పుణే కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. వైరల్ అవుతున్న ప్రీ-వెడ్డింగ్ వీడియో

ఇదిలా ఉండగా కేతన్-సియా పెళ్లికి ముందు ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Update: 2026-06-26 13:11 GMT

ప్రేమ పేరుతో నమ్మించి.. పెళ్లి పీటల వరకు వెళ్లిన బంధాన్ని చివరకు దారుణ హత్యతో ముగించిన పుణే ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండగా తాజాగా సియా గోయల్ తల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు నిందితులపై ఆగ్రహం, మరోవైపు బాధితుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నాయి.

నా కూతురిని అదే కొండపై నుంచి తోసేయండి.. సియా తల్లి ఆవేదన

ఈ దారుణ ఘటనపై సియా తల్లి పూజా గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నకూతురు అని కూడా చూడకుండా చట్టం ముందు తప్పు చేసిన వారికి సరైన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. పూజా గోయల్ మాట్లాడుతూ.. "నా కూతురు పెళ్లి గురించి మా వద్ద ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆమెకు చేతన్ చౌదరి అనే ప్రియుడు ఉన్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ నా కూతురు నిజంగానే ఈ దారుణానికి ఒడిగట్టి, తప్పు చేసి ఉంటే ఆమెకు ఉరిశిక్ష వేయండి. లేదంటే కేతన్‌ను ఏ కొండపై నుంచి అయితే తోసేసి చంపేశారో.. అదే కొండపై నుంచి ఆమెను కూడా కిందకు తోసేయండి" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘ప్రీ-వెడ్డింగ్ షూట్’

ఇదిలా ఉండగా కేతన్-సియా పెళ్లికి ముందు ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఆ వీడియోల్లో ఇద్దరూ ఎంతో ఆనందంగా, ఒకరినొకరు అమితంగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా సియా కేతన్‌ను నిజంగానే ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు ఆ వీడియోలో నటించిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె నటనను నిజమైన ప్రేమగా నమ్మిన కేతన్.. ఆమెను పూర్తిగా విశ్వసించాడు. కానీ ఆ నవ్వుల వెనుక ఇంతటి క్రూరమైన మృగం దాగుందని పాపం ఆ యువకుడు ఊహించలేకపోయాడు.

పక్కా స్కెచ్‌తోనే హత్య.. వెలుగులోకి వస్తున్న దారుణాలు

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడుతున్న వివరాల ప్రకారం.. సియా అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో వారి బలవంతం వల్లో లేదా మరేదైనా కారణంతోనో కేతన్‌తో పెళ్లికి ఒప్పుకుంది. కానీ కేతన్‌తో జీవితాన్ని పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని పథకం పన్నింది. ఇందులో భాగంగానే ఇద్దరూ కలిసి కేతన్‌ను పుణే సమీపంలోని ఒక నిర్జన ప్రాంతంలో ఉన్న లోయ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కేతన్ ఏమార్చి ఇద్దరూ కలిసి ఒక్కసారిగా అతడిని లోయలోకి తోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఒకవైపు ఎంతో ప్రేమతో నిండిన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోలు, మరోవైపు అదే వ్యక్తిని నమ్మించి గొంతుకోసినట్లు పథకం ప్రకారం హత్య చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు సేకరిస్తున్న డిజిటల్ ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలు ఈ కేసులో మరిన్ని కీలక నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చట్టం ఈ కిరాతకులకు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.



Tags:    

Similar News