దేవెగౌడ కుటుంబం అంతానికి రూ.600 కోట్ల ‘సుపారీ’ ఆరోపణలు.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు,,
కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ కాక రేగింది. ఒకప్పుడు కలిసి ప్రభుత్వం నడిపిన నాయకులు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.
కన్నడనాట రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. కాదు కాదు.. నేతలు రగిలిస్తుంటారు. ఇటీవలే సీఎంగా ఉన్న డీకే ఏకంగా తనపైనే ‘స్టింగ్ ’ ఆపరేషన్ జరిగిందని కాకరేపారు. ఇప్పుడు మాజీ సీఎం, కేంద్రమంత్రి హెచ్.డీ కుమారస్వామి ఏకంగా తమ ఫ్యామిలీ అంతానికి రూ.600 కోట్లతో సుపారీ ఇచ్చి అంతం చేయాలని చూస్తున్నారని బాంబు పేల్చారు. దీంతో ఎప్పుడూ లేనంత హాట్ గా కన్నడ రాజకీయం రగులుతోంది.
కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ కాక రేగింది. ఒకప్పుడు కలిసి ప్రభుత్వం నడిపిన నాయకులు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఒక ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. తమ కుటుంబాన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా పూర్తిగా నిర్మూలించేందుకు ఏకంగా రూ. 600 కోట్ల సుపారీ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ కుమారస్వామి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా తుడిచిపెట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని.. తమకు వ్యతిరేకంగా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని వివాదాస్పద అంశాలు, స్టింగ్ ఆపరేషన్లను ప్రస్తావిస్తూ.. వాటన్నింటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం తమ కుటుంబాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. ఒక గౌరవప్రదమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంపై ఇన్ని రకాల ఒత్తిళ్లు తీసుకురావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ అంతే తీవ్రంగా ఖండించింది. కుమారస్వామి వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని.. రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, ప్రజల సానుభూతి పొందేందుకే రూ. 600 కోట్ల సుపారీ వంటి కథనాలను అల్లుతున్నారని విమర్శించారు.
రాజకీయం ఏ స్థాయికి దిగజారిందో చెప్పడానికి ఈ ఆరోపణలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకరినొకరు రాజకీయంగా తొక్కిపడేసే క్రమంలో వస్తున్న ఈ ఆరోపణలు సామాన్య ప్రజలను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. నిజానిజాలు ఏవైనా రూ.600 కోట్ల సుపారీ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయాన్ని ఊపేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో.. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటకు వస్తాయో లేదో వేచి చూడాలి.