వేలంపాటలో ఎంపీటీసీ సీటు... వైసీపీకి బూమరాంగ్ !
ఏకగ్రీవాలు వద్దే వద్దు అన్నది వైసీపీ అధినేత జగన్ నినాదం. దానికి వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిలు వారి పరిధిలో శక్తిమి మించి శ్రమ పడుతున్నారు.
ఏకగ్రీవాలు వద్దే వద్దు అన్నది వైసీపీ అధినేత జగన్ నినాదం. దానికి వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిలు వారి పరిధిలో శక్తికి మించి శ్రమ పడుతున్నారు. అయితే ఒక నియోజకవర్గంలో అనేక సీట్లు ఉంటాయి. అందరి మీద నిఘా పెట్టి ఉంచడం కష్టం. ముఖ్యమగా ఎంపీటీసీ పదవుల విషయం తీసుకుంటే ఏకగ్రీవాల కోసం అధికార కూటమి ప్రయత్నాలు గట్టిగా ఒక వైపు ఉన్నాయి. ఇక వైసీపీ అభ్యర్ధులు కొన్ని సందర్భాలలో జారిపోతున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. అలాగే తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
ఆలయ అభివృద్ధి కోసం :
తమ ఊరిలో ఎన్నికల్లో పోటీ లేకుండా స్థానికంగా ఉన్న ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా 16.80 లక్షలకు బుచ్చంపేట ఎంపీటీసీ సీటుని ఏకగ్రీవం చేసేలా ఒక బహిరంగ వేలం పాటే జరిగింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయితే తన నామినేషన్ ని ఉపసంహరించు కోవడానికి సిద్ధపడ్డారు. అలా రాజకీయంగా ఇది రచ్చగా సాగి ఏకంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అక్కడికి చేరుకోవడం తో వ్యవహారం కొత్త రూపు దాల్చింది.
వైసీపీ ఆగ్రహం :
ఊరిలో ఆలయ అభివృద్ధి కోసం పెద్దల నిర్ణయం మేరకు తాను ఉప సంహరణకు సిద్ధపడ్డాను అని బుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మణికంఠ చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఆయన మీద చేయి చేసుకున్నారని అంటున్నారు. తమకు చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు అని కూడా అంటున్నారు. అయితే ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఆయన వెంట వచ్చిన అనుచరులు చెప్పుతో కొట్టారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఏకంగా వైసీపీ నేతలకు ఎదురు తిరిగారు అని అంటున్నారు. అలా తోపులాటలు అక్కడ చోటు చేసుకోవడంతో వీఆర్వో ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేశారు.
కూటమి పరామర్శతో :
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మణికంఠకు జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు బుచ్చంపేటకు చేరుకుని పరామర్శించడం విశేషం. అంతే కాదు కూటమి నేతలు అంతా క్యూ కట్టి మరీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్ధిని పరామర్శించడంతో దీని వెనక బాధితుడికి ఓదార్పు ఉందా లేక రాజకీయ వ్యూహంగా ఇది ఉందా అన్న కొత్త చర్చ సాగుతోంది. వైసీపీ తరఫున బుచ్చంపేట ఎంపీటీసీగా నామినేషన్ వేసి చివరికి కూటమికి ఆ అభ్యర్థి మంచి అయిపోతే తాము నిలబెట్టిన అభ్యర్థి బరిలో నుంచి తప్పుకున్నారు అన్న ఆగ్రహంతో వైసీపీ నేతలు కోపంతో వ్యవహరించిన తీరుకు పోలీసు కేసులు పెట్టించుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు.
వైసీపీలో ఎందుకిలా :
వైసీపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక చలనం తీసుకుని వస్తాయని వారిలో గ్రౌండ్ లెవెల్ లో కసి పెరుగుతుందని పార్టీ చేసిన ఆలోచనలు రివర్స్ అవుతున్నాయని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందరి కంటే స్థానిక నేతలకే తెలుసు అని అంటున్నారు. అందుకే ఎటూ ఓటమికి కోరి తెచ్చుకోవడం కూటమికి వ్యతిరేకం కావడం ఎందుకు అని చాలా మంది నామినేషన్లు ఉపసంహరణ పేరుతో జారిపోతున్నారు.ఇదే ఇపుడు వైసీపీని కలవరపెడుతోంది అని అంటున్నారు.