మన్ కీ బాత్ లోనూ మోడీ రికార్డు
ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎన్నో రికార్డులు వెంటనే గుర్తుకు వస్తాయి. ఆయన ఇటీవలనే పాతికేళ్ళ అధికార జీవితాన్ని పూర్తి చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎన్నో రికార్డులు వెంటనే గుర్తుకు వస్తాయి. ఆయన ఇటీవలనే పాతికేళ్ళ అధికార జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. అందులో 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే 12 ఏళ్ళ నుంచి దేశానికి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన గుజరాత్ కి కంటిన్యూస్ సీఎం. అంతే కాదు లాంగెస్ట్ సీఎం. అదే విధంగా దేశంలో నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధాని అయిన ఘనత మోడీదే. ఇక ఈ టెర్మ్ పూర్తి చేసుకుంటే ఇందిరమ్మ ప్రధానిగా పదవీ కాలాన్ని సమం చేస్తారు. ఎమ్మెల్యే కాకుండా ఎక్కడా పోటీ చేయకుండా గుజరాత్ సీఎం కావడం ఒక హిస్టరీ అయితే జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే నేరుగా ప్రధాని కావడం మరో రికార్డు. తొలిసారి ఎంపీ అదే టెర్మ్ లో పీఎం ఇలా మోడీ పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది.
రేడియో ప్రయాణంలోనూ :
ఇదిలా ఉంటే మోడీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ఈ ఆదివారం ప్రసారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దాంతో ఇందులో కూడా మోడీ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసారు అని అంటున్నారు. పన్నెండేళ్ల క్రితం 2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన మోడీ రేడియో మాధ్యమంగా చేసుకుని మన్ కీ బాత్ పేరుతో వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ నెలా చివరి ఆఖరి వారం ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆ నెలలో దేశంలో జరిగే కార్యక్రమాలు అభివృద్ధి, సంస్కృతి, పండుగలు, క్రీడలు, యువత, మహిళకు, వ్యవసాయం ఇలా అనేక అంశాలను ఆయన తీసుకుని చర్చిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాల విశిష్టత గురించి కూడా ప్రస్తావిస్తారు. అలాగే దేశంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులను కార్మికులను విద్యార్ధులను, యువతను వృద్ధులను ఎవరి దగ్గర ప్రతిభ కష్టం ఉందో వారిని తన మన్ కీ బాత్ ద్వారా కొనియాడుతూ దేశ ప్రజలకు పరిచయం చేస్తారు.
తీర్ధ యాత్రలాగా :
తన పన్నెండేళ్ల మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ఒక తీర్ధ యాత్రగా అభివర్ణించడం విశేషం. ఇది నిరంతరాయంగా కొనసాగుతోందని అన్నారు. ఈ ప్రయాణంలో దేశ ప్రజలు అంతా తన సహ ప్రయాణికులుగా స్ఫూర్తిదాతలుగా ఆయన చెప్పుకొచ్చారు. శతాబ్దాలుగా దేశంలో తీర్థయాత్రల సంప్రదాయం ఉందని మోడీ చెబుతూ దేశ ప్రజల గురించి అర్థం చేసుకోవడానికి వారి సేవలను ప్రతిభను కృషిని తలచుకుని అభివందనం చేయడానికి మన్ కీ బాత్ తనకు ఒక తీర్థయాత్ర గా ఉపయోగపడింది అని ఆయన చెప్పారు.
రేడియోకు వెలుగు :
దేశంలో ఎన్నో ప్రసార సాధనాలు వచ్చాయి, వినోద మాధ్యమాలు వచ్చాయి. వాటి మధ్యన రేడియో వెనకబడింది. ఒకప్పుడు రేడియోవే అన్నింటికీ ఆధారం. అలాంటివి రేడియో ఊసే లేని కాలంలో మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తిరిగి రేడియోకు ఎంతో ప్రాచుర్యం కల్పించారు అని చెబుతారు. దాంతో రేడియో మరోసారి జనంలోకి వచ్చింది. అలా ఆయన ఒక బలమైన మీడియం కి ఊపిరి పోశారు అని కూడా పేర్కొంటారు. అలాగే సమాజం దృష్టికి రాని ఎందరో మహానుభావులు అసాధారణమైన పనుల గురించి తాను ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తావించాను అని మోడీ గర్వంగా చెప్పుకున్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశంలోని ప్రతీ కుటుంబంతో తనకు అనుబంధం అనుసంధానం ఏర్పడింది అని మోడీ చెప్పుకొచ్చారు.