ఏఐ విప్లవం : పెరుగుతున్న దేశ సంపద.. తుడిచిపెట్టుకుపోతున్న ఉద్యోగాలు?

అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రామాణికంగా తీసుకుని 2030 నాటికి సంభవించే మార్పులపై ఆంథ్రోపిక్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

Update: 2026-09-10 07:09 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతమై సంపద విపరీతంగా పెరుగుతుందని.. అయితే అదే సమయంలో లక్షలాది మంది ఉపాధి అవకాశాలు ప్రమాదంలో పడతాయని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ రూపొందించిన ఆర్థిక నమూనా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్, ఆఫీస్ విశ్లేషణ, పరిశోధన, కంటెంట్ సృష్టి, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి రంగాలలో పనిచేసే నాలెడ్జ్ వర్కర్లపై ఈ సాంకేతిక విప్లవం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రామాణికంగా తీసుకుని 2030 నాటికి సంభవించే మార్పులపై ఆంథ్రోపిక్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో సాధారణ, మధ్యస్థ , తీవ్రమైన అనే మూడు భిన్నమైన పరిస్థితులను విశ్లేషించారు. సాంకేతికత ఎంత వేగంగా విస్తరించినా ప్రతి సందర్భంలోనూ దేశ సంపద లేదా జిడిపి గణనీయంగా పెరుగుతుందని తేలింది. అయితే అత్యంత తీవ్రమైన పరిస్థితి తలెత్తితే మాత్రం నిరుద్యోగం ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఈ తీవ్రమైన నమూనా ప్రకారం సాధారణ నిరుద్యోగిత దాదాపు పన్నెండు శాతానికి చేరుకోవడమే కాకుండా నాలెడ్జ్ వర్కర్ల విభాగంలో నిరుద్యోగం ఏకంగా పద్ధెనిమిది శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అందుబాటులో ఉండే ఉద్యోగాల సంఖ్య ఐదో వంతుకు పైగా తగ్గిపోయి.. పనిచేసే ఉద్యోగుల వేతనాల్లో కూడా పది శాతానికి పైగా కోత పడే అవకాశం ఉంది.

ఇక్కడే ఒక పెద్ద సామాజిక చిక్కుముడి ఏర్పడుతోంది. సాంకేతిక పురోగతి కారణంగా అమెరికా జిడిపి ఏకంగా ముప్పై రెండు శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేసినప్పటికీ ఆ సంపద సాధారణ ప్రజలకు లేదా ఉద్యోగులకు సమానంగా పంపిణీ కాదు. ప్రస్తుతం జాతీయ ఆదాయంలో కార్మికులకు దక్కే వాటా అరవై శాతంగా ఉంటే కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో రాజ్యమేలే సమయంలో అది నలభై ఐదు శాతానికి పడిపోతుంది. దీని అర్థం ఏంటంటే దేశంలో ఉత్పాదకత పెరిగి సంపద సృష్టి భారీగా జరుగుతుంది కానీ ఆ లాభాలన్నీ కొద్దిమంది సాంకేతిక దిగ్గజాలు, కంపెనీల యజమానులు, పెట్టుబడిదారుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు మరీ ఎక్కువైపోతాయి.

మరోవైపు సాంకేతికత నెమ్మదిగా విస్తరించే సాధారణ పరిస్థితిని పరిశీలిస్తే అక్కడ నిరుద్యోగం చాలా స్వల్పంగానే పెరుగుతుంది. ఉద్యోగుల వేతనాల్లో కూడా స్వల్ప వృద్ధి కనిపిస్తుంది. మానవ శ్రమను పూర్తిగా తొలగించకుండా ఏఐ కేవలం మానవులకు సహాయకారిగా పనిచేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆంథ్రోపిక్ అందించిన ఈ నివేదికను ఒక ఖచ్చితమైన భవిష్యవాణిగా పరిగణించలేము. భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు, కంపెనీలు అనుసరించే విధానాలు, ఉద్యోగులు పెంపొందించుకునే నూతన నైపుణ్యాల ఆధారంగా పరిణామాలు మారవచ్చు. అంతిమంగా ఏఐ సృష్టించే భారీ సంపదను సమాజంలోని అన్ని వర్గాలకు ఏ విధంగా అందజేయాలనేది రాబోయే రోజుల్లో ప్రతి దేశం ఎదుర్కొనే అతిపెద్ద సవాలు కాబోతోంది.

Tags:    

Similar News