మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్?
అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లోని ఎంపిక చేసిన విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా కంపెనీని వీడే అవకాశం కల్పిస్తోంది. ఖర్చులను తగ్గించుకుంటూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 27 శాతం మందికి ఈ ఆఫర్ వర్తించే అవకాశం ఉంది.
అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లోని ఎంపిక చేసిన విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు. అయితే డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్ సహా కొన్ని విభాగాల ఉద్యోగులకు ఈ అవకాశం ఉండదు. ఉద్యోగులు తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు.
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ప్రకటించడం ఇది రెండోసారి. గత ఏప్రిల్‌లో అమెరికాలోని సుమారు 7 శాతం మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ అవకాశం కల్పించినట్లు వార్తలు వచ్చాయి. అర్హులైన వారిలో దాదాపు 30 శాతం మంది ఆ పథకాన్ని ఎంచుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది.
మైక్రోసాఫ్ట్‌లో గత ఏడాది చివరికి 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, జూన్ చివరి నాటికి ఆ సంఖ్య 2.23 లక్షలకు తగ్గింది. ఈ వారం కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐపై పెరుగుతున్న పెట్టుబడులు టెక్ రంగంలోని ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చకు ఈ నిర్ణయం మరింత ఊతమిస్తోంది.