పాక్ దయ వల్లనే... మాజీ సీఎం వివాదాస్పద కామెంట్స్ !

ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ లో సీనియర్ మోస్ట్ లీడర్. అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అవరు.

Update: 2026-10-25 03:45 GMT

ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ లో సీనియర్ మోస్ట్ లీడర్. అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అవరు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధిపతి అయిన ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనే అతి పెద్ద రాజకీయ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఫరూఖ్ అబ్దుల్లా బారాముల్లా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ పొరుగు దేశమైన పాకిస్థాన్ కారణంగానే కశ్మీర్ రక్షించబడుతోందని కామెంట్స్ చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి కశ్మీరీలకు పెద్దగా ఆశలు లేవని విమర్శించారు. ఇక ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది ఫరూఖ్ అబ్దుల్లాను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

ఇంతకీ ఏమన్నారంటే :

ఇక ఫరూఖ్ అబ్దుల్లా బారాముల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కాశ్మీర్ ని ప్రజలు కాపాడుకోకపోతే మిమ్మల్ని తుడిచి పెట్టేస్తారు అని జనాలను హెచ్చరించారు. కాశ్మీరీల గుర్తింపు కూడా కనుమరుగవడం ఖాయమని అన్నారు. ఈ రోజున ప్రపంచమంతా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వాళ్లు ఈ రోజు మౌనంగా ఉన్నారు లేకపోతే కాశ్మీర్ విషయంలో వేరేగా ఆలోచన చేసేవారు అని కామెంట్స్ చేశారు. ఇక కాశ్మీర్ వెనుక నిరంతరం పొరుగు దేశం ఉందని పాక్ ని మంచిగా చెప్పుకొచ్చారు. అందుకే ప్రతిచోటా కశ్మీర్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, ఇపుడు అదే మనల్ని కాపాడుతోందని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. అలా కాకపోతే వారి ఉద్దేశాలు మంచివి కావు అని బీజేపీని పరోక్షంగా విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొందరు విడదీస్తున్నారు :

కాశ్మీరీలు అంతా తాము భారతీయులమనే చెబుతారు అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ సైతం భారతదేశంలోనే కాశ్మీరీలు విలీనమయ్యారని పదేపదే ధృవీకరించారని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం అధికారం కోసం ముస్లింలను, హిందువులను ఒకరిపై ఒకరిని రెచ్చగొడుతున్నారని పరోక్షంగా బీజేపీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు సత్ శర్మ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఫరూఖ్ ఇండియాలో ఉన్నారు కాబట్టే ఆయన తనకు నచ్చింది మాట్లాడే స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు.

బీజేపీ డిమాండ్ :

అదే ఆయన ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ పాకిస్థాన్‌లో చేసి ఉంటే వారు ఎప్పటికీ వదిలిపెట్టే వారు కాదని అన్నారు. ఇక భారత్ చేతుల్లో తాము సురక్షితంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ లో ప్రతీ ఒక్క ముస్లింకి తెలుసని అన్నారు. ఫరూఖ్ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయనకు పాకిస్థాన్ మెరుగైన దేశం అవుతుంది కాబట్టి అక్కడికే వెళ్లి స్థిరపడవచ్చని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలోనే కశ్మీర్ జాతీయ ప్రధాన స్రవంతిలో కలిసిందని పలువురు బీజేపీ నేతలు గుర్తు చేశారు. కాశ్మీర్ పౌరులు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో సమానమైన హక్కులను అనుభవిస్తున్నారని వారు అంటున్నారు. ఫరూఖ్ కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా పాలిస్తూ కాశ్మీర్ వనరులను దోచుకుందని బీజేపీ నేతలు విమర్శించారు.

Tags:    

Similar News