అమెరికా నుంచి ఐబీఎం సాగనంపుతోంది.. భారతీయ టెకీలకు దారేది?
| అమెరికాలోని ఐబీఎం కన్సల్టింగ్ విభాగం విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌కు బదిలీ కావాలా, ఉద్యోగం వదులుకోవాలా తేల్చుకునేందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. భారత్‌కు తిరిగొస్తే వేతనాల్లో 80 శాతం వరకు కోత పడే అవకాశముంది.
కన్నవాళ్లను వదిలి.. కట్టుకున్న బంధాలను దూరం చేసుకుని.. కేవలం తమ కుటుంబానికి ఒక బంగారు భవిష్యత్తును అందించాలనే ఆశతో ఎల్లలు దాటి అమెరికా వెళ్లిన వేలాది మంది భారతీయ టెకీల జీవితాల్లో ఇప్పుడు పెను తుపాను చెలరేగింది. అగ్రరాజ్యంలో సొంత ఇల్లు.. స్థిరమైన ఉద్యోగం.. గ్రీన్‌కార్డు అంటూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. టెక్ దిగ్గజం ఐబీఎం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ప్రవాస భారతీయుల గుండెల్లో పిడుగులా పడింది.
అమెరికాలోని ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా.. గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఏళ్ల తరబడి సంస్థ కోసం రక్తం ధారపోసిన ఉద్యోగులకు ఇప్పుడు రెండే రెండు కఠినమైన దారులు మిగిలాయి. ఒకటి అమెరికాను వదిలి.. ఐబీఎం కార్యాలయాలు ఉన్న భారత్ లేదా ఇతర దేశాలకు బదిలీ అవ్వడం... రెండోది అమెరికాలోనే ఉండాలనుకుంటే.. సంస్థకు గుడ్‌బై చెప్పి బయటకు వెళ్లిపోవడం... ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవడానికి ఉద్యోగులకు కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. అంగీకరించని వారికి మూడు నెలల జీతాన్ని పరిహారంగా ఇచ్చి.. డిసెంబరు 31, 2026 నాటికి సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. తమ పిల్లల చదువులు, ఈఎంఐలు, అక్కడి జీవనశైలికి అలవాటు పడ్డ కుటుంబాలు ఇంత తక్కువ సమయంలో తమ జీవితాలను ఎలా తలకిందులు చేసుకోవాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నాయి.
ఈ సంక్షోభంలో భారతీయ ఉద్యోగులను మరింత కుంగదీస్తున్న అంశం ఆర్థిక భారం. ఐబీఎం అంతర్జాతీయ ఖాళీలలో 1,278లో అత్యధికంగా 1,125 ఉద్యోగాలు భారత్‌లోనే ఉన్నాయి. అంటే అమెరికా వదిలి వచ్చే వారికి భారత్ ప్రధాన గమ్యస్థానంగా మారనుంది.
కానీ ఇక్కడే అసలైన విషాదం దాగి ఉంది. అమెరికా ప్రమాణాలకు తగ్గట్టుగా డాలర్లలో భారీ వేతనాలు అందుకుంటున్న టెకీలు.. అదే ఐబీఎం ఉద్యోగం కోసం భారత్‌కు తిరిగి వస్తే తమ జీతంలో ఏకంగా 80 శాతం వరకు కోత ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో సంపాదించిన ఆర్థిక స్థాయిని.. భవిష్యత్తు ప్రణాళికలను ఒక్కసారిగా వదులుకుని.. మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని ప్రారంభించాలంటే ఆ కుటుంబాల మానసిక వేదన వర్ణనాతీతం.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు.. వీసా నిబంధనల మార్పులు కార్పొరేట్ సంస్థల ఆలోచనలను మార్చేస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ మేధస్సు కోసం ఎర్రతివాచీ పరిచిన అమెరికా కంపెనీలు.. నేడు స్పాన్సర్‌షిప్‌ల విషయంలో చేతులెత్తేస్తున్నాయి.
ఐబీఎం నిర్ణయం అమెరికా గడ్డపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది భారతీయ యువతకు ఒక కఠిన హెచ్చరిక. అమెరికాలో అడుగుపెట్టడం ఒక ఎత్తయితే.. ఆ గడ్డపై నిలదొక్కుకోవడం ఇప్పుడు ప్రాణసంకటంగా మారింది. ఈ కష్టకాలంలో ఆ కుటుంబాలకు ఏ దారి దొరుకుతుందో వేచి చూడాలి..