చిత్రం గురూ: నీకోసం కోట్లు ఖర్చు పెట్టా.. తిరిగిచ్చెయ్.. లవర్‌పై కోర్టులో కేసు!
ఇదో చిత్రమైన ఘటన.. బహుశ ఎక్కడా ఇలాంటి ఘటన వెలుగు చూసి ఉండకపోవచ్చు.
ఇదో చిత్రమైన ఘటన.. బహుశ ఎక్కడా ఇలాంటి ఘటన వెలుగు చూసి ఉండకపోవచ్చు. రీజనేంటంటే..ప్రేమలో తలమునకలు గా మునిగిన క్షణంలో ప్రేయసి కోసం.. ఎంత పేద ప్రేమికుడైనా అంతో ఇంతో ఖర్చు పెడతాడు. ఒకవేళ ఆ ప్రేమ వికటించి.. ప్రియురాలు కాదు పొమ్మన్నా... మనసులోనే ఆవేదన వ్యక్తం చేసేవారు.. చాలా మంది. కసితో రగిలేవారు మరికొందరు ఉన్నారు. కానీ, ''నీ ప్రేమ పోతే పోనీ.. నీ కోసం.. చేసిన ఖర్చును మాత్రం తిరిగి ఇచ్చేయ్'' అని అడిగే ప్రేమికుడు ఉంటాడా? ఇప్పటి వరకు అయితే.. ఇలాంటి కేసులు వెలుగు చూడలేదు.
ఇప్పుడు తాజాగా ఇలాంటి చిత్రమైన కేసు వెలుగు చూసింది. ప్రేయసి కోసం.. 3కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చుచేశానని.. ఇప్పుడు ఆమె తన ప్రేమను కాదందని.. కాబట్టి.. ఆమె కోసం ఖర్చు చేసిన అన్ని సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని ఓ ప్రియు డు.. భీష్మించాడు. కేవలం భీష్మించడమే కాదు.. ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించాడు. చిత్రమైన ఈఘటన మన దేశంలో కాకపోయినా.. సింగపూర్‌లో జరిగింది. అయితే.. సదరు ప్రేమికుడు మన భారత దేశానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం.
ఏం జరిగింది?
భారత్‌లోని యూపీకి చెందిన చందన్ అగర్వాల్.. సింగపూర్‌లో లాజిస్టిక్ కంపెనీలో సీఈవో ఉద్యోగం నిమిత్తం వెళ్లి.. అక్కడే సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఫెలిసియా లీ(జర్మనీ)తో పరిచయం అయింది. ఇలా.. మొదలైన వారి స్నేహం.. 2019 నుంచి 2023 వరకు సాగింది. ఈ క్రమంలో ప్రియురాలు కోరిందని.. అనేక రూపాల్లో ఆయన ఖర్చు చేశారు. అయితే.. అనంతరం.. లీ వేరేవారి వలలో పడిందన్నది అగర్వాల్ ఆరోపణ. అంతేకాదు.. తనతో ఆమె కటీఫ్ చెప్పిందని అగర్వాల్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య రాజీ కాకపోవడంతోపాటు దూరం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలోనే అగర్వాల్.. తనను కాదన్న ప్రేయసి నుంచి ఖర్చుల మొత్తం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని ఆమె తిరస్కరించింది. దీంతో.. ఆయన సింగపూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రేయసిపై ఖర్చు చేసిన మొత్తాన్నీ తిరిగి ఇవ్వా లని ఆయన కోరుతున్నారు. అయితే.. ఈ కేసును న్యాయ వ్యవస్థ పట్టించుకోదని భావిస్తున్న అగర్వాల్.. పదరు ప్రేయసికి తాను రూ.3.5 కోట్లను అప్పుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కేసును తాజాగా కోర్టు విచారణకు స్వీకరించింది. మరి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.