ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?
అయితే తాజాగా వెలువడుతున్న కథనాల ప్రకారం.. ముంబై యాజమాన్యం మళ్లీ రోహిత్ శర్మకే జట్టు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది.
గెలిస్తే ఏం లోపాలు కనిపించవు.. ఓడితేనే అన్నీ అర్థమవుతాయి.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్న చందంగా.. ఇప్పుడు వరుసగా సీజన్లలో ఓడిపోతున్న ముంబై ఇండియన్స్ కు తాను చేసిన తప్పులేంటో అర్థమవుతున్నాయి. అందుకే వాటికి పరిహారాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే కోచ్ లను అందరినీ సాగనంపిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఇప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయంలో ఒక రాజీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అతడిని ఒప్పించి మెప్పించి రోహిత్ ను కెప్టెన్సీ చేసి సీనియర్ నీడలో ఆడించేందుకు హార్దిక్ ను సంసిద్ధం చేసింది. కానీ ఈ ఒరవడిలో మన తెలుగోడు తిలక్ వర్మకు మాత్రం అన్యాయం జరిగిపోయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ)లో మళ్లీ నాయకత్వ మార్పుల చుట్టూ ముమ్మర చర్చ సాగుతోంది. గత సీజన్ నుంచి ఫ్రాంచైజీలో సాగుతున్న రగడ ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. మళ్లీ రోహిత్ శర్మ చేతుల్లోకే ముంబై బాధ్యతలు వెళ్లనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో హార్దిక్ పాండ్యా తన వైఖరి మార్చుకున్నప్పటికీ తెలుగోడైన యువ సంచలనం తిలక్ వర్మకు మాత్రం నాయకత్వ అవకాశం దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
గత 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఐదు సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్ చేయడాన్ని అభిమానులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మైదానంలోనూ.. సోషల్ మీడియాలోనూ పాండ్యా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.
అయితే తాజాగా వెలువడుతున్న కథనాల ప్రకారం.. ముంబై యాజమాన్యం మళ్లీ రోహిత్ శర్మకే జట్టు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. దీనికి హార్దిక్ పాండ్యా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ కెప్టెన్సీలో సాధారణ ఆటగాడిగా ఆడేందుకు తనకేమీ అభ్యంతరం లేదని హార్దిక్ స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. కాకపోతే తనను వేరే ఏ జట్టుకూ ట్రేడ్ చేయకూడదని.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోనే కొనసాగించాలనే ఏకైక షరతును ఆయన యాజమాన్యం ముందు ఉంచినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య రోహిత్ శర్మ తన స్థానంలో భవిష్యత్తు నాయకుడిగా హైదరాబాద్‌కే చెందిన యువ బ్యాటర్ తిలక్ వర్మ పేరును సూచించినట్లు టాక్. గడిచిన కొన్నేళ్లుగా ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తిలక్‌కు కెప్టెన్సీ ఇస్తే జట్టు భవిష్యత్తుకు మేలు జరుగుతుందని 'హిట్‌మ్యాన్' భావించాడట. రోహిత్ మద్దతు లభించినప్పటికీ ముంబై మేనేజ్మెంట్ మాత్రం అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తిరిగి రోహిత్‌కే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటుకున్న తిలక్ వర్మకు ముంబై ఇండియన్స్ లాంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అర్హత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన సమయంలో బాధ్యతలు అప్పగిస్తే అతడు గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో తెలుగోడికి అన్యాయం జరిగిందని.. అతడికి దక్కాల్సిన కెప్టెన్సీ అవకాశం చేజారిందని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఇవన్నీ సోషల్ మీడియాలోనూ.. క్రికెట్ వర్గాల్లోనూ జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. వీటిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా స్పందిస్తే తప్ప అసలు విషయాలపై స్పష్టత రాదు. రోహిత్ పునరాగమనం.. హార్దిక్ షరతు.. తిలక్ వర్మ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.