ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..
| ఏఐ వల్ల కోడింగ్, డేటా విశ్లేషణ వంటి పనులు తగ్గితే మనుషులు ప్రకృతి, సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, పురాణాలపై దృష్టి పెట్టాలని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు సూచించారు. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆదాయ భద్రత, ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా లభిస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటి అద్దెలు, ఈఎంఐలు కట్టాలంటే ఆదాయం కూడా అవసరమేనంటూ టెక్కీలు సెటైర్లు వేస్తున్నారు.
మొన్నటిదాకా ఏఐ వస్తే మన ఉద్యోగాలు పోతాయేమో అని గుండెలు బాదుకున్న టెక్కీలందరికీ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పారు. కంగారు పడకండి బాసూ.. మీ పనులన్నీ ఏఐ చేసేస్తుంది. మీరు హాయిగా చెట్ల కింద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ పురాణాలు చదువుకోండి అని ఆయన సెలవిచ్చారు. వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా.. కానీ ఇది నిజంగానే జరుగబోతోందట..
గతంలో పది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నెల రోజుల పాటు కళ్ళు ఎర్రబడేలా కూర్చుని రాసే కోడ్‌ను.. ఇప్పుడు ఒక్కడే ఏఐ సాయంతో చిటికెలో పూర్తి చేసేస్తున్నాడు. అంటే కంపెనీలకు మిగతా తొమ్మిది మందితో పనిలేదన్నమాట.. లేఆఫ్స్ పేరుతో కంపెనీలు గేట్లు మూసేస్తుంటే .. అయ్యో ఉద్యోగం పోయిందే అని ఏడవకుండా.. ‘హమ్మయ్య.. నాకు ప్రకృతి ఒడిలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది’ అని సంబరపడాలని వెంబు గారి ఉద్దేశం కాబోలు.
యంత్రాలు లెక్కలు.. డేటా విశ్లేషణ.. కోడింగ్ లాంటి కష్టమైన పనులన్నీ లాగేసుకున్నాక.. ఇక మనుషులు ఖాళీగా ఉండి ఏం చేస్తారు? అందుకే మనం మన మూలాల్లోకి వెళ్ళాలట.. ప్రకృతి అధ్యయనం.. సంస్కృతి పరిరక్షణ.. చరిత్ర.. సాహిత్యం.. పురాణ గ్రంథాల పరిశోధన వంటి అత్యంత లాభదాయకమైన రంగాలపై దృష్టి పెట్టాలట.. నిజమే కదా.. ఇన్నాళ్లూ ఈఎంఐలు కట్టడం.. టార్గెట్లు రీచ్ అవ్వడం.. అప్రైజల్స్ కోసం బాస్ చుట్టూ తిరగడం లాంటి చిల్లర విషయాల్లో పడి మనం జీవితాన్ని మర్చిపోయాం. ఇకపై నెల తిరిగేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకునే బదులు.. చెట్టుకి ఎన్ని కొత్త చిగుళ్లు వచ్చాయి? మన సంస్కృతి ఎంత పరిఢవిల్లింది..? అని లెక్కలేసుకుంటే చాలు. ఆకలేస్తే ఏఐ రాసిన కవిత్వం చదువుకుని.. దాహమేస్తే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తే కడుపు నిండిపోతుంది మరి..
ఏఐ ఎంత ఎదిగినా మానవ భావోద్వేగాలను భర్తీ చేయలేదు అనేది నిజమే. కానీ ఆ భావోద్వేగాలను బతికించుకోవడానికి కనీసం మూడు పూటలా తిండి కావాలి కదా? ఆదాయ భద్రత.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకుండా నేరుగా అడవుల్లోకి గ్రంథాలయాల్లోకి వెళ్లిపోతే వచ్చే ఆధ్యాత్మిక ఆనందం తో ఇంటి అద్దె కట్టలేం కదా.. ఇదే మన శ్రీధర్ వెంబు గారు మిస్ అయిన పాయింట్స్.. పోనీ మనకు ఏమైనా తరతరాల తాతల ఆస్తి ఉందంటే అది లేదాయే.. మరి ప్రకృతిని పని లేకుండా ఎలా ఆస్వాదిస్తాం శ్రీధర్ గారు అని టెకీలు కాస్త గట్టిగానే అడిగేస్తున్నారు.
ఏఐ రాకతో మనిషి విజయానికి కొలమానం మారబోతోంది. రేపటి రోజున పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా అబ్బాయి ప్యాకేజీ ఎంత? అని కాకుండా ‘అబ్బాయి రోజుకు ఎన్ని గంటలు ప్రకృతితో గడుపుతాడు? ఎన్ని పురాణాలు పరిశోధించాడు?’ అని అడిగే రోజులు రావాలని ఆశిద్దాం.
ఏఐ మన పనులను తగ్గించి మనల్ని ఖాళీ చేస్తోందో.. లేక నిజంగానే కొత్త దారులు చూపిస్తోందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఏఐ పుణ్యమా అని మనుషులకు నిరుద్యోగ యోగం మాత్రం పుష్కలంగా పట్టేలా ఉంది..