బొత్స వారి కన్నీటి వెనుక.. అసలు రీజనేంటి?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడ మీటింగ్ పెడితే.. అక్కడ కన్నీరు పెట్టుకుంటున్నారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడ మీటింగ్ పెడితే.. అక్కడ కన్నీరు పెట్టుకుంటు న్నారు. తన సొంత మేనల్లుడు, వైసీపీ నేత.. మజ్జి శ్రీనివాసరావు.. టీడీపీలోకి వెళ్లిపోయిన దరిమిలా.. బొత్స కన్నీరు పెట్టడం.. ఇతర నాయకులు ఆయనను ఓదార్చడం వంటివి ప్రముఖంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. ఇలా ఇంతగా బొత్స కన్నీరు పెట్టడానికి అసలు రీజనేంటి? నిజంగానే మజ్జి శ్రీనివాసరావు పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆవేదనా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనేది చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ హయాం నుంచి కూడా బొత్స సత్యనారాయణకు అత్యంత నమ్మకస్థుడిగా, జిల్లాలో ఆయన రాజకీయ వ్యవహారాలన్నింటినీ గ్రౌండ్ లెవెల్‌లో నడిపించే ప్రధాన అనుచరుడిగా చిన్ని శ్రీనుకు పేరుంది. అయితే.. తాజాగా తనకు చెప్పాపెట్టకుండా.. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన టీడీపీలోకి జంప్ చేయడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా కుటుంబ సభ్యుడు కావడం కూడా ఒక రీజన్. అందుకే కన్నీరు పెడుతున్నారన్నది ఒక వాదన. కానీ.. దీనికి మించి.. మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఉమ్మడి ఏపీలో ఉండగా.. బొత్స సత్యనారాయణ విజయనగరంలో లిక్కర్ వ్యవస్థను శాసించారు. దీనిని మజ్జి శ్రీనివాసరావే క్షేత్రస్థాయిలో నడిపించారు. అలాగే.. భూములు, ఇతర లావాదేవీలు ఆర్థిక పరమైన అన్ని అంశాలు కూడా చిన్నశ్రీను కు కరతలామలకం. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారాల్లోని లోటుపాట్లు.. గుట్టుమట్లు ఏమైనా బయట కు వస్తాయేమోనన్న ఆవేదన ఆందోళన బొత్సలో ఉందని.. ప్రత్యర్థి శిబిరం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇక, రాజకీయంగా తన తర్వాత అంత బలమైన చిన్న శ్రీను వెళ్లిపోవడంతో సహజంగానే బొత్స ఒంటరి అయ్యారు. ఇది కూడా కన్నీటికి కారణమై ఉంటుందని అంటున్నారు.
సామాజిక వర్గంలో చీలిక..
తూర్పు కాపు సామాజిక వర్గానికి బొత్స.. చీపురుపల్లి నియోజకవర్గం సహా ఉత్తరాంధ్రలో పట్టు పెంచుకునేందుకు ఈ సామాజిక వర్గమే ఇప్పటి వరకు అండగా ఉంది. అయితే.. మజ్జి శ్రీను జంప్‌తో సామాజిక వర్గం రెండుగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు. దీంతో జిల్లాలో బొత్స రాజకీయంగా, సామాజికంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రానుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి తన వారసురాలు అనూషకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్న నేపథ్యంలో మజ్జి శ్రీను జంప్ కావడం.. తూర్పు కాపుల్లో ఆయనకు బలమైన ఫాలోయింగ్ ఉండడం వంటివి కూడా బొత్సకు మింగుడు పడడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన కన్నీరు పెడుతున్నారని అనే వారు కనిపిస్తున్నారు.