టెక్ దిగ్గజంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: ఆపిల్‌లో రెండు నెలల్లో రెండో రౌండ్ ఉద్యోగాల కోతలు.. కారణమిదే..
తాజాగా ఆపిల్‌కు చెందిన ఫిట్ నెస్ ప్లస్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ 'బ్లూమ్‌బర్గ్' తన నివేదికలో వెల్లడించింది.
ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ 'ఆపిల్' ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండో రౌండ్ లేఆఫ్స్‌ను చేపడుతూ కంపెనీ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఆపిల్‌కు చెందిన ఫిట్ నెస్ ప్లస్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ 'బ్లూమ్‌బర్గ్' తన నివేదికలో వెల్లడించింది.
ఆడియో కంటెంట్ టీమ్‌పై తీవ్ర ప్రభావం
బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆధారంగా.. గడిచిన వారంలో ఫిట్ నెస్ ప్లస్ విభాగంలోని ఉద్యోగులకు లేఆఫ్స్ నోటీసులు అందాయి. ముఖ్యంగా ఆపిల్ వాచ్ వినియోగదారులకు ఎంతో ప్రియమైన 'టైమ్ టు వాక్’ 'టైమ్ టు రన్ ’ వంటి ప్రత్యేక ఫీచర్లకు, గైడెడ్ ఆడియో వర్కౌట్ కంటెంట్‌ను రూపొందించే టీమ్‌పై ఈ కోతల ప్రభావం ఎక్కువగా పడింది. వినియోగదారులు స్క్రీన్‌లు చూడాల్సిన అవసరం లేకుండా కేవలం ఆడియో సూచనలతోనే ఫిట్‌నెస్ సాధించేలా ఈ టీమ్ కంటెంట్ డిజైన్ చేసేది. అయితే ఈ రౌండ్‌లో ఎంతమంది ఉద్యోగులు విధులను కోల్పోయారనే దానిపై స్పష్టమైన సంఖ్య బయటకు రాలేదు. ఆపిల్ మేనేజ్‌మెంట్ కూడా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఫిట్ నెస్ ప్లస్ సేవలు నిలిచిపోతాయా?
సిబ్బంది సంఖ్యను తగ్గించినంత మాత్రాన ఫిట్ నెస్ ప్లస్ సేవలను ఆపిల్ పూర్తిగా నిలిపివేయడం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే క్రియేటివ్ ఆడియో టీమ్ పరిమాణం కుదించబడటంతో భవిష్యత్తులో కొత్త ఆడియో వర్కౌట్ కంటెంట్ విడుదల అయ్యే వేగం.. తరచుదనం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంటే వినియోగదారులకు సేవ అందుబాటులోనే ఉన్నప్పటికీ కొత్త అప్‌డేట్‌లు కాస్త ఆలస్యంగా లేదా తక్కువ సంఖ్యలో రావచ్చు.
ఆగస్టులోనే మొదటి రౌండ్ కోతలు
ఇదివరకు ఆగస్టు నెలలోనే ఆపిల్ తన వివిధ కీలక విభాగాల్లో భారీగా ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో దాదాపు 200 మందికి పైగా సిబ్బంది ఇంటి బాట పట్టారు. వారిలో విజిన్ ప్రో విభాగంలో సుమారు 100 ఉద్యోగాలు... సిరి, ఇతర సాఫ్ట్‌వేర్ టీమ్‌లు 100కు పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం.
కంపెనీ పునర్వ్యవస్థీకరణ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అభివృద్ధి విధానంలో వస్తున్న మార్పుల వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆపిల్ ఆ సమయంలో వెల్లడించింది. కొన్ని విభాగాల్లో పోస్టులను రద్దు చేస్తూనే మరికొన్ని వ్యూహాత్మక విభాగాల్లో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు పేర్కొంది.
ఏఐ, హెల్త్ ప్రాజెక్ట్‌లపై ఆపిల్ కొత్త వ్యూహం
ప్రస్తుతం ఆపిల్ హెల్త్, ఫిట్‌నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాలను మరింత సమగ్రంగా అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. యాపిల్ వాచ్ , ఫిట్ నెస్ ప్లస్ సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి.. ఏఐ ఆధారిత ఫీచర్లతో యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా కొన్ని సాంప్రదాయ టీమ్‌లను రీ-ఆర్గనైజ్ చేస్తోంది.
మొత్తానికి ఈ లేఆఫ్స్ కేవలం నిధుల పొదుపు చర్యలే కాకుండా.. ఏఐ, హెల్త్ టెక్నాలజీస్, సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యతలను మార్చుకునేందుకు ఆపిల్ వేస్తున్న పెద్ద అడుగుగా టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఫిట్ నెస్ ప్లస్ రూపురేఖలు ఎలా మారనున్నాయో తెలియాలంటే ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.