ఏఐ కోర్సులు చదివితే లక్షల్లో జీతం వస్తుందా? ఉద్యోగం కోసం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అసలు నిజాలు
ఏఐ రంగంలో రాణించాలనుకునేవారు ఏకకాలంలో పది సర్టిఫికెట్లు సంపాదించడం కంటే ప్రాథమిక అంశాల నుంచి క్రమంగా ముందుకు వెళ్లడం ఉత్తమం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మార్కెటింగ్, తయారీ వంటి అనేక రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఏఐ, మెషీన్ లర్నింగ్, డేటా సైన్స్ కోర్సులపై విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఆన్లైన్లో కనిపించే లక్షల రూపాయల జీతాల ప్రకటనలు, తక్కువ సమయంలో ఏఐ నిపుణులుగా మారవచ్చనే ప్రచారాలు యువతను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఏఐ కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ లక్షల జీతంతో ఉద్యోగం వస్తుందనుకోవడం పూర్తిగా వాస్తవికం కాదు.
అసలు ప్రశ్న ఏఐ నేర్చుకోవాలా? అన్నది మాత్రమే కాదు. ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలి? ఉద్యోగానికి ఎంత సమయం పడుతుంది? ఖరీదైన కోర్సు అవసరమా? డిగ్రీ లేకపోతే అవకాశాలు ఉంటాయా? సర్టిఫికెట్‌కు అసలు ఎంత విలువ ఉంది? అనే సమగ్ర అంశాలను అర్థం చేసుకున్నప్పుడే విద్యార్థులు సరైన కెరీర్ నిర్ణయం తీసుకోగలరు.
భారతదేశంలో ఏఐ ఉద్యోగ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఉద్యోగ నియామక సంస్థ ఫౌండిట్ నివేదిక ప్రకారం దేశంలో క్రియాశీల ఏఐ ఉద్యోగ ప్రకటనల సంఖ్య భారీగా నమోదవుతోంది. సంస్థలు ఏఐ సాంకేతికతను కేవలం ప్రయోగాత్మక దశ నుంచి వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం కూడా ఐటీ రంగంలో ఏఐ సంబంధిత నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఈ గణాంకాలను చూసి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉందని భ్రమపడకూడదు. ఉద్యోగ ప్రకటనలు పెరగడం ఒకెత్తైతే ఆ ఉద్యోగాలకు అవసరమైన లోతైన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద ఉండటం మరో ఎత్తు. కేవలం ఏఐ టూల్స్ వాడటం తెలిసినవారు మాత్రమే కాకుండా డేటాను విశ్లేషించగలిగేవారు, ప్రోగ్రామింగ్ చేయగలిగేవారు, ఏఐ మోడళ్లను స్వయంగా రూపొందించి వాటిని నిజమైన అప్లికేషన్లలో అమలు చేయగలిగే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీల్లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
ఏఐ రంగంలో అత్యధిక వేతనాలు పొందుతున్న నిపుణులు ఉన్న మాట వాస్తవమే. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న రూ.30 లక్షలు, రూ.50 లక్షల ప్యాకేజీలను సాధారణ ఫ్రెషర్ల జీతాలుగా భావించకూడదు. ప్రారంభ స్థాయి ఏఐ, ఎంఎల్ ఇంజినీర్లకు జీతాలు సాధారణంగా కంపెనీ స్థాయి, అభ్యర్థి నైపుణ్యాలను బట్టి మారుతుంటాయి. అలాగే కంపెనీ ప్రకటించే వార్షిక ప్యాకేజీ అంటే నేరుగా చేతికి వచ్చే జీతం కాదని గుర్తుంచుకోవాలి. ఇందులో బోనస్‌లు, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఆఫర్‌ను అంచనా వేసేటప్పుడు స్థిర వేతనం , ఇతర తగ్గింపులను విడిగా బేరీజు వేసుకోవాలి.
ఏఐ రంగంలో రాణించాలనుకునేవారు ఏకకాలంలో పది సర్టిఫికెట్లు సంపాదించడం కంటే ప్రాథమిక అంశాల నుంచి క్రమంగా ముందుకు వెళ్లడం ఉత్తమం. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఏఐ, ఎంఎల్ అభివృద్ధికి అత్యంత కీలకమైన భాష. వేరియబుల్స్, లూప్స్, డేటా స్ట్రక్చర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఎస్ క్యూ ఎల్ , డేటా విశ్లేషణ ద్వారా కంపెనీల డేటాబేస్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి, ఫిల్టర్ చేసి విశ్లేషించడం నేర్చుకోవాలి. మోడల్ పనితీరును అంచనా వేయడానికి గణితం, గణాంకాలు చాలా అవసరం. రిగ్రెషన్, క్లాసిఫికేషన్, అల్గారిథమ్‌ల ఎంపిక వంటి ప్రాథమిక అంశాలపై మెషిన్ లెర్నింగ్ ద్వారా అవగాహన పెంచుకోవాలి. చాట్బాట్లు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏపీఐల అనుసంధానం వంటి జెనరేటివ్ ఏఐ, ఎల్ ఎల్ ఎం ఆధునిక అంశాలను సాధన చేయాలి.
మొదట్లోనే వేల రూపాయలు ఖరీదైన కోర్సులకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రముఖ టెక్ దిగ్గజాలు అందిస్తున్న ఉచిత వనరులతో ప్రాథమిక పరిజ్ఞానం పొందవచ్చు. గూగుల్ ఏఐ స్కిల్స్ ద్వారా జెనరేటివ్ ఏఐ , రెస్పాన్సిబుల్ ఏఐ పై ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా ఏఐ ప్రాథమిక అంశాలు.. అప్లికేషన్ల అభివృద్ధికి స్వీయ అభ్యాస కోర్సులు నేర్చుకోవచ్చు. ఐబీఎం స్కిల్స్ బిల్డ్ ద్వారా ఏఐ లిటరసీ, డేటా విశ్లేషణ, నైతికతపై డిజిటల్ క్రెడెన్షియల్ కోర్సులు పొందవచ్చు.
కేవలం ఆన్లైన్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ చూపితే సరిపోదు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలతో సొంతంగా కొన్ని ప్రాజెక్టులు రూపొందించాలి. ఆ కోడ్‌ను గిట్‌హబ్ లో పొందుపరిచి..ఇంటర్వ్యూలలో తమ సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగినప్పుడే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే వంద శాతం ఉద్యోగ హామీ లేదా ముందస్తు భారీ ఫీజులు వసూలు చేసే మోసపూరిత ప్రకటనల పట్ల విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సరైన ప్రణాళికతో క్రమశిక్షణతో కూడిన అభ్యాసమే మిమ్మల్ని విజయవంతమైన ఏఐ నిపుణుడిగా మారుస్తుంది.