ఇండియాలో ఈ రంగాల్లో జాబ్స్ ...రెడీ అయిపోండి !

ఇండియాలో కొత్తగా పెద్ద ఎత్తున జాబ్ క్రియేషన్ అయ్యేది అయిదు కీలకమైన రంగాలలో అని అజయ్‌ బంగా తేల్చారు.

Update: 2026-09-03 00:37 GMT

సాంకేతికత విస్తరిస్తూంటే కొత్త అవకాశాలు కూడా ఆ వెంటనే వస్తూంటాయి. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగానే దీనిని చూడాలని ఉద్యోగ రంగ నిపుణులు చెబుతారు. ఉపాధి ఒక చోట లేదు అనుకుంటే మరో చోట పుట్టే ఉంటుంది. అలా భారత్ వంటి పెద్ద దేశంలో ఉపాధిని అధికంగా వృద్ధి చేసే కొన్ని కీలక రంగాలను వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా గుర్తించారు. తాజాగా ఆయన ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇండియాలో ఉపాధి అవకాశాల వృద్ధి ఏ ఏ రంగాలలో ఉంటుందో విశ్లేషించి మరీ చెప్పారు. ఇది నిజంగా ఉద్యోగార్ధులకు యువతకు ఎంతగానో ఉపయోగపడే విషయంగామే చూడాల్సి ఉంది.

అయిదు కీలక రంగాలు :

ఇండియాలో కొత్తగా పెద్ద ఎత్తున జాబ్ క్రియేషన్ అయ్యేది అయిదు కీలకమైన రంగాలలో అని అజయ్‌ బంగా తేల్చారు. ఆ రంగాలు మౌలిక వసతులు, వ్యవసాయం, ప్రాథమిక ఆరోగ్య సేవలు, పర్యాటకం, విలువ ఆధారిత తయారీ గా పేర్కొన్నారు. ఈ రంగాలలో భారీగానే ఉపాధి అవకాశాలు సృష్టి జరుగుతుందని అన్నారు. ఇక భారత్ లో రానున్న కాలంలో మౌలిక వసతుల రంగం అతి ముఖ్య భూమిక పోషించనుందని ఆయన చెప్పారు. ఈ రంగంలోనే అత్యధిక జాబ్స్ ఉంటాయని చెప్పారు. అవి ఎలా అంటే హదారులు, నిర్మాణ రంగంలో నేరుగా ఉపాధి లభించడంతో పాటు మెరుగైన కనెక్టివిటీ వల్ల ఇతర ఆర్థిక కార్యకలాపాలు కూడా ఉద్యోగాలు పెరుగుతాయని అజయ్‌ బంగా చెప్పారు.

చిన్న రైతుల కోసం :

ఇక రెండవ అతి కీలక రంగంగా చిన్న రైతుల వ్యవసాయానికి అవసరమైన సాంకేతికను అందించే రంగంగా అజయ్‌ బంగా పేర్కొన్నారు. ఈ రంగంలో కూడా జాబ్స్ ఎక్కువగానే ఉంటాయని అన్నారు. చిన్న రైతులు చేసుకునే వ్యవసాయంలో సాంకేతికత చాలా అవసరం పడుతుందని చెప్పారు. దానికి అవసరమైన టెక్నాలజీతో సన్న చిన్నకారు రైతులకు అవసరమైన విత్తనాలు ఇతర ఇన్‌పుట్స్‌ను పెద్ద స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం అతి ముఖ్యమైనదిగా ఉంటుందని అన్నారు. యూపీలో ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి సహకార సంఘాలు పెద్ద ఎత్తున ఈ పని చేయడం తాను చూశానని బంగా వివరించారు. అలా ఈ రంగంలో ఉపాధి చాన్స్ ఎక్కువగా ఆయన చెప్పుకొచ్చారు.

ప్రాథమిక ఆరోగ్య సేవలు సైతం :

ఇక శరవేగంగా ఇండియాలో మరో కీలక రంగం విస్తరిస్తోంది అని ఆయన చెప్పారు. ఆ రంగమే ప్రాథమిక ఆరోగ్య సేవల రంగంగా వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను స్థానిక స్థాయిలో క్లినిక్‌ల ద్వారా అందించే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పుట్టుకుని వస్తాయని అజయ్‌ బంగా చెప్పారు. ఈ రంగంలో నర్సులు, డయాగ్నోస్టిక్‌ టెక్నీషియన్లు, మిడ్‌వైఫ్‌లకు భారీగానే ఉపాధి లభిస్తుందని ఇక డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా వీటిని పెద్ద ఆసుపత్రులు వైద్యులతో అనుసంధానించవచ్చునని కూడా ఆయన తెలిపారు.

టూరిజంతో జాబ్స్ :

అంతే కాకుండా భారత్ లాంటి దేశాలలో టూరిజం కూడా బాగా విస్తరిస్తోంది అని ఆయన గుర్తించినట్లుగా చెప్పారు. టెంపుల్ టూరిజం డెస్టినేషన్ టూరిజం తో పాటు అనేక రకాలుగా ఇది విస్తరిస్తోంది అని అన్నారు. అలా భారత్ లో పర్యాటక రంగాన్ని కూడా భారీ ఉపాధి అవకాశంగా అజయ్ బంగా అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా తాను చర్చించినట్లు ఆయన చెప్పారు.

విలువ ఆధారిత రంగం :

ఇక అతి ముఖ్యమైన రంగంగా ఉపాధికి చోటు ఇచ్చేదిగా ఇటీవల కాలంలో భారత్ లో ఎదుగుతున్న రంగంగా విలువ ఆధారిత రంగాన్ని అజయ్ బంగా పేర్కొన్నారు. ఆఖరిది అయిదవది అయిన ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఖనిజాలు, లోహాలు, ఫ్యాషన్‌ వంటి రంగాలలో సమీప భవిష్యత్తులో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఉద్యోగాలతో పాటు ఆర్థిక విలువ కూడా పెరుగుతుందని అజయ్ బంగా విశ్లేషించారు. ఈ అయిదు రంగాలు అయితే భారత్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ఆయన అంటున్నారు. మరి వీటి మీద ఫోకస్ పెడితే యువతకు ఆశావహులకు జాబ్స్ కి కొదవలేదని భావించవచ్చు. ఆ దిశగా అంతా అడుగులు ముందుకు వేయాల్సి ఉంది.

Tags:    

Similar News