చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ
| హైదరాబాద్‌లోని విప్రో కార్యాలయం వద్ద నెలకు సుమారు రూ.14 వేల జీతం వచ్చే నాన్-ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది యువత బారులు తీరిన వీడియో వైరల్ అవుతోంది. లక్షలు ఖర్చు చేసి డిగ్రీలు పొందినప్పటికీ తగిన ఉద్యోగాలు దొరకడం లేదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న జాబ్ మార్కెట్‌లో డిగ్రీలతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరంపై చర్చ సాగుతోంది.
ఒకప్పుడు ఇంట్లో పిల్లాడు కాస్త చురుగ్గా ఉంటే డాక్టర్ అనో.. ఇంజినీర్ అనో కలలు కనేవారు. బీటెక్ సీటు దొరికితే చాలు.. స్వర్గానికి నిచ్చెన వేసినట్టేనని కాలేజీలు.. కుటుంబాలు సంబరపడ్డాయి. లక్షలు కట్టు.. లక్షల్లో జీతం పట్టు అన్న సనాతన విద్యా మంత్రం ఇప్పుడు రివర్స్ గేర్‌లో తిరుగుతోంది. చేతిలో డిగ్రీలు.. బీటెక్ సర్టిఫికెట్లు ఉన్నా.. ఉద్యోగం మాత్రం కనిపించని పరిస్థితిలో హైదరాబాద్‌లోని విప్రో కార్యాలయం ముందు కనిపించిన నిరుద్యోగుల భారీ క్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు జాబ్ మార్కెట్ దుస్థితిపై నిట్టూరుస్తున్నారు. ఇది ఏదో ఆకాశంలో విహరించే ఐటీ జాబ్ కోసం కాదు.. నెలకు సుమారు రూ.14 వేలు వచ్చే నాన్-ఐటీ ఉద్యోగం కోసమట.. లక్షలు ఖర్చు చేసి డిగ్రీలు గడించిన యువత.. రూ.14 వేల కోసం రోడ్డు మీద వాహనాల మధ్య నిలబడాల్సి రావడం దారుణమనే చెప్పాలి.. హైదరాబాద్ లాంటి మహానగరంలో రూమ్ రెంట్.. బస్సు/మెట్రో ఖర్చులు.. తిండి ఖర్చులు తీసేస్తే.. చేతిలో మిగిలేది జీతమా లేక జీతభత్యం కోసం ఆందోళనా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
కార్పొరేట్ సంస్థలు రోజూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ భారీ కబుర్లు చెబుతాయి. కానీ వాక్-ఇన్ ఇంటర్వ్యూల విషయానికి వచ్చేసరికి మాత్రం వందలాది మందిని రోడ్లపై నిలబెట్టే పాతకాలపు పద్ధతినే నమ్ముకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్ చేసి.. టైమ్ స్లాట్లు ఇస్తే టెక్నాలజీకి గౌరవం దక్కుతుంది కదా అని నెటిజన్లు చురకలు వేస్తున్నారు.
ఈ వీడియోతో ఉద్యోగాలు మారాలనుకునే వారికి కూడా కొత్త భయం పట్టుకుంది. గతంలో బెటర్ ప్యాకేజీ కోసం రిజైన్ చేసేవారు. ఇప్పుడు ఉన్న జాబ్ వదిలేస్తే.. రేపు మరో క్యూలో నిలబడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందరికీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే కావాలి.. కానీ అవకాశాలు పరిమితం... ఆసక్తుల కంటే ప్యాకేజీలకే ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమిది... బాగా చదువుకో.. సెటిల్ అవుతావు అనే మాట స్థానంలో నైపుణ్యం పెంచుకో.. మార్కెట్‌కు తగ్గట్టు మారు అనే మాట రావాల్సిన సమయం ఇది.
డిగ్రీలు తయారు చేయడం కాలేజీల పని.. కానీ ఆ డిగ్రీలకు తగ్గ పని కల్పించడం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేదాకా ఇలాంటి క్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి..