ఐటీ రంగంలో పెను సంచలనం.. కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత!
ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ మరోసారి తన సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది.;
ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ మరోసారి తన సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, కంపెనీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ భారీ లేఆఫ్స్ ప్రభావం ప్రధానంగా భారత్‌పైనే ఉండటం ఇప్పుడు ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారత్‌లో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు
కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.57 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో దాదాపు 2.50 లక్షల మంది (సుమారు 70%) భారతీయులే. తాజా సమాచారం ప్రకారం తొలగించబోయే మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది భారతీయ ఐటీ నిపుణులే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులు తక్కువగా ఉన్న విభాగాలు, సపోర్ట్ సర్వీసులు మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ విభాగాల్లో కోతలు ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
కారణాలు ఏంటి?
కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవడానికి కార్యకలాపాలను మరింత మెరుగుపరచుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం సుమారు 200 మిలియన్ల నుండి 270 మిలియన్ డాలర్ల నిధిని కూడా కేటాయించింది. ప్రధానంగా మూడు అంశాలు ఈ లేఆఫ్స్‌కు కారణమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ వంటి పనులకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఆటోమేషన్ వల్ల గతంలో 10 మంది చేసే పనిని ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ చేయగలుగుతోంది. కంపెనీ తన లాభాలను పెంచుకోవడానికి అధిక వేతనాలు తీసుకునే మధ్యస్థాయి ఉద్యోగులను తగ్గించి, వ్యయ నియంత్రణకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అదే బాటలో ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా పయనిస్తోంది.
నిపుణుల హెచ్చరిక
ఐటీ నిపుణులు ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. సంప్రదాయ ఐటీ సేవల కాలం చెల్లిపోతోందని, ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో మనుగడ సాగించాలంటే కేవలం పాత టెక్నాలజీలపై ఆధారపడటం సరిపోదు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన నైపుణ్యాలను అలవర్చుకోవడమే ఉద్యోగ భద్రతకు ఏకైక మార్గం.
భవిష్యత్తుపై అనిశ్చితి
భారత్‌లో లక్షలాది కుటుంబాలు ఐటీ ఉద్యోగాల ఆదాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత విధించడం వల్ల అటు కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై, ఇటు రియల్ ఎస్టేట్, ఇతర సేవా రంగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కంపెనీ అధికారికంగా ఈ సంఖ్యలపై తుది స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ అంతర్జాతీయ నివేదికలు మాత్రం ఐటీ నిపుణులను కలవరపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇతర ఐటీ సంస్థలు కూడా ఇదే బాట పడతాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.