మతిపోగొట్టే పరుగు.. ప్రాణం తీసే పొరపాటు కాకూడదు.. ఏఐ రేసులో బ్రేకులు వేయక తప్పదా?
అంతులేని ఆశలు.. హద్దులు లేని ఆకాంక్షలు.. నూతన లోకాన్ని సృష్టించాలనే తపన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ప్రస్తుతం ఊపేస్తున్న తుఫాను ఇది.
అంతులేని ఆశలు.. హద్దులు లేని ఆకాంక్షలు.. నూతన లోకాన్ని సృష్టించాలనే తపన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ప్రస్తుతం ఊపేస్తున్న తుఫాను ఇది. "ఎవరు ముందోచ్చేస్తారు? ఎవరు ప్రపంచాన్ని శాసిస్తారు?" అనే వేటలో టెక్ దిగ్గజాలు కాలంతో పోటీపడుతున్నాయి. కానీ కాలిక్యులేషన్లు ఎంత వేగంగా మారుతున్నాయో.. దాని వెనుక ఉన్న భయం కూడా అంతే వేగంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బ్రేకులు లేని పరుగు చివరికి గమ్యానికి తీసుకెళ్తుందా లేక అగాధంలోకి తోసేస్తుందా?
గొంతు విప్పిన దిగ్గజాలు.. సత్యం వెనుక ఉన్న ఆందోళన
"కాస్త ఆగండి.. వేగం తగ్గించండి" ఇది ఏ విమర్శకుడో లేక సాంకేతికతను వ్యతిరేకించే వ్యక్తో అన్న మాట కాదు. ఏఐ పరిశ్రమకే ఊపిరి పోస్తున్న ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయి నోటి నుంచి వచ్చిన హెచ్చరిక. మానవాళి భష్యత్తును నిర్ణయించే సాంకేతికతను కేవలం పోటీ కోసం కాకుండా పక్కా భద్రతతో నడిపించాలని ఆయన గొంతు ఎత్తారు. సంచలనం ఏంటంటే.. ఈ రేసులో ఒకరినొకరు దాటుకుని వెళ్లాలని చూసే ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ , టెస్లా గ్రోక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా ఈ మాటతో ఏకీభవించడం.. పోటీని పక్కనపెట్టి.. ఒకే వేదికపైకి వచ్చి ఈ ముగ్గురు దిగ్గజాలు "అవును మనం జాగ్రత్త పడాలి" అని ఒప్పుకోవడం వెనుక ఎంతటి గంభీరమైన ముప్పు దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.
వేగం వెనుక వ్యాపారం.. భద్రత వెనుక భవిష్యత్తు
ఈ అంతులేని పరుగు వెనుక ఉన్నది కేవలం నూతన ఆవిష్కరణల తపన మాత్రమే కాదు.. కోటానుకోట్ల వ్యాపారం.. మార్కెట్‌పై ఆధిపత్యం. మొదట మార్కెట్లోకి వచ్చేవారికే వినియోగదారులు, పెట్టుబడుల కిరీటం దక్కుతుందనే భయం కంపెనీలను నిద్రపోనివ్వడం లేదు. అయితే సాధారణ సాఫ్ట్‌వేర్‌లో చిన్న బగ్ వస్తే తదుపరి అప్‌డేట్‌తో సరిదిద్దవచ్చు.. కానీ ఒక శక్తిమంతమైన ఏఐ వ్యవస్థ చేసే చిన్న పొరపాటు కూడా మానవ సమాజ పునాదులనే కదిలించగలదు. డిజిటల్ దాడులు, సైబర్ నేరాలు, ఊహాకల్పిత తప్పుడు సమాచారంతో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం వంటి అంశాలు భవిష్యత్తు సమస్యలు కావు.. అవి ఇప్పటికే మన ముంగిట ఉన్న దారుణమైన నిజాలు.
ఒక ఏఐ మోడల్ తప్పుడు సమాచారాన్ని అందించి ఒకరి జీవితాన్ని నాశనం చేస్తే దానికి బాధ్యులు ఎవరు? డెవలపరా? కంపెనీయా? లేక ఆ సాంకేతికతా? దీనికి ఇప్పటికీ మన దగ్గర స్పష్టమైన సమాధానం లేదు.
బాధ్యతాయుతమైన పరుగు అవసరం..
టెక్ ప్రపంచానికి ఇది ఒక నలిపివేసే ధర్మసందేహం. భద్రత కోసం ఒక కంపెనీ వేగం తగ్గిస్తే ప్రత్యర్థి దేశాలు లేదా కంపెనీలు ముందుకు వెళ్ళిపోతాయి. ఆర్థిక వ్యవస్థలు, దేశ రక్షణ, వైద్య రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్తున్న వేళ వెనుకబడిపోతామనే భయం ఈ రేసును ఇంకా వేగవంతం చేస్తోంది. కానీ సాంకేతికతను పూర్తిగా ఆపడం ఎవరి వల్లా కాదు.. అలాగని మనుషుల ప్రాణాలను, సమాజ భద్రతను పణంగా పెట్టి పొందే విజయం తథ్యం కాకూడదు.
మనకు కావాల్సింది బ్రేకులు లేని వేగం కాదని.. ఒక పరిపక్వత కలిగిన బాధ్యత అని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. 'ఎవరు వేగంగా వెళ్తారు' అనే పాత ఆలోచన నుంచి 'ఎవరు సురక్షితంగా వెళ్తారు' అనే కొత్త మార్గం వైపు పరిశ్రమ అడుగులు వేయాలి. మాటలు కోటలు దాటడం సులభమే.. కానీ ఆచరణలోనే అసలు నిజాయితీ తెలుస్తుంది.
మస్క్, సామ్, డారియోల అంగీకారం కేవలం ఒక ప్రకటనగా మిగిలిపోకూడదు. రేసులో ముందుండడం ముఖ్యం కాదు.. ఆ రేసు ముగిసేసరికి మానవాళి సురక్షితంగా ఉందా లేదా అన్నదే అల్టిమేట్ ట్రూత్..