#ViralNews పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రచ్చ లేపుతున్న ఇండిపెండెంట్!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మెజార్టీ మున్సిపాలిటీల్లో అభ్యర్థులపై స్పష్టత రావడంతో అందరూ ప్రచారంలో దూకుడు పెంచారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పరాకాష్ఠకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మెజార్టీ మున్సిపాలిటీల్లో అభ్యర్థులపై స్పష్టత రావడంతో అందరూ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, పార్టీల హామీలను మించిపోయేలా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వినూత్న హామీలు, ప్రలోభాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మున్సిపాలిటీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ మున్సిపాలిటీలో ఒక కౌన్సిల్ పదవికి పోటీచేస్తున్న ఇండిపెంటెంట్ అభ్యర్థి ప్రకటించిన ఆఫర్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తనను గెలిపిస్తే ఏడాది పాటు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా కేబుల్ టీవీ సేవలు అందిస్తానని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటంతో, ఈ హామీ పట్ల స్థానిక ఓటర్లు బాగా ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు అప్పటివరకు తమ ఇళ్లలో డిష్ కనెక్షన్లు వాడుతున్న కొందరు ఓటర్లు, వాటిని తొలగించి వెంటనే కేబుల్ వైర్లు వేయాలంటూ స్వయంగా ఆ అభ్యర్థినే కోరడం అక్కడి ప్రచార సరళికి నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే ఈ ఉచిత కేబుల్ టీవీ హామీ వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలను గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని అంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలోని ఒక వార్డులో సగటున 1,500 నుండి 2,000 వరకు ఓట్లు ఉంటాయని, అంటే దాదాపు 500 వరకు ఇళ్లు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం ఒక ఇంటికి కేబుల్ టీవీ కనెక్షన్ ఖర్చు నెలకు కనీసం రూ. 350గా లెక్కించినా, ఒక కుటుంబానికి ఏడాదికి రూ. 4,200 వరకు అవుతుంది. ఈ లెక్కన వార్డులోని 500 ఇళ్లకు ఏడాది పాటు ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు అందించాలంటే సదరు అభ్యర్థి తన సొంత జేబు నుంచి ఏకంగా రూ. 21 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక సాధారణ మున్సిపల్ వార్డు సభ్యుడిగా గెలవడం కోసం ఒక అభ్యర్థి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
వాస్తవానికి ఇలాంటి వినూత్న ప్రచారాలు కేవలం పిఠాపురానికే పరిమితం కాలేదని అంటున్నారు. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు ఓటర్లకు రకరకాల గృహోపకరణాలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. కొన్నిచోట్ల ఓటర్లు కూడా ఒక అడుగు ముందుకేసి తమకు ఏ వస్తువులు కావాలో ముందుగానే అభ్యర్థులకు ఇండెంట్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కురిపిస్తున్న హామీలు, ఇస్తున్న ఆఫర్లు ఏపీ రాజకీయంలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.