హెచ్-1బి వాసులకు గుడ్ న్యూస్.. కానీ 'కండీషన్స్ అప్లై'
అసలేం జరిగిందంటే.. 2025లో 'అమెరికా వెలుపల ఉన్న ప్రతిభావంతులను తక్కువ అంచనా వేస్తూ' తీసుకొచ్చిన ఈ 10000 డాలర్ల ఫీజు బాంబుతో కంపెనీల గుండెలు తారాజువ్వలయ్యాయి.
అమెరికా డ్రీమ్‌తో బతికేస్తున్న మన భారతీయులకు, ముఖ్యంగా ఐటీ బాబులకు తాజాగా ఊరటనిచ్చే వార్త ఒకటి అమెరికా నుంచి మునివేళ్లపై నడుచుకుంటూ వచ్చింది. పిటిషన్ పడాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆ ఘోరమైన 100,000 డాలర్ల అంటే సుమారు రూ.83 లక్షలు అదనపు ఫీజు కట్టనక్కర్లేకుండానే యుఎస్సిఐఎస్ మహానుభావులు కొన్ని హెచ్1బీ పిటిషన్లను దయతో ఆమోదించడం మొదలెట్టారట.. "అబ్బబా.. ఇక పెట్టెబేడా సర్దేసుకోవడమే ఆలస్యం" అని టికెట్లు బుక్ చేసుకోవడానికి ముందే కాస్త ఆగండి బాస్. ఎందుకంటే ఇది అమెరికా వీసా కథ.. ఇక్కడ సంతోషం ఎంత త్వరగా వస్తుందో ట్విస్టులు అంతకంటే స్పీడ్‌గా వస్తాయి..
కోర్టుల పుణ్యమా అని 'లక్ష డాలర్ల' గండం గడిచింది
అసలేం జరిగిందంటే.. 2025లో 'అమెరికా వెలుపల ఉన్న ప్రతిభావంతులను తక్కువ అంచనా వేస్తూ' తీసుకొచ్చిన ఈ 10000 డాలర్ల ఫీజు బాంబుతో కంపెనీల గుండెలు తారాజువ్వలయ్యాయి. "ఒక్క ఉద్యోగి కోసం లక్ష డాలర్లు కట్టాలా? దానికంటే ఇక్కడున్న వాళ్లతోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోవడం మేలు" అని కంపెనీలు చేతులెత్తేశాయి.
అయితే మాసాచుసెట్స్, కాలిఫోర్నియా కోర్టులు ఎంట్రీ ఇచ్చి "ఈ ఫీజు అన్యాయం" అని చెంపదెబ్బ కొట్టడంతో కథ మారింది. ప్రభుత్వం అప్పీళ్లకు వెళ్లినా ప్రస్తుతానికైతే "సరేలే ఫీజు లేకుండానే ప్రాసెస్ చేస్తాం" అని యుఎస్సిఐఎస్ ఒప్పుకుంది. దీంతో విదేశాల్లో ఉన్న మనవాళ్లకు మళ్లీ ఆశలు చిగురించాయి.
పిటిషన్ ఓకే.. మరి ప్రాసెసింగ్ ఎప్పుడు స్వామీ?
ఇక్కడే ఉందండి అసలైన సెటైర్.. ఫీజు లేకుండా దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ ఆ ఫైళ్లు అధికారులు ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకు నెట్టడానికే నెలలు పడుతోంది. పదిహేను రోజుల్లో పనైపోవాల్సిన 'ప్రీమియం ప్రాసెసింగ్' పెట్టినా.. జవాబు రాక లా ఆఫీసులు కోర్టు తలుపులు తట్టాల్సి వస్తోంది. న్యాయవాదులు లీగల్ వార్నింగ్‌లు ఇస్తే తప్ప కొందరి పిటిషన్లు కదలడం లేదంటే యూఎస్.సీఐఎస్ స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. పిటిషన్ ఆమోదం పొందింది కదా అని విమానం ఎక్కేద్దాం అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. 'పిటిషన్ అప్రూవల్'.. 'అమెరికాలో అడుగుపెట్టే అర్హత', 'ఆఫీసులో కుర్చీలో కూర్చునే పర్మిషన్'.. ఇవన్నీ వేర్వేరు గమ్యస్థానాలు.
రాబోయే రోజుల్లో ఏమవుతుందో ఎవరికి ఎరుక?
ఇప్పుడు ఫీజు రద్దయింది కదా అని శాశ్వతంగా పండగ చేసుకుందామంటే కుదరదు. రేపు తొమ్మిదో సర్క్యూట్ కోర్టు తీర్పు తిరగబడితే "పాత ఫీజుల బకాయిలు కట్టండి" అని యూఎస్.సీఐఎస్ మళ్లీ రంగు మార్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే గ్రీన్ కార్డ్, హెచ్1బీ ఆశావహులు తమ వీసా స్టాంపింగ్, గత లాటరీ వివరాలు, పాత ఐ-797 ఫారమ్‌లను జాగ్రత్తగా దాచుకోండి. లాయర్ సలహా లేకుండా ముందడుగు వేస్తే 'లక్ష డాలర్ల' ఫీజు తప్పినా 'లక్ష తిప్పలు' మాత్రం తప్పవు.
"రూపాయి ఖర్చు లేకుండా అమెరికా కల నెరవేరుతోంది" అని సంబరపడాలో.. లేక "ఏ క్షణాన ఏ కోర్టు ఎలాంటి బాంబు పేలుస్తుందో" అని భయపడాలో తెలియక మన ఐటీ జనాలు దేవుడి దయ మీద భారం వేసి ఎదురుచూస్తున్నారు.