92 వేల ఉద్యోగాలు మాయం.. కుప్పకూలుతున్న భారత ఐటీ రంగం?
ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్రెషర్స్ పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
ఒకప్పుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగం సాధిస్తే చాలు.. జీవితం స్థిరపడినట్లే అని భావించేవారు. ప్రతిష్ఠాత్మక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం.. చేతిలో ఆఫర్ లెటర్ పట్టుకోవడం ఎందరో యువతీ యువకుల, వారి తల్లిదండ్రుల నిశ్శబ్ద స్వప్నం. కానీ నేడు ఆ ఐటీ కలలపై అనిశ్చితి, అభద్రతా భావం నీడలు పరుస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజాల నుంచి దాదాపు 92 వేల మంది ఉద్యోగులు నిష్క్రమించారనే వార్త వినగానే సగటు టెక్ నిపుణుడి గుండెల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతోంది.
మారిన ఉద్యోగ స్వరూపం.. వెంటాడుతున్న ఆందోళన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం వేగంగా పుంజుకుంటున్న తరుణంలో టెక్ ప్రపంచం తీవ్ర మార్పులకు గురవుతోంది. గతంలో గంటల తరబడి కష్టపడి పూర్తి చేసిన ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్ వంటి పనులను నేడు ఏఐ టూల్స్ కంటిరెప్పపాటులో పూర్తి చేస్తున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా, యూరప్ క్లయింట్ల వ్యయ నియంత్రణ, క్లౌడ్ ప్రాజెక్టులలో వస్తున్న జాప్యం ఐటీ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి.
ఈ 92 వేల మంది సంఖ్యలో కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారే కాకుండా,, స్వచ్ఛందంగా కంపెనీలు మారినవారు.. రాజీనామా చేసినవారు కూడా ఉన్నప్పటికీ.. "రేపు నా పరిస్థితి ఏమిటి?" అనే ప్రశ్న ప్రతి ఐటీ ఉద్యోగి మనస్సును తొలిచేస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న మన భారతీయ టెక్ నిపుణులు కూడా వీసా నిబంధనలు, ఉద్యోగాల కోతలతో ఇబ్బందులు పడుతూ స్వదేశానికి తిరిగి రావలసి రావడం వారి ఆవేదనకు అద్దం పడుతోంది. క్వాల్కామ్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల్లోనూ పునర్వ్యవస్థీకరణ పేరిట జరుగుతున్న పరిణామాలు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి.
క్యాంపస్ కలల నుండి కఠిన వాస్తవంలోకి..
ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్రెషర్స్ పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. సాధారణ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. ఏఐ టూల్స్ వాడకం, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగం దక్కే పరిస్థితులు వచ్చాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన చదువుకు, మారుతున్న ఐటీ అవసరాలకు మధ్య ఉన్న అంతరం యువతను నిరాశకు గురిచేస్తోంది.
ఐటీ రంగం కుప్పకూలుతోందా?
అయితే ఈ గణాంకాలను చూసి ఐటీ రంగం పూర్తిగా కుప్పకూలిపోతోందని భావించడం తొందరపాటే అవుతుంది. ఇది కేవలం ఉద్యోగాల తొలగింపు మాత్రమే కాదు.. ఐటీ రంగానికి సంబంధించిన ఒక పెద్ద ‘రూపాంతరం’. పాత రకం ఉద్యోగాల అవసరం తగ్గుతున్నప్పటికీ.. ఏఐ మోడళ్ల అభివృద్ధి, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త విభాగాల్లో నూతన అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.
గాలివాటాన్ని బట్టి దిశ మార్చుకునే నావలాగా.. ప్రస్తుత ఐటీ ఉద్యోగి కూడా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడమేఈ అనిశ్చితికి ఏకైక పరిష్కారం. ఎంతటి పెనుమార్పులైనా సరే... కొత్త నైపుణ్యాన్ని ఆయుధంగా మలచుకున్న రోజే టెక్ నిపుణుడు తన కలను మళ్లీ నిజం చేసుకోగలడు.