తెలంగాణా టూ ఏపీ : బాబుకు రెండిందాల సపోర్ట్ !

ఏపీ చూస్తే భారీ ఎత్తున నష్టపోయింది. ఆర్నాద్ తుఫాన్ వల్ల ఏపీలో మౌలిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. దాంతో తెలంగాణా ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకు వచ్చింది.

Update: 2026-10-31 04:02 GMT

చంద్రబాబుని ఊరకే రాజకీయ చాణక్యుడు అని ఎవరూ అనలేదు. ఆయనకు ఆ సామర్థ్యం సత్తా ఉన్నాయి కాబట్టే ఆలా అభివర్ణిస్తారు. బాబు వాస్తవ వాదిగా చెబుతారు. ఆయన రాజకీయాలను అలాగే చూస్తారు, అలాగే చేస్తారు. అందుకే ఆయనకు రాజకీయంగా ప్రత్యర్థులే ఉంటారు, వారు కూడా కీలక సమయాల్లో స్నేహ హస్తం అందిస్తారు. బాబు విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపించడానికి ఆయన ఎంచుకున్న విధానమే కారణం అంటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని బాబు గట్టిగా నమ్ముతారు. అదే ఆయనకు జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయంగా అందరి నేతలకూ దగ్గర చేసింది అన్నది ఒక కరెక్ట్ విశ్లేషణగానే చూడాల్సి ఉంది.

పెను విపత్తులో సాయం :

ఏపీ చూస్తే భారీ ఎత్తున నష్టపోయింది. ఆర్నాద్ తుఫాన్ వల్ల ఏపీలో మౌలిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. దాంతో తెలంగాణా ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకు వచ్చింది. విపత్తు వేళ ఏపీని ఆదుకోవాలని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అయితే ఏపీలో విద్యుత్ వ్యవస్థని పునరుద్ధరించడానికి పరికరాలను సిబ్బందిని పంపించారు. తుపాను వల్ల రాష్ట్రంలో 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయని వందలాది గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కంలు దాదాపు రెండు వేల మంది విద్యుత్ సిబ్బందిని అత్యవసర సామగ్రిని ఏపీకి పంపించారు. ఈ సిబ్బంది ఏపీలోని ఉత్తరాంధ్ర మరియు ఇతర ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతులు చేపట్టారు.

ఇచ్చి పుచ్చుకునే వైఖరితో :

బాబు సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు కావడంతో పాటు తెలంగాణా రాష్ట్రంతో ఇచ్చి పుచ్చుకునే వైఖరిని అనుసరించడం వల్లనే ఈ రోజు ఆ రాష్ట్రం కష్ట కాలంలో ఏపీకి సాయం చేసింది అని అంటున్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కలసి ముందుకు సాగాలని బాబు ఎపుడూ చెబుతూంటారు. జల వివాదాల విషయంలో ఆయన అదే మాట అంటూ వచ్చారు. బాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు కొనసాగారు. దాంతో ఆయనకు రెండు రాష్ట్రాల ప్రజల విషయంలో అభిమానం అవగాహన ఉంది. అలాగే రాజకీయ పార్టీలతో నేతలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అదే ఇపుడు అక్కరకు వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

ప్రతిపక్షం కూడా :

మరో వైపు చూస్తే దాదాపుగా ఒకే సమయంలో తెలంగాణా విపక్షం కూడా బాబుకి కితాబు ఇచ్చింది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాబు ముందు చూపుని ఆయన దార్శనికతను కొనియాడిన సంగతి తెలిసిందే. ఎల్ నినో ముప్పుని ముందుగా పసిగట్టి బాబు నీటి ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న చర్యలను కొనియాడారు. దీనిని బట్టి చూస్తే తెలంగాణాలోని అధికార పక్షం ఏపీ మీద సానుకూలంగా ఉంది, అలాగే విపక్షం కూడా కితాబు ఇస్తోంది. అలా రెండు భిన్న దృక్కోణం కలిగిన రాజకీయం ఏపీ వరకూ వచ్చేసరికి ఒకే మాటగా ఉండడం అంటే బాబు గ్రేటే మరి అనిపించకమానదు అంటున్నారు.

Tags:    

Similar News