24 గంటల్లో రాజీనామా లేదంటే ఉద్వాసన.. టెక్ దిగ్గజం గూగుల్‌లో అసలేం జరుగుతోంది?
| భారత్‌లో గూగుల్ ఉద్యోగుల్లో భారీ కోతలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సంస్థ ఖండించింది. గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో సాధారణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం 30 మందిని మాత్రమే తొలగించినట్లు వెల్లడించింది. సగం మంది ఉద్యోగులపై వేటు, 24 గంటల్లో రాజీనామా చేయాలన్న అల్టిమేటం వార్తలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఏఐ ప్రభావంతో టెక్ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావం మరోసారి చర్చనీయాంశమైంది.
ఒకప్పుడు గూగుల్ అంటే కేవలం ఒక కంపెనీ కాదు.. లక్షలాది మంది టెకీల జీవితకాల స్వప్నం. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలోనో.. లేక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాతనో గూగుల్ ఐడీ కార్డు మెడలో పడిందంటే.. ఇక ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడిపోయినట్లేనని అంతా భావించేవారు. ఆకర్షణీయమైన వేతనాలు.. ప్రపంచ స్థాయి గుర్తింపు.. అన్నింటికంటే మిన్నగా తిరుగులేని ఉద్యోగ భద్రత.. ఇవే గూగుల్‌ను సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల స్వర్గధామంగా నిలబెట్టాయి. కానీ కాలం మారింది.. సమీకరణాలు తలకిందులయ్యాయి. నిన్నటి వరకు ఎంతో ధీమాగా ఉన్న గూగుల్ ఉద్యోగుల గుండెల్లో ఇప్పుడు ఒకటే గుబులు.. రేపు నా ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనే ఆందోళన..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో.. ముఖ్యంగా టెక్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ప్రతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. భారత్‌లోని గూగుల్ విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల కోత మొదలైందన్న ప్రచారం దావానలంలా వ్యాపించింది. ఉద్యోగుల చర్చా వేదిక బ్లైండ్ లో బెంగళూరుకు చెందిన ఒక గూగుల్ లెవల్-4 ఇంజినీర్ పెట్టిన పోస్ట్ ఈ భయానికి ఆజ్యం పోసింది. భారత్‌లోని పలు కీలక టీమ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నారని.. ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆ పోస్ట్ సారాంశం.
దీనికి తోడు మరికొందరు ఉద్యోగులకు యాజమాన్యం నుంచి అల్టిమేటం జారీ అయిందన్న వార్తలు మరింత కలకలం రేపాయి. "24 గంటల్లో మీ అంతట మీరే రాజీనామా చేయండి.. లేదంటే మేమే ఉద్యోగం నుంచి తొలగిస్తాం" అంటూ హెచ్చరికలు వచ్చాయని ప్రచారం జరగడంతో టెకీల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నెలవారీ ఈఎంఐలు.. పిల్లల చదువులు.. కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న మధ్యతరగతి టెక్ ఉద్యోగులకు ఈ వార్త కంటిమీద కునుకు లేకుండా చేసింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విపరీత ప్రచారంపై ఎట్టకేలకు గూగుల్ మౌనం వీడింది. గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో భారీ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. సంస్థలో భాగంగా జరిగే సాధారణ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ లో భాగంగా గత వారం కేవలం 30 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు గూగుల్ అధికారికంగా వెల్లడించింది. భారత్‌లోని సగం మంది ఉద్యోగులపై వేటు పడిందన్న ప్రచారం కేవలం వదంతి మాత్రమేనని సంస్థ వివరణతో తేలిపోయింది. అంతేకాకుండా 24 గంటల్లో రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారన్న వైరల్ వార్తలకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. గూగుల్ ఇచ్చిన ఈ వివరణతో ఉద్యోగులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు.
గూగుల్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినప్పటికీ ఇది టెక్ ప్రపంచంలో ఒక చేదు నిజాన్ని మాత్రం కళ్లకు కట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. తక్కువ మంది సిబ్బందితో.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని రాబట్టుకోవాలనే వ్యాపార వ్యూహాలు ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి.
ఒకప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో అడుగుపెడితే జీవితానికి తిరుగులేదనుకునే రోజులు పోయాయి. మారుతున్న సాంకేతికత ముందు ఎంతటి ప్రతిభ అయినా.. ఎంతటి పెద్ద సంస్థ అయినా శాశ్వత భరోసా ఇవ్వలేదని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. లేఆఫ్స్ వార్తలు అతిశయోక్తి అయినా.. ఉద్యోగుల గుండెల్లో రేగిన ఆ అభద్రతాభావం మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు..