కుటుంబ వేడుకగా మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది.

వివాహ వేదికగా బెంగళూరు యెలహంక నివాసమేనా?

డాక్టర్ సోమాల రఘురామ రెడ్డితో అంజలి రెడ్డి వివాహానికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమచారం ప్రకారం.. నవంబర్ 25న సాయంత్రం 5 గంటలకు బెంగళూరులోని యెలహంకలో ఉన్న షర్మిల స్వగృహంలోనే ఈ పెళ్లి వేడుక జరగనుంది. వరుడి కుటుంబం పంపిణీ చేస్తున్న ఆహ్వాన పత్రికల్లో కూడా ఇదే వేదిక ప్రస్తావనకు రావడంతో షర్మిల తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకుండా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలను షర్మిల వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

భద్రతా నెపంతో జగన్ అభ్యంతరాలు?

యెలహంకలోని ప్రైవేట్ నివాసంలో వివాహం నిర్వహించడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాలు, ప్రోటోకాల్ సమస్యలను ప్రస్తావిస్తూ వేరే ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని ఆయన సూచించినట్లు ఓ లేఖ విడుదలైంది. ఈ మేరకు ప్రచారం సాగుతోంది. అయితే ఈ అభ్యంతరాలపై షర్మిల కుటుంబం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో జగన్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ షర్మిల వర్గం రాసినట్లు చెబుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వైరల్ లేఖలోని ప్రధానాంశాలు

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వివాహాలు, అప్పటి భద్రతా పరిస్థితులను లేఖలో గుర్తుచేశారు. యెలహంక ఎస్టేట్‌లో తగినంత విస్తీర్ణం, భద్రతా గోడలు ఉన్నాయని.. పరిమిత అతిథులతో ప్రశాంతంగా వేడుక నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ వేదిక వద్దకు రావడం జగన్‌కు ఇబ్బందిగా అనిపిస్తే ఆయనకు వేరే చోట ఉండేందుకు సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ రంగు పులుముకున్న కుటుంబ వేడుక

సాధారణంగా కుటుంబంలో జరిగే శుభకార్యాలు వ్యక్తిగతమైనవిగా ముగుస్తాయి. కానీ వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న రాజకీయ విభేదాల రీత్యా ఈ పెళ్లి వేడుకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు జగన్ ఈ వివాహానికి హాజరవుతారా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

పెళ్లి వేదికపై తలెత్తిన ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో, వైఎస్ కుటుంబం నుంచి దీనిపై ఎప్పుడు అధికారిక స్పష్టత వస్తుందో వేచి చూడాలి. నవంబర్ 25న జరగబోయే ఈ వేడుక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

Tags:    

Similar News