'టెక్' కన్నీళ్లు.. రోజుకు 654 కుటుంబాల్లో ఆరిపోతున్న ఆశల దీపాలు
నిన్నటివరకు ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందు కాంతివంతంగా వెలిగిన ఆ కళ్ళు.. నేడు అనిశ్చితి నీడల్లో తడిసిముద్దవుతున్నాయి.. ఒకప్పుడు టెక్ ఉద్యోగం అంటే భవిష్యత్తుకు బలమైన భరోసా..
నిన్నటివరకు ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందు కాంతివంతంగా వెలిగిన ఆ కళ్ళు.. నేడు అనిశ్చితి నీడల్లో తడిసిముద్దవుతున్నాయి.. ఒకప్పుడు టెక్ ఉద్యోగం అంటే భవిష్యత్తుకు బలమైన భరోసా.. కానీ నేడు పొద్దున్నే ఆఫీస్ మెయిల్ ఇన్ బాక్స్‌లో ఏ 'పింక్ స్లిప్' వేచి ఉందో అని నిమిషానికోసారి ధడధడలాడే గుండెచప్పుడు.. రోజుకు ఏకంగా 654 మంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. అది కేవలం కార్పొరేట్ లెక్కల కోత మాత్రమే కాదు.. వేలాది కుటుంబాల ఇళ్లల్లో ఆరిపోతున్న ఆశల దీపాల కన్నీటి గాథ...
ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే కేవలం ఒక కొలువు మాత్రమే కాదు.. అదొక సగౌరవ జీవితం.. కన్నవారి కళ్ళల్లో ఆనందం.. భవిష్యత్తుపై కొండంత భరోసా.. "మా వాడు ఆ టాప్ టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు" అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే రోజులు అవి. కానీ నేడు అదే టెక్ ప్రపంచంలో అడుగడుగునా ఆందోళన.. గుండెల్లో భయం నీడలు కమ్ముకున్నాయి. నిన్నటివరకు వెలుగులద్దిన కార్పొరేట్ ఆఫీసులు.. నేడు వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో అంధకారాన్ని నింపుతున్నాయి.
గణాంకాలు కావు.. వేలాది కుటుంబాల కన్నీటి గాథలు..
ట్రూ అప్ నివేదిక వెల్లడించిన నిజాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 674 కంపెనీలు లేఆఫ్స్‌ను ప్రకటించగా.. 1,97,640 మందికి పైగా తమ ఉపాధిని కోల్పోయారు. అంటే.. సగటున రోజుకు 654 మంది ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి. ఇవి కేవలం కాగితాలపై కనిపించే అంకెలు కావు.. 654 కుటుంబాలు ఎదుర్కొంటున్న మానసిక నరకానికి ప్రతీకలు. ప్రతీ నెలా కట్టాల్సిన ఇంటి ఈఎంఐలు.. పిల్లల స్కూల్ ఫీజులు.. వయోవృద్ధులైన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు.. నిత్యం బాధిస్తున్న ఇంటి అద్దెలు.. ఉద్యోగం పోయిన మరుక్షణమే ఇవన్నీ ఒకటొకటిగా వచ్చి గుండెపై కొండంత భారమై కూర్చుంటున్నాయి.
దిగ్గజ సంస్థల బిగ్ షాక్
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ఉద్యోగుల కోతకు తెగబడటం... మైక్రోసాఫ్ట్ ఏకంగా 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ బైఅవుట్ ఆఫర్లు ఇవ్వడం టెక్ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఎంత పెద్ద కంపెనీలో పనిచేసినా ఉద్యోగ భద్రత లేదనే పచ్చి నిజం ఉద్యోగులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ముంచుకొస్తున్న ఈ మార్పులు మనుషుల ఉపాధిని మింగేస్తున్నాయి.
జీతం మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసమూ పోతోంది..
లేఆఫ్స్ వల్ల పోయేది కేవలం నెలాఖరున వచ్చే జీతం మాత్రమే కాదు.. సమాజంలో ఒక ఉద్యోగికి ఉండే గుర్తింపు.. ఆత్మవిశ్వాసం.. కుటుంబానికి అండగా ఉన్నాననే ధైర్యం.. ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొనే టెక్కీలు.. నెలల తరబడి ఇంటర్వ్యూల చుట్టూ తిరిగి రిజెక్ట్ అవుతుంటే మానసికంగా నలిగిపోతున్నారు. సాంకేతిక అభివృద్ధి అనేది మనుషుల జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగపడాలి గానీ.. వారి జీవనాధారాన్నే దెబ్బతీసేలా ఉండకూడదు. ఆర్థిక మార్పులు అనివార్యమే కావచ్చు.. కానీ సంస్థలు లాభాల వేటలో ఉద్యోగుల మానవీయ కోణాన్ని.. వారి జీవన భద్రతను విస్మరించకూడదు.