AI తో ఎంట్రీ లెవల్ జాబ్స్ డైలమా.. ఫ్రెషర్స్ ఏం చేయాలంటే?
గ్లోబల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లలో భాగస్వామి కావడం ద్వారా అనుభవాన్ని పొందే అవకాశం ఉంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ``ఉద్యోగం రావాలంటే అనుభవం ఉండాలి... కానీ అనుభవం రావాలంటే ముందు ఉద్యోగం రావాలి`` అనే పాత సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. కృత్రిమ మేధ (AI) వేగంగా పురోగమిస్తుండటంతో ఒకప్పుడు ఫ్రైషర్లు చేసే కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి రొటీన్ పనులను AI సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తోంది. దీనివల్ల కంపెనీలు ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలను తగ్గించుకుంటుండటంతో కళాశాలల నుంచి బయటకు వచ్చే కొత్త తరం గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలోకి అడుగుపెట్టే మొదటి మెట్టే మాయమవుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఎంట్రీ-లెవెల్ హైరింగ్ తగ్గుముఖం పట్టడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన టాలెంట్ కొరత ఏర్పడే ప్రమాదముంది. ఈ రోజు కంపెనీలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుని శిక్షణ ఇవ్వకపోతే.. ఐదేళ్ల తర్వాత ప్రాజెక్టులను నడిపించే సీనియర్ నిపుణులు ఎక్కడి నుంచి వస్తారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏఐ కేవలం ప్రస్తుత పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా.. ఒక సాధారణ మనిషి బిగినర్ నుంచి నిపుణుడిగా మారే లెర్నింగ్ ప్రాసెస్‌ను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ పరిణామం వల్ల ఫ్రెషర్ల అవసరం పూర్తిగా అంతరించిపోలేదు కానీ వారి నుంచి కంపెనీలు ఆశించే నైపుణ్యాల స్థాయి అతిగా పెరిగింది. గతంలో ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోయేది.. కానీ ఇప్పుడు AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తూ సీనియర్ స్థాయి అవుట్‌పుట్‌ను అందించగల ప్రతిభను పరిశ్రమ ఆశిస్తోంది. ఏఐ ఆధారిత సాధనాలను వాడుకుంటూ సమస్యలను వేగంగా పరిష్కరించగల సామర్థ్యం ఉన్న ఫ్రెషర్లకు.. అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
సాంప్రదాయ ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలు తగ్గినా.. ఫ్రెషర్లు తమ అనుభవాన్ని నిరూపించుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. కేవలం రెజ్యూమ్‌లపై ఆధారపడకుండా.. AI సాయంతో సొంతంగా ప్రాజెక్టులు... అప్లికేషన్లు రూపొందించి ``ప్రూఫ్ ఆఫ్ వర్క్`` చూపించడం ద్వారా అవకాశాలను పొందవచ్చు. ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్లు.. ఏఐ ఫ్రీలాన్సింగ్ .. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులు నేరుగా రియల్ వరల్డ్ అనుభవాన్ని సంపాదిస్తూ.. సాంకేతిక రంగంలో తమ ఉనికిని చాటుకోవచ్చు.
చివరికి AI వల్ల ఎంట్రీ-లెవెల్ పనులు ఆటోమేట్ అయినా ప్రాథమిక అవగాహన- సృజనాత్మకత కలిగిన మానవ మేధస్సుకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ``ఉద్యోగం వస్తేనే నేర్చుకుంటాను`` అనే పాత ఆలోచనా విధానాన్ని స్వస్తి చెప్పి.. ఏఐ టూల్స్‌ను ఉపయోగించి స్వయంగా అనుభవాన్ని సృష్టించుకోగల విద్యార్థులే రేపటి విజేతలుగా నిలుస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థలు కూడా ప్రాజెక్ట్ ఆధారిత బోధనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఈ ఎక్స్‌పీరియన్స్ గ్యాప్‌ను భర్తీ చేయడం సాధ్యమవుతుంది.
ఈ నాలుగు చాలా ముఖ్యం:
ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్స్ - గ్లోబల్ ప్రాజెక్ట్స్:
గ్లోబల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లలో భాగస్వామి కావడం ద్వారా అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ఇతర డెవలపర్లతో కలిసి పనిచేయడం..సెక్యూరిటీ బగ్స్ సరిచేయడం.. కోడ్ రివ్యూలలో పాల్గొనడం ద్వారా రియల్-టైమ్ ప్రాజెక్ట్ అనుభవం లభిస్తుంది.
ఇంటర్న్‌షిప్‌లు- ఫ్రీలాన్సింగ్ :
నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగాలు దొరకనప్పుడు AI ఆధారిత ఇంటర్న్‌షిప్‌లు లేదా అప్రెంటిస్‌షిప్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే అప్‌వర్క్, ఫివెర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో AI టూల్స్ సాయంతో చిన్న చిన్న క్లయింట్ ప్రాజెక్టులు చేయడం వల్ల బిజినెస్ లాజిక్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అలవాటవుతాయి.
మారిన ఫ్రెషర్ డెఫినిషన్ :
ఇప్పుడు కంపెనీలు `జీరో స్కిల్` ఉన్న ఫ్రెషర్లను కోరుకోవడం లేదు. AI టూల్స్‌ను వాడుతూ ఒక సీనియర్ డెవలపర్ ఇచ్చే అవుట్‌పుట్‌ను ఇవ్వగల ఫ్రెషర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ .. సిస్టమ్ ఆర్కిటెక్చర్ పట్ల అవగాహన పెంచుకుంటే ఫ్రెషర్‌గా కూడా సీనియర్ స్థాయి గుర్తింపు సాధించవచ్చు.
కోర్ ఫండమెంటల్స్ మర్చిపోకూడదు:
AI షార్ట్‌కట్ రూపంలో కోడ్ లేదా కంటెంట్‌ను అందించినా అది కరెక్టో కాదో చెక్ చేసే నైపుణ్యం ఉండాలి. సబ్జెక్ట్ ప్రాథమిక సూత్రాలు బాగా తెలిసినప్పుడే AI ఇచ్చిన అవుట్‌పుట్‌లోని తప్పులను సవరించగలరు.