మరోసారి.. కశ్మీర్ పేరుతో దేశాన్ని దెబ్బ తీసే పెద్ద మనిషి
శనివారం బారాముల్లాలో నిర్వహించిన తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన అనునచిత వ్యాఖ్యలు చేశారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడే రాజకీయ నేతలకు భారతదేశంలో కొదవ లేదు. కానీ.. నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా. 89 ఏళ్ల వయసులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీర్ లో విద్వేష అగ్గి రాజేస్తూ.. ఆ మంటల్లో రాజకీయ ప్రయోజనాల్ని కాపాడుకునే కుటిలత్వం ఈ ‘భారతీయుడి’ సొంతం. తాను భారత్ కు వ్యతిరేకం కాదంటూనే.. భారత్ కు వ్యతిరేకంగా.. దాని ఇమేజ్ దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసే తీరు ఆయనకు ఎక్కువే. కశ్మీర్ పేరుతో ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారటమే కాదు.. భారత్ ను ఇరకున పడేసేలా ఉంటాయి. తాజాగా ఆయన ఇదే తీరును రిపీట్ చేశారు.
శనివారం బారాముల్లాలో నిర్వహించిన తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన అనునచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఇరుకున పడేలా చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఫరూక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని చూస్తే..
- కశ్మీరీలను పాకిస్థాన్ రక్షిస్తోంది. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించేలా పొరుగు దేశమైన పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోంది.
- పరిష్కారం కాని కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై సజీవంగా ఉంచుతూ జమ్మూకశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ రక్షణగా నిలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశించడానికి ఏమైనా కారణం ఉందా ? ప్రజలు పోరాడకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు ధైర్యంగా ఉండాలి.
- ధైర్యంగా ఉండండి. మనం వారిని (కేంద్ర ప్రభుత్వం) ఎదుర్కొందాం. మీరు ధైర్యం కూడగట్టుకోకపోతే అంతరించిపోతారు. అప్పుడు వారు మీ పేరు, మీ గుర్తింపును పూర్తిగా చెరిపేస్తారు. కశ్మీర్ కు సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోలేదంటున్నారు వారు. అలాంటి వ్యాఖ్యలే మనల్ని కాపాడుతున్నాయి. లేదంటే కేంద్ర ఉద్దేశాలేమీ అంత బాగాలేవు. మన పొరుగు దేశం (పాకిస్థాన్) వారిపై ఒత్తిడి కొనసాగిస్తున్నందునే వారు (కేంద్రం) ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. పాకిస్థాన్ ఎక్కడికి వెళ్లినా కశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని చెబుతోంది. అదే మనల్ని కాపాడుతోంది.
- జమ్ముకశ్మీర్ ప్రజలు భారతీయులం అనేందుకు ఏనాడు వెనుకాడలేదు. మేం భారతీయులం కామని ఎన్నడూ అనలేదు. మేం భారతదేశంలో కలిసిపోయామని పదే పదే చెబుతూ వచ్చాం. మహాత్మాగాంధీ.. నెహ్రూ.. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ ల భారతదేశంలో మమేకం అయ్యాం. హిందూ.. ముస్లింలను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పే రోజు ఒకటి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు.
- కేవలం అధికారం కోసం ఒక్క పీఠం కోసం జరుగుతుందని అనుకోలేదు. భారతీయత నశిస్తుందన్న ఆలోచన ఎన్నడూ కలగలేదు. కానీ.. జరిగిపోయింది. అయితే.. ఇది కూడా కొంతకాలమే. భగవంతుడి దయతో మళ్లీ మంచిరోజులు వస్తాయి. ఢిల్లీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందంటే.. అంతర్జాతీయ పరిణామాలు కారణం. ఇంకోవైపు పొరుగుదేశం నిత్యం మన వెనుకే ఉంటోంది.
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై అణచివేత చర్యలు పాల్పడుతున్నారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా ముస్లింలు అందరూ ఏకం కావాలి. ఈ కూల్చివేతలు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఉద్దేశపూర్వకంగా చేపడుతున్నారు. ఇళ్లు.. షాపులు.. ప్రార్థనా స్థలాల్ని కూల్చేస్తున్న రాజకీయ పార్టీలకు ముస్లింలు మద్దతు ఇస్తారని ఎలా అనుకుంటున్నారు? హక్కులను కాపాడుకునేందుకు కలిసి కట్టుగా పని చేయాలి.
ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. దానికి కౌంటర్ గా బీజేపీ వ్యాఖ్యలు చేయటం మామూలే. తాజాగా అదే జరిగింది. పాకిస్తాన్ తమను కాపాడుతోందని మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహమని బీజేపీ విమర్శించింది. ఈ తరహా వ్యాఖ్యలు ఫరూక్ కొనసాగిస్తే ఆయన పాకిస్తాన్ కు వెళ్లిపోవాల్సి వస్తుందంటూ బీజేపీ జమ్ముకశ్మీర్ విభాగ అధ్యక్షుడు సత్ శర్మ మండిపడ్డారు. చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా తీరును చూస్తే.. తరచూ ఏదో ఒక వేదికపై నుంచి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.
కశ్మీర్ లో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు.. లోయలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వివాదాస్పద వ్యాఖ్యలను అస్త్రాలుగా చేసుకోవటం కనిపిస్తుంది. లోయలోని ఓటర్లలో ఎక్కువమందికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా.. ఆర్టికల్ 370 రద్దు అంశంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దీన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లించేందుకు వీలుగా ఆయన తరచూ వివాదాదస్పద వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది.
గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో కొన్నింటిని చూస్తే.. ఆయన తీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్దే అని అనడం, ఆర్టికల్ 370 పునరుద్ధరణకు చైనా మద్దతు కోరడం వంటివి చేస్తుంటారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని.. పీవోకేను భారత్ తిరిగి తీసుకోలేదని.. ఆ దేశ సైనిక బలాన్ని గొప్పగా చెప్పటం కనిపిస్తుంది. ఆర్టికల్ 370 రద్దును రాజ్యాంగ ఉల్లంఘనగా ఆయన అభివర్ణిస్తుంటారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టపరమైన.. రాజకీయ పోరాటానికి పిలుపునివ్వటం కనిపిస్తుంది.
గతంలో ఎక్కువగా కేంద్ర పెద్దలను.. వారి రాజకీయ విధానాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాజా వ్యాఖ్యల్లో మాత్రం జమ్ము కశ్మీర్ పోలీసులను.. భద్రతా వ్యవస్థలను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి తమకు న్యాయం జరగదని పేర్కొంటూ.. అంతర్జాతీయ ఒత్తిడితోనే కేంద్రం మౌనంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేందుకు సైతం వెనుకాడని తీరును ఆయన ప్రదర్శించారు. ఇదంతా చూస్తే.. తన రాజకీయ మనుగడ కోసం దేశాన్ని సైతం ముంచేందుకు వెనుకాడని తీరు ఆయన మాటల్లో కనిపిస్తుందని చెప్పాలి.
కేంద్రానికి వ్యతిరేకంగా దూకుడుగా మాట్లాడుతూ.. స్థానిక సెంటిమెంట్ ను ఎప్పటికప్పుడు రాజేస్తూ.. అందులో తన రాజకీయ మైలేజీని పెంచుకోవటం కనిపిస్తుంది. లోయలో తమ పార్టీనే ప్రధాన రాజకీయ శక్తి అని నిరూపించుకునే పాత కాలం వ్యవహారాల్ని ఇప్పటికి కొనసాగించటం కనిపిస్తుంది. ఫరూక్ వ్యాఖ్యల్ని చూస్తే.. ఆయన ఒకే సమయంలో అటు ఢిల్లీలో తాను భారతీయుడినని చెప్పుకుంటూ.. జాతీయ కూటమిలో భాగస్వామి ఉంటారు. అదే సమయంలో కశ్మీర్ లోయకు వచ్చేసరికి అక్కడి ప్రజలను ఆకట్టుకోవటానికి వీలుగా పాకిస్తాన్ ప్రస్తావన తీసుకురావటమో.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవటం కనిపిస్తుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ తరహా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కారణంతోనే లోయలో తిరుగులేని అధిక్యతను సొంతం చేసుకున్న ఫరూక్ జమ్ములోతమ పార్టీ అధిక్యతను పూర్తిగా కోల్పోవటం కనిపిస్తుంది. అదే సమయంలో లోయలో తన రాజకీయ ప్రత్యర్థుల కంటే ఎంతో ముందున్న ఆయన.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో జమ్ముకశ్మీర్ లో కొందరికి దగ్గర కాగా.. మరికొందరికి దూరమయ్యారని చెప్పాలి.