ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కేవలం మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టే క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు.. అదొక వేల కోట్ల రూపాయల భారీ వ్యాపార సామ్రాజ్యం..
ఇటీవలే ఐపీఓ ద్వారా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్ గా జియో నిలిచింది. అంబానీలపై దేశంలో నమ్మకం తగ్గలేదని నిరూపితమైంది. అయితే అంబానీలు ఏ వ్యాపారంలో ఉన్నా వారిదే పైచేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంబానీల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉండడం విశేషంగా చెప్పొచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కేవలం మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టే క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు.. అదొక వేల కోట్ల రూపాయల భారీ వ్యాపార సామ్రాజ్యం.. మైదానంలో అద్భుత విజయాలతో అలరించే జట్లు.. మైదానం బయట బలమైన బ్రాండ్లుగా అవతరిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్పోర్ట్స్ మనీ వాల్యుయేషన్ సంస్థ స్పోర్టికో వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ (ఎంఐ) తన అగ్రస్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది.
రూ.20,000 కోట్ల క్లబ్లో ముంబై ఇండియన్స్
స్పోర్టికో అంచనాల ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మార్కెట్ విలువ 2.1 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.20,008.8 కోట్లు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీ రూ.20 వేల కోట్ల విలువను దాటడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు.. అంతర్జాతీయ స్టార్ల భాగస్వామ్యం.. గ్లోబల్ ఫ్యాన్ బేస్.. ఐదు టైటిళ్ల రికార్డు విజయం.. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక వాణిజ్య వ్యూహాలు ముంబైని అగ్రస్థానంలో నిలబెట్టాయి.
టాప్-10 ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువలు
ఈ జాబితాలో ముంబై తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.17,626.8 కోట్ల విలువతో రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 టైటిల్ గెలవడం.. విరాట్ కోహ్లీ సాధించిన అపారమైన క్రేజ్ ఆర్సీబీని ఈ స్థాయికి చేర్చాయి. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.16,674 కోట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 16,483 కోట్లు, 5వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16,197 కోట్లు, 6వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 15,721 కోట్లు, 7వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 15,435 కోట్లు, 8వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ రూ. 15,054 కోట్లు, 9వ స్థానంలో పంజాబ్ కింగ్స్ రూ. 14,577.8 కోట్లు, 10వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 14,280 కోట్లుతో ఉన్నాయి.
కేవలం ఆట మాత్రమే కాదు.. పక్కా బిజినెస్
గతంలో ఫ్రాంచైజీల విలువ కేవలం మ్యాచుల గెలుపోటములు.. టైటిళ్ల ఆధారంగానే లెక్కించేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా రీచ్, స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనలు, మర్చండైజ్ అమ్మకాలు, బ్రాండ్ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అయితే ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ అంటే ఆ జట్టు వద్ద ఉన్న నగదు నిల్వలు అని అర్థం కాదని.. అది కేవలం మార్కెట్ అంచనా మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మైదానంలో ప్రతి సీజన్లో విజేతలు మారవచ్చు కానీ బ్రాండ్ సామ్రాజ్యం, వ్యాపార సామర్థ్యం విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ సరిసాటి లేని శక్తిగా రాజ్యమేలుతోంది.